ఆ 32 సీట్లు బీసీలకేనా..? | Sakshi
Sakshi News home page

ఆ 32 సీట్లు బీసీలకేనా..?

Published Sun, Oct 28 2018 2:48 AM

That Congress seats for BC Candidates? - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసేందుకు బీసీ సామాజిక వర్గాలకు చెందిన నేతలకు 32 స్థానాల్లో అవకాశం వస్తుందా? ఈ స్థానాల్లో పోటీచేసే బీసీ ఆశావహుల జాబితా ఏఐసీసీ స్క్రీనింగ్‌ కమిటీకి చేరిందా? ఆయా స్థానాల్లో ఒక్కొక్కరి చొప్పున నేతల పేర్లు షార్ట్‌లిస్ట్‌ అయిన మాట వాస్తవమేనా?.. ఇప్పుడు గాంధీభవన్‌ వర్గాల్లో ఈ ప్రశ్నలపైనే చర్చ జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 32 స్థానాల్లో బీసీ సామాజిక వర్గాలకు చెం దిన నేతలకు అవకాశమిస్తారని, ఈ మేరకు ఏఐసీసీ స్క్రీనింగ్‌ కమిటీకి పంపారంటూ ఓ జాబితా వాట్సాప్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ జాబితా ప్రకారం ఉమ్మడి కరీంనగర్‌లో 3, ఖమ్మంలో 2, వరంగల్‌లో 2, మెదక్‌లో 3, నిజామాబాద్‌లో 5, నల్లగొండలో 2, మహబూబ్‌నగర్‌లో 1, ఆదిలాబాద్‌లో 3, రంగారెడ్డిలో 6, హైదరాబాద్‌లో 5 స్థానాలు బీసీ నేతలకు ఇస్తున్నట్లు ఆ జాబితాలో ఉంది.

సామాజిక వర్గాల వారీగా పరిశీలిస్తే ఇందులో యాదవులకు అత్యధికంగా 10, మున్నూరుకాపులకు 8, గౌడ్‌లకు 6, పద్మశాలీలకు 2, లింగాయత్‌లకు 2, విశ్వకర్మ, ముదిరాజ్, మేదరి, లోధా కులానికి చెందిన ఒక్కో నేత పేర్లు జాబితాలో ఉన్నాయి. ఈ జాబితాలో పేర్కొన్న స్థానాల్లో దాదాపు 90 శాతం టికెట్లు ఖరారవుతాయని కొందరు అంటుండగా, అది కేవలం కొందరు వ్యక్తిగతంగా తయారుచేసిందని, ఇందులో ఎక్కువ మందికి సీట్లు దక్కే అవకాశం ఉన్నా, కనీసం ఏడెనిమిది చోట్ల అటు సామాజిక వర్గాలతో పాటు ఇటు నేతల పేర్లలో కూడా మార్పులుంటాయనే చర్చ జరుగుతుండటం గమనార్హం.   

Advertisement
Advertisement