వ్యవస్థలను అవమానించారు

Congress damaged key institutions during its rule - Sakshi

గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు చేసిందదే

వాళ్లు అధికారంలోకి వస్తే అది పునరావృతం

ప్రజలు బాగా ఆలోచించి ఓటేయాలి: బ్లాగ్‌ పోస్టులో మోదీ సూచన

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అధికారంలో ఉండగా పార్లమెంటు, న్యాయ వ్యవస్థ, మీడియా, సైన్యం ఇలా ఏ ఒక్కదాన్నీ వదలకుండా అన్ని వ్యవస్థలనూ ఆ పార్టీ అవమానించిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో బాగా ఆలోచించి ఓటేయాలని ప్రజలను ఆయన బుధవారం కోరారు. కాంగ్రెస్‌ తర్వాత వచ్చిన తమ ప్రభుత్వం పరిస్థితులను మార్చేసిందని మోదీ ఓ బ్లాగ్‌పోస్ట్‌లో చెప్పుకొచ్చారు. ‘మీరు ఓటేయడానికి వెళ్లినప్పుడు గతాన్ని గుర్తు తెచ్చుకోండి. అధికారం చేపట్టాలన్న ఒక్క కుటుంబం ఆరాటం దేశానికి ఎంత నష్టం కలిగించిందో మనసులో పెట్టుకుని ఓటేయండి. ఇప్పుడు అధికారంలోకి వస్తే మళ్లీ అలాగే చేస్తారు’ అని మోదీ అన్నారు.

‘ప్రెస్‌ నుంచి పార్లమెంటు వరకు, సైనికుల నుంచి వాక్‌ స్వేచ్ఛ వరకు, రాజ్యాంగం నుంచి కోర్టుల వరకు, వ్యవస్థలను అవమానించడమే కాంగ్రెస్‌ నైజం. అందరూ తప్పు, కాంగ్రెస్‌ మాత్రమే ఒప్పు అనేది వారు నమ్మే సిద్ధాంతం’ అంటూ మోదీ కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు. వంశపారం పర్యంగా పాలన సాగించే పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు పార్లమెంటు సమావేశాలు సరిగ్గా జరిగేవి కాదనీ, అదే వారసత్వ రాజకీయాలు చేయని పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు పని ఎక్కువ జరిగిందనడానికి గణాంకాలే నిదర్శనమని మోదీ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం తెచ్చిన తొట్టతొలి రాజ్యాంగ సవరణ వాక్‌స్వాతంత్య్రాన్ని హరించేందుకు ఉద్దేశించినదనీ, స్వేచ్ఛగా పనిచేసే మీడియా ఉండటం వారసత్వ పార్టీలకు నచ్చలేదని ఆరోపించారు.

బీజేపీవీ వారసత్వ రాజకీయాలే: కాంగ్రెస్‌
వారసత్వాల గురించి మాట్లాడటం, కాంగ్రెస్‌ను దూషించడం తగ్గించి మోదీ అసలైన ప్రజా సమస్యలపై ప్రసంగాలు చేస్తే మంచిదని కాంగ్రెస్‌ నేత కపిల్‌ సిబల్‌ అన్నారు. ‘ ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబం ఆరెస్సెస్‌. ఆరెస్సెస్‌ ఓ కుటుంబమైనప్పుడు, ఆ కుటుంబంలోని వారికే పదవులు దక్కుతున్నప్పుడు వారివి వారసత్వ రాజకీయాలు కావా? అని ప్రశ్నించారు. వ్యవసాయ సంక్షోభం, నిరుద్యోగిత ఇలా  ఎన్నో సమస్యలు దేశాన్ని పీడిస్తున్నాయనీ, మోదీ వాటి గురించి ఏ సభలోనూ ప్రస్తావించకుండా కేవలం కాంగ్రెస్‌పైనే ఎప్పుడూ ఆరోపణలు చేస్తారని దుయ్యబట్టారు.
 
కాపలాదారుడు దేశభక్తుడితో సమానం
గతంలో మోదీ చాలా సార్లు తనను తాను దేశానికి కాపలాదారుడినని (చౌకీదార్‌) చెప్పుకోవడం, అనంతరం రఫేల్‌ కుంభకోణాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ ‘కాపలాదారుడే దొంగ’ అని ప్రచారం చేయడం తెల్సిందే. అలా ప్రచారం చేసి కాపలాదారులను కాంగ్రెస్‌ అవమానించిందని మోదీ అన్నారు. నేరుగా తన పేరు చెప్పే దమ్ము లేక కాంగ్రెస్‌ పార్టీ కాపలాదారులను అడ్డం పెట్టుకుని తనపై ఆరోపణలు చేస్తోందన్నారు. 25 లక్షల మంది కాపలాదారు(వాచ్‌మెన్‌)లను ఉద్దేశించి మోదీ ఆన్‌లైన్‌ ద్వారా బుధవారం ప్రసంగించారు. అందులో ఆయన మాట్లాడుతూ కాపలాదారుడు అనే పదం నిజాయితీపరుడికి, దేశ భక్తుడికి పర్యాయపదంగా మారిందన్నారు. ఎన్నికల కోసం మోదీ ఇటీవలే ‘నేనూ కాపలాదారుడినే’ అనే ప్రచార కార్యక్రమం ప్రారంభించడం తెలిసిందే. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top