కాంగ్రెస్‌తో వామపక్షాల కూటమి?

CPM Allies Reluctant To Partner With Congress - Sakshi

2019 లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్‌, బీజేపీని  ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌తో పొత్తు

కోల్‌కతా: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసే విషయంపై వామపక్ష పార్టీలు సీరియస్‌గా దృష్టిసారించినట్లు సంకేతాలు అందుతున్నాయి. అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ, బీజేపీలను ఎదుర్కొనేందుకు తప్పని పరిస్థితుల్లో పొత్తుగా పోటీ చేసేందుకు సిద్ధమౌతున్నట్లు బోగట్టా. 

అయిష్టంగానే... 2016లో జరిగిన  అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం కంచుకోట పశ్చిమ బెంగాల్‌లో వామపక్ష కూటమి ఘోర పరాజయం పాలయ్యింది. ఆ ఎన్నికల్లో ఒప్పందం ప్రకారం లెఫ్ట్‌ ఫ్రంట్‌ మరియు సీపీఎంలు కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేశాయి. కానీ, ఎన్నికల్లో కూటమి కన్నా కాంగ్రెస్‌ పార్టీనే ఎక్కువ లాభపడింది(ఎక్కువ ఓట్లు పోలయ్యాయి). దీంతో మరోసారి పొత్తు తెరపైకి రాగా.. పునరాలోచన చేసుకోవాలని వామపక్ష ఫ్రంట్‌(ఫార్వర్డ్‌ బ్లాక్‌.. ఆర్‌పీఎస్‌.. మరికొన్ని చిన్న పార్టీలు) సీపీఎంకు సూచిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్‌తో పొత్తు వ్యవహారంపై సీపీఎంలో భేదాభిప్రాయాలు వ్యక్తం కావటం చూశాం. అయితే బీజేపీ, టీఎంసీలను ఎదుర్కోవాలంటే ఇదొక్కటే మార్గమని ఓ వర్గం నేతలు బలంగా వాదిస్తున్నారు.

ఈ వ్యవహారంపై బెంగాల్‌ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి స్వపన్‌ బెనర్జీ మాట్లాడుతూ..‘పొత్తులో భాగంగా వామపక్షా పార్టీలు కాంగ్రెస్‌కు ఓట్లు పడుతున్నాయి. కానీ కాంగ్రెస్‌ వైపు నుంచి మాకు ఓట్లు పడటం లేదు.  పొత్తు వల్ల అంతిమంగా కాంగ్రెస్‌ పార్టీకే లబ్ధిచేకూరుతోంది’ అని అన్నారు. అయితే ఈ విషయంలో తుది నిర్ణయం మాత్రం పార్టీ పెద్దలదేనని ఆయన స్పష్టం చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top