వేచి చూసే ధోరణిలోనే కాంగ్రెస్‌

Congress May Offer CM Post to Dushyant Chautala - Sakshi

న్యూఢిల్లీ: హర్యానాలో తిరిగి అధికార పగ్గాలు చేపట్టడానికి బీజేపీ ఒకపక్క వ్యూహరచన చేస్తుండగా, మరోపక్క ప్రస్తుతానికి వేచి చూసే ధోరణిని అవలంభించాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. 90 సీట్ల హర్యానా అసెంబ్లీలో బీజేపీ అధికారానికి ఆరు సీట్ల దూరంలో ఆగిపోయింది. 10 స్థానాలు సంపాదించిన దుష్యంత్‌ చౌతాలా నేతృత్వంలోని జేజేపీతో అవగాహనకు బీజేపీ పావులు కదుపుతోంది. మరోవంక కాంగ్రెస్‌ సైతం చౌతాలాతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. వేచిచూసే ధోరణిని అవలంభిస్తూనే... బీజేపీ తిరిగి అధికార పగ్గాలు చేపట్టకుండా వీలైన అన్ని చర్యలూ తీసుకోవడంపై కాంగ్రెస్‌ దృష్టి పెడుతున్నట్లు సమాచారం. ఇందుకు బీజేపీయేతర పార్టీలు, వాటి నేతలు ఏకతాటిపైకి రావాలనీ కోరుతోందని సమాచారం.  

ఢిల్లీకి కాంగ్రెస్‌ మాజీ సీఎం
ఆయా అంశాలపై  అధిష్టానంతో చర్చించడానికి కాంగ్రెస్‌ మాజీ ముఖ్యమంత్రి భూపేంద్ర సింగ్‌ హుడా ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. గురువారం కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలతో సమావేశమైన ఆయన, శుక్రవారం పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతోనూ భేటీ అవుతారని తెలుస్తోంది. ఏఐసీసీ  జనరల్‌ సెక్రటరీ, హర్యానా ఇన్‌చార్జ్‌ గులాంనబీ ఆజాద్, సీనియర్‌ పార్టీ నేత అహ్మద్‌ పటేల్‌తో కూడా హుడా సమావేశం కానున్నారు. నిజానికి గురువారం ఉదయమే సోనియాగాంధీ హుడాకు ఫోన్‌ చేసి ఎన్నికల తీర్పు, పార్టీ ప్రభుత్వ ఏర్పాటు అవకాశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. కాగా బీజేపీయేతర పార్టీలతో గ్రాండ్‌ అలయెన్స్‌ ఏర్పాటుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.    

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top