టీడీపీని వీడని నేతల కయ్యం

Conflicts In PSR Nellore TDP Party - Sakshi

మంత్రి సోమిరెడ్డి, ఆదాల మధ్య పెరిగిన అగాథం

కత్తులు దూసుకుంటున్న పోలంరెడ్డి, చేజర్ల

సీఎం చంద్రబాబు ముందే తాడోపేడో తేల్చుకుంటామంటున్న నేతలు

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: తెలుగుదేశం పార్టీలో నేతల మధ్య అంతర్గత పోరు తారాస్థాయికి చేరుకుంది. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై మాజీ మంత్రి ఆదాల ప్రభాకరరెడ్డి పరోక్షంగా విమర్శలు చేసి 24 గంటలు గడవక ముందే కోవూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పోలంరెడ్డికి, టీడీపీ సీనియర్‌ నేత చేజర్ల వెంకటేశ్వరరెడ్డి మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. బూత్‌ కమిటీల విషయంలో ఇద్దరి మధ్య రాజుకున్న వివాదం మరింత ముదిరింది. కొడవలూరు మండలం నార్తురాజుపాళెం గురువారం జరిగిన టీడీపీ సమావేశం ఇందుకు వేదికైంది. ఆత్మకూరు, కోవూరు నియోజకవర్గాల్లో నేతల మధ్య వివాదాలు కొంతకాలంగా సాగుతూనే ఉన్నాయి. ఈ  నియోజకవర్గాల్లో పార్టీ అధిష్టానం జోక్యం చేసుకున్నా నేతల తీరులో ఎలాంటి మార్పు రాలేదు. రెండు వారాలుగా ఈ విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఆత్మకూరు ఇన్‌చార్జి విషయంలో ఆదాల, సోమిరెడ్డి మధ్య మొదలైన వివాదం కొనసాగుతూనే ఉంది.

ఇటీవల ఆత్మకూరులో జరిగిన పార్టీ సమావేశంలో మంత్రి సోమిరెడ్డి జిల్లాలో పార్టీని నాశనం చేస్తున్నాడంటూ ఆదాల పరోక్ష విమర్శలు చేశారు. బుధవారం నెల్లూరు రూరల్‌లో జరిగిన పార్టీ సమావేశంలో మంత్రిపై మాటల యుద్ధాన్ని తీవ్రతరం చేశారు. సోమిరెడ్డి వైఖరిపై అధిష్టానం వద్దేతేల్చుకునేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఇక కోవూరు నియోజకవర్గంలో ఆది నుంచి ఎమ్మెల్యే పోలంరెడ్డి వైఖరిని చేజర్ల వెంకటేశ్వరరెడ్డి వ్యతిరేకిస్తూనే ఉన్నారు. నియోజకవర్గంలో పాత బూత్‌ కమిటీ కన్వీనర్లను తొలగించి తన అనుచరులను నియమించుకున్నారని చేజర్ల వర్గం ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గురువారం కొడవలూరు మండలం నార్తురాజుపాలెంలో ఎమ్మెల్యే పోలంరెడ్డి పార్టీ సమావేశం నిర్వహించారు. బుచ్చిరెడ్డిపాళెం, కొడవలూరు మండలాలకు సంబంధించి బూత్‌ కమిటీలకు తనకు అనుకూలమైన వ్యక్తులను నియమించుకున్నారు. దీనిని చేజర్ల వ్యతిరేకించారు. పాత సభ్యులనే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. చేజర్ల మాటలు లెక్కచేయకపోవడంతో ఎమ్మెల్యే పోలంరెడ్డిపై సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేయాలని కోవూరు సీనియర్‌ తెలుగుదేశం పార్టీ నాయకులు నిర్ణయించుకున్నారు.

గతంలో బుచ్చిరెడ్డిపాళెం, కోవూరు మండలాలకు సంబంధించి బూత్‌ కమిటీ సభ్యుల నియామకంలో గందరగోళం నెలకొంది. చేజర్ల వర్గం వారిని పూర్తిగా తొలగించి ఎమ్మెల్యే అనుకూలంగా ఉన్న వారిని నియమించారు. దీంతో సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేయగా జిల్లా పరిధిలోనే ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలని సూచించారు. కోవూరు నియోజకవర్గ వివాదాన్ని పరిష్కరించేందుకు పరిశీలకులుగా ఎరిక్సన్‌బాబును అప్పట్లో నియమించారు. వివాదానికి తెరదించాలని జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్రకు ఎరిక్సన్‌ బాబు సూచించారు. బీద ఇరువర్గాలను జిల్లా పార్టీ కార్యాలయానికి పిలిపించి చర్చలు జరిపారు. వివాదం తాత్కాలికంగా సర్దుమణిగింది. గురువారం ఎమ్మెల్యే బూత్‌ కమిటీ కన్వీనర్లను తొలగించడంతో నేతల మధ్య పోరు మళ్లీ మొదటికొచ్చింది. తాను సీఎం వద్దే తేల్చుకుంటానని చేజర్ల వెంకటేశ్వరరెడ్డి స్పష్టం చేస్తున్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top