బీజేపీని ప్రభుత్వం ఏర్పాటు చేయనివ్వం: కాంగ్రెస్‌ ఎంపీ

Congress MP Says Wont Let BJP Form Government In Maharashtra - Sakshi

ముంబై : మహారాష్ట్రలో బీజేపీ మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు లేకుండా చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ హుసేన్‌ దల్వాయి అన్నారు. తమ పార్టీ ఎంపీలు ప్రలోభాలకు లొంగరు అని.. అధిష్టానం సూచనలను వారు శిరసా వహిస్తారని విశ్వాసం చేస్తారు. ముఖ్యమంత్రి పదవి విషయంలో సయోధ్య కుదరకపోవడంతో కూటమిగా ఎన్నికల బరిలో దిగిన బీజేపీ- శివసేన మధ్య విభేదాలు తలెత్తడంతో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శనివారంతో అసెంబ్లీ గడువు ముగియనున్న నేపథ్యంలో ఎన్సీపీ, కాంగ్రెస్‌ పార్టీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేద్దామని భావించిన శివసేనకు ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ షాకిచ్చారు. ప్రతిపక్షంలోనే కూర్చుంటామని తేల్చిచెప్పడంతో శివసేనకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ క్రమంలో తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించిన శివసేన వారిని హోటల్‌కు తరలించి.. వారిని కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కూడా లాక్కునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందనే వార్తలు ప్రచారమవుతున్నాయి.(చదవండి : ప్రభుత్వం ఏర్పాటు చేద్దాం; సోనియాకు లేఖ!)

ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ హుసేన్‌ దల్వాయి గురువారం మీడియాతో మాట్లాడారు. ‘మా ఎమ్మెల్యేలంతా కలిసికట్టుగా ఒకేమాటపై ఉన్నారు. పార్టీ నియమాలను ఉల్లంఘించరు. అధిష్టానం చెప్పినట్లుగా నడుచుకుంటారు. రాష్ట్రంలో బీజేపీని మరోసారి అధికారంలోకి రానివ్వం. ఎన్సీపీ మా మిత్రపక్షం. వాళ్లు మాతోనే ఉన్నారు. బీజేపీ నుంచి మహారాష్ట్రను కాపాడేందుకే ప్రజలు మాకు ఓటేశారు. ప్రభుత్వ ఏర్పాటుపై మేము చర్చించాం. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ నాయకుడిని ముఖ్యమంత్రిని కానివ్వబోం. మా ఎమ్మెల్యేలను కొనాలనే బీజేపీ ప్రయత్నాలు ఫలించవు. ఎన్నికలకు ముందుకు పార్టీ ఫిరాయించి బీజేపీలో చేరిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తిరిగి పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు’ అని పేర్కొన్నారు. కాగా 288 శాసనసభ స్థానాలు కలిగిన మహారాష్ట్రలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్‌ 44 సీట్లు గెలుపొందిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా... మిత్రపక్షం ఎన్సీపీ, శివసేనతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ఆలోచన చేయాలని హుసేన్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాసిన విషయం విదితమే.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top