
సాక్షి, వరంగల్ రూరల్ : ఎటువంటి సమాచారం లేకుండా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌లో తనిఖీలు చేయడం పట్ల కాంగ్రెస్ తాజా మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముందస్తు సమాచారం లేకుండా మా పార్టీ కార్యలయంలో తనిఖీలు జరిపే అధికారం అధికారులకు ఉంది. కానీ తనిఖీలు చేసే సందర్భంలో తహశీల్దార్, కమిషనర్, ఇంటి యాజిమాని లేదా పార్టీ కార్యాలయ బాధ్యునికైనా సమాచారం ఇవ్వడం కనీస ధర్మమన్నారు.
నిబంధనలు పాటించకుండా మా పార్టీ కార్యాలయం తాళం పగలగొట్టడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఇది అధికార టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు చేయించిన దుర్మార్గపు చర్యగా ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇలాంటి సంఘటనలు తన రాజకీయ జీవితంలో ఎన్నడు చూడలేదంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇకముందు కూడా అధికారులు ఇలాంటి చర్యలకు పాల్పడితే ఎలక్షన్ కమిషన్ అధికారులకు, పై అధికారులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. స్నేహపూర్వక వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా చూడాలంటూ అధికారులను కోరారు. ఎన్నికల్లో ఓటర్లను మభ్యపెట్టేందుకు.. చీరలు రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడ్డ సంస్కృతి టీఆర్‌ఎస్ పార్టీదంటూ ఆయన ధ్వజమేత్తారు.