మేఘాలయ సీఎంగా సంగ్మా ప్రమాణం

Conrad Sangma Takes Oath As Meghalaya Chief Minister - Sakshi

నాగాలాండ్, త్రిపురలకు ఖరారైన కొత్త సీఎంల పేర్లు  

షిల్లాంగ్‌: మేఘాలయ 12వ ముఖ్యమంత్రిగా నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్‌పీపీ) చీఫ్‌ కాన్రాడ్‌ సంగ్మా బాధ్యతలు స్వీకరించారు. రాజ్‌భవన్‌లో మంగళవారం సంగ్మాతోపాటు మరో 11 మంది చేత మంత్రులుగా గవర్నర్‌ గంగా ప్రసాద్‌ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా, మణిపూర్‌ సీఎం బీరెన్‌ సింగ్‌ తదితరులు హాజరయ్యారు. సంగ్మాకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. మేఘాలయలో కాంగ్రెస్‌ 21 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచినా.. రెండే సీట్లు గెలిచిన బీజేపీ ఇతరుల మద్దతు కూడగట్టి ఎన్‌పీపీ అధికారంలోకి వచ్చేలా చక్రం తిప్పింది.  

త్రిపుర సీఎంగా విప్లవ్‌ దేవ్‌ : త్రిపురలో తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా విప్లవ్‌ దేవ్‌ నియమితులు కానున్నారు. మంగళవారం బీజేపీ, మిత్రపక్షం ఐపీఎఫ్‌టీ ఎమ్మెల్యేలు సమావేశమై విప్లవ్‌ను సీఎంగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రమాణ స్వీకార వేడుక శుక్రవారం (9వ తేదీన) జరగనుంది.  

నాగాలాండ్‌కు కొత్త సీఎం రియో: నాగాలాండ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు నేషనలిస్ట్‌ డెమోక్రాటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ (ఎన్‌డీపీపీ)ని ఆ రాష్ట్ర గవర్నర్‌ పీబీ ఆచార్య ఆహ్వానించారు. ఎన్‌డీపీపీ సీనియర్‌ నేత నీఫ్యూ రియో గురువారం ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top