ఎమర్జెన్సీ ముఖ్యమంత్రిలా కేసీఆర్‌ వ్యవహారం: జైపాల్‌

Congress Senior Leader Jaipal Reddy Slams KCR In HYderabad - Sakshi

హైదరాబాద్‌: ఆపద్ధర్మ ముఖ్యమంత్రిలా కాకుండా ఎమెర్జెన్సీ ముఖ్యమంత్రిలా కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ..అందరి హక్కులూ కేసీఆర్‌ హరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆపద్ధర్మ సీఎంగా అసలు సీఎం కంటే ఎక్కువ అధికారం చెలాయిస్తున్నారని విమర్శలు చేశారు. కొడంగల్‌ నియోజకవర్గంలో రేవంత్‌ రెడ్డి అరెస్ట్‌ దుర్మార్గం అని వ్యాక్యానించారు. ఇంతకు ముందు ఇలాంటి దుష్టాంతాలు ఎప్పుడూ జరగలేదని తెలిపారు.

రాహుల్‌ గాంధీ మీటింగ్‌కు తాను కూడా కొడంగల్‌ వెళ్లానని, తాము వచ్చాక ఎలాంటి సెర్చ్‌ వారంట్‌ లేకుండా కాంగ్రెస్‌ కార్యకర్తల ఇళ్లల్లో దుర్మార్గంగా సోదాలు చేశారు..దానికి నిరసనగానే రేవంత్‌ రెడ్డి ప్రొటెస్ట్‌ కాల్‌ ఇచ్చారు.. మొదట ఇచ్చిన బంద్‌ పిలుపును విరమించుకుని నిరసన పిలుపు ఇచ్చారని తెలిపారు. అది కూడా సీఎం మీటింగ్‌ జరిగే కోస్గిలో కాదని, కోస్గి అవతల ఉన్న కొడంగల్‌లో అని వెల్లడించారు. కానీ నేరుగా అర్దరాత్రి పోలీసులు దొంగళ్లా వెళ్లి భార్యా పిల్లలతో బెడ్‌రూంలో ఉన్నప్పుడు డోర్‌ పగలగొట్టి అరెస్ట్‌ చేశారని చెప్పారు. 

ఇంకా మాట్లాడుతూ..‘ రేవంత్‌ రెడ్డి భార్య నా తమ్ముడి కూతురు. నాకు రాత్రి ఫోన్‌ చేసింది. నేను కేసీఆర్‌ను అడుగుతున్నా. రేపు కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక నీ కూతురిని అలానే డోర్‌ పగలగొట్టి అరెస్ట్‌ చేస్తే ఊరుకుంటావా.  కొన్ని వందల మంది రేవంత్‌ రెడ్డి అనుచరులను అరెస్ట్‌ చేశారు. కేసీఆర్‌ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి కేర్‌ టేకర్‌ మాత్రమే పూర్తి సీఎం కాదు. అయినా పోలీసు అధికారులు కేసీఆర్‌కు వంత పాడుతున్నారు. ఈ విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళతాం. ఓటమి భయం పట్టుకునే సీఎం కేసీఆర్‌ నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారు. అందుకే సంగారెడ్డిలో జగ్గారెడ్డి, గజ్వేల్‌లో ప్రతాప్‌ రెడ్డి, కొడంగల్‌లో రేవంత్‌ రెడ్డి పట్ల దుర్మార్గం వ్యవహరిస్తున్నారు. లేక లేక సీఎం అయిన నువ్వెంత? నీ శక్తి ఎంత? అసలు నువ్వెవరు?. పోలీసులు సీఎం కేసీఆర్‌కు ఛప్రాసీల్లా ఎందుకు పనిచేస్తున్నారని’   జైపాల్‌ రెడ్డి ప్రశ్నించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top