మోదీకి పోటీగా ‘ముగ్గురు మొనగాళ్లు’

Congress backed trio that check to Narendra Modi in Gujarat - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అటు పాలకపక్ష భారతీయ జనతా పార్టీకి, ఇటు కాంగ్రెస్‌ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం రెండు పార్టీలు చమటోడుస్తున్నాయి. పార్టీ స్థాయిలో నరేంద్ర మోదీ వర్సెస్‌ రాహుల్‌ గాంధీగా కనిపిస్తున్నప్పటికీ స్థానికంగా నరేంద్ర మోదీ వర్సెస్‌ ముగ్గురు కుర్రాళ్లు అన్న చందంగా ఎన్నికల రణ క్షేత్రం కొనసాగుతోంది. గుజరాత్‌లో ముఖ్యమంత్రి స్థాయి అభ్యర్థి కాంగ్రెస్‌ పార్టీకి లేకపోవడంతో అల్పేష్‌ ఠాకూర్, జిగ్నేష్‌ మెవాని, హార్దిక్‌ పటేల్‌ అనే ముగ్గురు యువకులను ఆ పార్టీ నమ్ముకుంది. ఓ ముగ్గురు ఒక్కటిగా మోదీని ఒక్కడిగా ఎదుర్కొంటున్నారు.

ముగ్గురిలో అల్పేష్‌ ఠాకూర్‌ పార్టీకి చెందిన ఓబీసీ నాయకుడు. జిగ్నేష్‌ మెవాని బీసీ నాయకుడు. పాలకపక్ష బీజేపీపైనున్న కోపంతో కాంగ్రెస్‌తో చేతులు కలిపారు. ఇక పటేళ్ల వర్గానికి నాయకత్వం వహిస్తున్న హార్దిక్‌ పటేల్,  చచ్చినా బీజేపీకి మద్దతిచ్చే ప్రసక్తే లేదని ఇప్పటికే స్పష్టం చేశారు.  త్వరలో కాంగ్రెస్‌తో చేతులు కలపనున్నారు. పటేళ్ల రిజర్వేషన్ల అంశంపై పార్టీ వైఖరిని స్పష్టం చేయాలంటూ నవంబర్‌ 3వ తేదీ వరకు ఆయన కాంగ్రెస్‌ పార్టీకి గడువు ఇచ్చారు. ఎలాగైనా హార్దిక్‌ పటేల్‌తో రాజీ కుదుర్చుకోక తప్పని పరిస్థితి కాంగ్రెస్‌ది. కనుక, ఈ ముగ్గురు యువ కిషోరాల మీదనే ఆధారపడి ఉన్నది కాంగ్రెస్‌ పార్టీ విజయం.  ఈ ముగ్గురు పార్టీ కోసం కృషి చేస్తున్నప్పటికీ అల్పేష్‌ ఠాకూర్‌ ఒక్కరే పార్టీ ముఖమని పార్టీ ఐటీ సెల్‌ గుజరాత్‌ చీప్‌ రోహన్‌ గుప్తా తెలిపారు.

ఒక్క రిజర్వేషన్ల అంశాన్నే ఈ యువ నాయకులు ప్రస్తావించడంగానీ, మంజూరు చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ చెప్పడంగానీ చేయడం లేదని గుప్తా అన్నారు. రిజర్వేషన్లు మాత్రమే కాకుండా ప్రొహిబిషన్, మహిళల భద్రత, నిరుద్యోగం, జీఎస్టీ, నోట్ల రద్దు లాంటి చాలా అంశాలు ఉన్నాయని అన్నారు. గుజరాతీలకు 85 శాతం ఉద్యోగాలివ్వాలని అల్పేష్‌ ఠాకూర్‌ డిమాండ్‌ చేస్తున్నారని ఆయన చెప్పారు.

ఈ ముగ్గురు నాయకులు మూడు వర్గాలకు నాయకత్వం వహిస్తున్నప్పటికీ వారంతా బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఎలాగైనా పార్టీకి విజయం సాధించి పెట్టాలని భావిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర వ్యాప్తంగా 52 సభల్లో మాట్లాడుతున్నారు. మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి శంకర్‌ సింహ్‌ వాఘేలా నాయకత్వంలో కొంత మంది సిట్టింగ్‌ సభ్యులు కూడా కాంగ్రెస్‌ పార్టీని దెబ్బతీసే అంశమే అయినప్పటికీ వారంతా తిరిగి పార్టీలోకి వచ్చే అవకాశం లేకపోలేదని గుప్తా ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

ఇక రాహుల్‌ గాంధీ కూడా గుజరాత్‌లో విస్తతంగా పర్యటిస్తూ ఎన్నికల ప్రచారం చేయడమే కాకుండా ట్విట్టర్‌ లాంటి సామాజిక మీడియాలో ప్రధాని మోదీతో పోటీ పడుతున్నారు. కుక్కపిల్లతో ఉడుకుంటున్న ఫొటోను ఆయన రాహుల్‌ ట్వీట్‌ చేయగా, దాన్ని కొన్ని గంటల్లోనే ఆరువేలకు పైగా రీట్వీట్‌ చేయడంతోపాటు 12 వేల మంది లైక్‌ చేశారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top