కేరళలో కాంగ్రెస్‌ దశ తిరిగినట్టేనా?

Congress Party Positive Vibes in Kerala - Sakshi

వయనాడ్‌ నుంచి రాహుల్‌ పోటీతో జోష్‌

యునైటెడ్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ పంట పండినట్టే!

ఎన్నికల్లో విజయావకాశాలనేవి ఎప్పుడు పెరుగుతాయో.. ఎప్పుడు తరుగుతాయో కచ్చితంగా చెప్పలేమంటారు. చివరి క్షణం వరకూ పరిస్థితులు మారుతూనే ఉంటాయి. కాంగ్రెస్‌ విషయంలోనూ ఇప్పుడదే జరుగుతోంది. దేశవ్యాప్త పరిస్థితి ఏమిటన్నది పక్కనపెడితే.. కొంత ఊగిసలాట తరువాత కేరళలోని వయనాడ్‌ నుంచి పోటీకి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సిద్ధపడటంతో ఆ పార్టీ భాగస్వామిగా ఉన్న యునైటెడ్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ (యూడీఎఫ్‌) కూటమి పంట పండిందని అంటున్నారు పరిశీలకులు.

కేరళలో ఐదేళ్లకు ఒకసారి అధికారం చేతులు మారుతూ ఉంటుంది. ప్రజలు ఒకసారి వామపక్షాలతో కూడిన లెఫ్ట్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌కు పట్టం కడితే.. మరోసారి కాంగ్రెస్‌ ఐయూఎంఎల్‌ తదితర పార్టీలతో కూడిన యూడీఎఫ్‌కు అధికారమివ్వడం కద్దు. ఇందుకు తగ్గట్టుగానే ఈసారి యూడీఎఫ్‌దే అధికారమని చాలామంది భావించారు. అయితే చివరి నిమిషం వరకూ అభ్యర్థులను ప్రకటించకపోవడంతో కొంత అసందిగ్ధత ఏర్పడింది. కానీ, వయనాడ్‌ నుంచి రాహుల్‌ గాంధీ పోటీ ఖరారు కావడంతో యూడీఎఫ్‌లో కొత్త జోష్‌ వచ్చింది. అంతేకాదు.. కన్నూర్‌ జిల్లా వడకర నుంచి కె.మురళీధరన్‌ పోటీపై నెలకొన్న అస్పష్టత కూడా తొలగిపోవడంతో ఈ కూటమి ప్రచారానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. ఎన్నికలకు ఇంకా 22 రోజులు ఉండటం.. అన్ని స్థానాల్లో గట్టి పోటీ ఇవ్వగల అభ్యర్థులను నిలపడం వంటి కారణాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే ఈసారి యూడీఎఫ్‌ కేరళలో అత్యధిక స్థానాలనుకైవసం చేసుకునే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు.

రాహుల్‌ అభ్యర్థిత్వం కీలకం
కేరళ ఎన్నికల ఫలితాలను రాహుల్‌ అభ్యర్థిత్వం బాగా ప్రభావితం చేస్తుందని అంచనా. వయనాడ్, కోజికోడ్, మళ్లపురం జిల్లాలతో కూడిన వయనాడ్‌ గాంధీ కుటుంబానికి సురక్షితమైన స్థానంగానే భావిస్తున్నారు. ప్రధాని అభ్యర్థి ఒకరు ఈ స్థానం నుంచి పోటీ చేస్తున్నారంటే.. దాని ప్రభావం ఇరుగు పొరుగున ఉండే మలబార్, పాలక్కాడ్, కాసరగోడ్‌ ప్రాంతాల ఎన్నికలపైనా ఉంటుందనడంలో సందేహం లేదు. ఇవన్నీ యూడీఎఫ్‌కు కలిసొచ్చే అంశాలు. అయితే మధ్య కేరళ ప్రాంతంలో మాత్రం యూడీఎఫ్‌కు గట్టి పోటీ ఎదురవుతోంది. చాలక్కుడి, ఇడుక్కి జిల్లాల్లో గత ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్‌ చేతిలో యూడీఎఫ్‌ ఓటమి పాలైన విషయం ఇక్కడ చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక యూడీఎఫ్‌కు బాగా పట్టున్న ఎర్నాకుళంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కె.వి.థామస్‌ను పక్కనబెట్టి యువ హిబీ ఈడెన్‌ను బరిలోకి దింపింది. ఎల్డీఎఫ్‌ కూడా పి.రాజీవ్‌ రూపం లో ఓ యువ అభ్యర్థిని నిలిపినప్పటికీ ఈసారి హిబి ఈడె న్‌కు అవకాశం ఎక్కువని విశ్లేషకులు అంటున్నారు.

