కాంగ్రెస్‌కూ కాషాయం రంగు

Congress Turing As Saffron In Madhya Pradesh - Sakshi

సాక్షి, భోపాల్‌ : మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ కూడా కాషాయం రంగు పులుపుకుంటోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మెజారిటీ హిందువులను ఆకర్షించడం కోసం బీజేపీ బాటలో మత రాజకీయలను ఆశ్రయిస్తోంది. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం పదేళ్ల క్రితం మాటిచ్చి మరచిపోయిన ‘రాముడు వనవాసానికెళ్లిన బాట’ను ఓ సర్క్యూట్‌గా తాము అభివృద్ధి చేస్తామంటూ ముందుకు వచ్చింది. అందుకు సంకల్పంగా ‘రామ్‌ వన్‌ గమన్‌ పథ్‌ యాత్ర’ను నిర్వహిస్తామని ప్రకటన కూడా చేసింది. 

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ గత ఆగస్టులో రాష్ట్రంలోని ప్రముఖ గుళ్లను సందర్శించడం ద్వారా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారని చెప్పవచ్చు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ప్రతి పంచాయతీ పరిధిలో ఓ గోశాలను ఏర్పాటు చేస్తామని పార్టీ సీనియర్‌ నాయకుడు కమల్‌ నాథ్‌ ఎన్నికల ప్రచారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లారు. రాముడి మార్గాన్ని నిర్మిస్తామని మాజీ ముఖ్యమంత్రి, పార్టీ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ హామీ ఇచ్చారు. రాముడి వనవాస మార్గాన్ని నిర్మిస్తానని మాట తప్పిన శివరాజ్‌ సింగ్‌ చౌహాన్, ఎన్ని అవినీతి కుంభకోణాలు వెలుగుచూసినా వరుసగా మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా కొనసాగుతూ వస్తున్నారు. 

సంచలనం సృష్టించిన వ్యాపమ్, ఇసుక కుంభకోణాల్లో స్వయంగా శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ చేతులు కాలినప్పటికీ కూడా బీజేపీ అధిష్టానం ఆయన్నే కొనసాగించడానికి కుల, మత రాజకీయాలే కారణం. వ్యావసాయక్‌ పరీక్షా మండల్‌ (వ్యాపమ్‌)గా పిలిచే ‘మధ్యప్రదేశ్‌ ప్రొఫెషనల్‌ ఎగ్జామినేషన్‌ బోర్డు’ నిర్వహించిన వైద్య కళాశాల ప్రవేశ పరీక్షలతోపాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, పోలీసులు, అటవి సిబ్బంది తదితర 13 కేటగిరీల్లో భారీ అవకతవకలు జరిగినట్లు అప్పట్లో వెలుగులోకి రావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రాష్ట్ర మంత్రలు, ఎమ్మెల్యేలు, బడా వ్యాపారవేత్తలు, ఉన్నతాధికారుల ప్రమేయం ఉన్నట్లు కూడా వెల్లడయింది. వ్యాపమ్, ఇసుక కుంభకోణాలతోపాటు 15 ఏళ్ల బీజేపీ పాలనలో తమకు ఒరిగిందేమీ లేదన్న వివిధ వర్గాల ప్రజల ఆందోళనతో రాష్ట్రంలో బీజేపీ వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయి. ఈసారి ఎన్నికల్లో బీజేపీ మట్టి కరవడం ఖాయమని పలు సర్వేలు కూడా వెల్లడిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ కూడా కాషాయం రంగు పులుపుకోవడానికి ప్రయత్నించడం శోఛనీయం. 

ఆ మాటకొస్తే మతపరమైన రాజకీయాలు కాంగ్రెస్‌ పార్టీకి కొత్తేమి కాదు. ముస్లింల మెజారిటీ రాష్ట్రమైన కశ్మీర్‌లో హిందువులను ఆకర్షించడం కోసం మత రాజకీయాలను ఆశ్రయించిన సందర్భాలు అనేకం. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాహుల్‌ గాంధీ గుళ్లూ గోపురాలను తెగ తిరిగిన విషయం తెల్సిందే. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా అక్కడ కాంగ్రెస్‌ పార్టీ రథ యాత్రను నిర్వహించింది. మత రాజకీయాల ప్రాతిపదికనే సంఘ్‌ పరివార్‌ ఎన్నికల క్షేత్రంలోకి అడుగుపెట్టిందనే విషయం తెల్సిందే. ఇక కాంగ్రెస్‌ పార్టీ కూడా అదే బాట అనుసరిస్తుంటే లౌకికవాదం, సహనం, మైనారిటీల భద్రత, భావ ప్రకటనా స్వేచ్ఛ, అసమ్మతి వ్యక్తం చేసే స్వేచ్ఛను పరిరక్షించేందుకు ఏ పార్టీ ముందుకొస్తుందీ?

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top