సంచలన వ్యాఖ్యలు చేసిన డీకే శివకుమార్‌

Congress Claimed That Nagesh Has Been Hijacked by BS Yeddyurappa - Sakshi

బెంగళూరు : కర్ణాటక రాష్ట్రంలో జనతా దళ్‌ (సెక్యులర్‌), కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన 14 మంది శాసనసభ్యుల రాజీనామాతో కర్ణాటక ప్రభుత్వంలో తలెత్తిన రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. ఈ క్రమంలో రాజీనామ చేసిన రాష్ట్ర మంత్రి, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే నగేష్‌ను యడ్యూరప్ప హైజాక్‌ చేశారంటూ కాంగ్రెస్‌ నాయకులు సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయంపై మంత్రి డీకే శివకుమార్‌ మాట్లాడుతూ.. ‘ఇంతకుముందే నగేష్‌ నాకు కాల్‌ చేశారు. యడ్యూరప్ప పీఏ తనను హైజాక్‌ చేశాడని చెప్పారు. వెంటనే నేను విమానాశ్రయానికి వెళ్లాను. ఆ లోపే విమానం వెళ్లి పోయింది’ అన్నారు. ఇదంతా యడ్యూరప్ప దర్శకత్వంలోనే జరుగుతుందని శివకుమార్‌ ఆరోపించారు.

ఇదిలా ఉండగా స్వతంత్ర అభ్యర్థి అయిన నగేష్‌ గత నెలలోనే జేడీఎస్‌-కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తాజా సంక్షోభ పరిస్థితుల్లో నగేశ్‌ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్‌ వాజుభాయ్‌ వాలాను కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్‌-కాంగ్రెస్‌ ప్రభుత్వానికి తన మద్దతు ఉపసంహరించుకుంటున్నానని, ఒక వేళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీని ఆహ్వానిస్తే ఆ పార్టీకి మద్దతిస్తానని గవర్నర్‌కు రాసిన లేఖలో నగేశ్ పేర్కొన్నారు. రాజీనామా చేసిన ఆయన ఇప్పటికే ముంబయి చేరుకుని తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కలిశారు. విమానాశ్రయంలో నగేష్‌ విమానం వద్దకు నడుచుకుంటూ వెళ్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top