కొట్టాయంలో రసకందాయం
2014 ఎన్నికల్లో ఇక్కడ యూడీఎఫ్‌ భాగస్వామి కేరళ కాంగ్రెస్‌ లక్షకుపైగా మెజార్టీతో గెలుపొందింది. ఆ పార్టీలో అంతర్గత విభేదాలు నడుస్తున్నా.. ఈ పార్టీని వ్యతిరేకించే నేతల మద్దతుతో యూడీఎఫ్‌ ఈసారి ఎన్నికల్లో గట్టెక్కే అవకాశం కనిపిస్తోంది. ఎల్డీఎఫ్‌ ఈ స్థానానికి కొత్త అభ్యర్థిని ప్రకటించడం ఆ కూటమికి నష్టం చేకూర్చే అంశంగా పరిగణిస్తున్నారు. కొట్టాయానికి పొరుగున ఉన్న పథనంతిట్టలో సిట్టింగ్‌ ఎంపీ ఆంటోనీ మరోసారి పోటీ చేస్తున్నారు. ఎల్డీఎఫ్‌ ఈ స్థానంలోని క్రిస్టియన్‌ మెజార్టీ ఓటర్లను ఆకట్టుకునే ఉద్దేశంతో అరణ్మూల ఎమ్మెల్యే వీణా జార్జ్‌ను బరిలోకి దింపింది. అయితే ఆర్థడాక్స్‌ చర్చ్‌ ఎల్డీఎఫ్‌కు వ్యతిరేకమన్నది ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. శబరిమల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను ఎల్డీఎఫ్‌ ప్రభుత్వం అమలు చేయలేకపోయిందన్న భావన కూడా ఇక్కడ ఉంది. శబరిమల అంశం తనకు కలిసివస్తుందని పథనంతిట్ట బీజేపీ అభ్యర్థి కె.సురీంద్రన్‌ భావిస్తున్నప్పటికీ పూంజార్, కంజీరప్పళ్లి అసెంబ్లీ స్థానాలు యూడీఎఫ్‌కు అనుకూలంగా ఉండటం వల్ల ఫలితం ఆసక్తికరంగా మారనుంది.

దక్షిణ కేరళ పరిస్థితి...
కేరళ దక్షిణ ప్రాంతంలోని చాలా స్థానాల్లో శబరిమల అంశం ఎల్డీఎఫ్‌కు వ్యతిరేకంగా.. యూడీఎఫ్‌కు అనుకూలంగా మారనుందని అంచనా. రాజధాని తిరువనంతపురంలో 2014 నాటి ఎన్నికలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. కాంగ్రెస్‌ అభ్యర్థి శశిథరూర్‌కు బీజేపీ అభ్యర్థి ఒ.రాజగోపాల్‌ నుంచి గట్టిపోటీ ఎదురైంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఈసారి రాష్ట్ర అధ్యక్షుడు కుమ్మనం రాజశేఖరన్‌ను బరిలోకి దింపింది. అయితే ముక్కోణపు పోటీ కావడం శశిథరూర్‌కు కలిసివస్తుందని, ఎల్డీఎఫ్‌ అభ్యర్థి సి.దివాకరన్‌ మూడోస్థానానికి పరిమితమవుతాడని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అటింగళ్‌లో ఎల్డీఎఫ్‌ అభ్యర్థి ఎ.సంపత్‌కు కొంత మొగ్గు ఉన్నట్టు కనిపిస్తున్నా అదూర్‌ ప్రకాశ్‌ రూపంలో కాంగ్రెస్‌ బలమైన ప్రత్యర్థిని నిలపడంతో ఈసారి పోటీ ఆసక్తికరంగా మారింది. కొల్లంలోనూ పరిస్థితి ఇదే తీరున ఉండనుంది. యూడీఎఫ్‌కు గట్టి పట్టున్న పొన్నానిలో ఈసారి తమకు గెలుపు అవకాశాలు ఉంటాయని ఎల్డీఎఫ్‌ భావిస్తోంది. నీలంబర్‌ ఎమ్మెల్యే పి.వి.అన్వర్‌కు ఉన్న ధనబలం ఐయూఎంఎల్‌ అభ్యర్థి ఈటీ మహమ్మద్‌ బషీర్‌ను ఓడిస్తుందన్నది ఎల్డీఎఫ్‌ అంచనా. అయితే వయనాడ్‌లో రాహుల్‌గాంధీ పోటీ ప్రభావం దీనిపై ఉంటుందని, కోజికోడ్, కన్నూర్, వడక్కరలోనూ ఇదే పరిస్థితి అని పరిశీలకులు భావిస్తున్నారు. కాసరగోడ్‌ సీపీఎంకు బలమైన స్థానమైనప్పటికీ అక్కడి నుంచి కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రాజ్‌మోహన్‌ ఉన్నితన్‌ పోటీ చేస్తుండటం ఎల్డీఎఫ్‌కు వ్యతిరేక ఫలితాలు వచ్చేందుకు కారణమవుతుందని అంచనా.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top