దోపిడీ పాలకులను తరిమికొట్టాలి

CM Leader Brinda Karat Criticize On KCR Government Khammam - Sakshi

చర్ల నల్గొండ: రాష్ట్రంలో, దేశంలో ప్రజానీకాన్ని దోపిడీ చేస్తున్న పాలక ప్రభుత్వాలను తరిమికొట్టాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్‌ పిలుపునిచ్చారు. భద్రాచలంలో బీఎల్‌ఎఫ్‌ బలపర్చిన సీపీఎం అభ్యర్థి మిడియం బాబూరావు విజయాన్ని కాంక్షిస్తూ గురువారం మండలంలోని ఆర్‌కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన ఎన్నికల బహిరంగ సభలో ఆమె పాల్గొని మాట్లాడారు. భద్రాచలం నియోజకవర్గం పోరాటాల గడ్డ అని, ఇక్కడి ఓటర్లు నిరంతరాయంగా కొనసాగిస్తున్న సంప్రదాయాన్ని ఈసారి కూడా కొనసాగించి సీపీఎంను గెలిపించాలని ఆమె కోరారు. రాష్ట్రంలో, దేశంలో పాలన సాగిస్తున్న టీఆర్‌ఎస్, బీజేపీలకు దళితులు, గిరిజనుల గురించి మాట్లాడే అర్హత లేకుండా చేస్తున్నాయని ఆరోపించారు.

హక్కుల కోసం ఆదివాసీలు ఆత్మ గౌరవ పోరాటాలు చేపట్టి దానిని ముందుకు తీసుకుపోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాలుగేళ్లలో ప్రజలకు చేసింది శున్యమని అన్నారు. ప్రజలపై అప్రకటిత యుద్ధం చేస్తూ వారి హక్కులకు భంగం కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. కేంద్రం ప్రజలపై దాడులు చేస్తుంటే కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ పార్టీలు నోళ్లు మూసుకున్నాయని విమర్శించారు. ఇప్పుడు ప్రజల్లోకి ఏ ముఖం పెట్టుకుని వెళ్తారని, ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. అటవీ హక్కుల చట్టం ఏర్పాటు కోసం సీపీఎం అగ్రభాగాన నిలిచి పోరాటాలు సాగించిందని గుర్తుచేశారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం సాగులో ఉన్న భూములన్నిటికీ హక్కు పత్రాలు ఇవ్వాల్సిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.. భూములను బలవంతంగా లాక్కొందని ఆరోపించారు.

రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక తెలంగాణ రాష్ట్రంలో వేలాది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని అన్నారు.  కేరళ రాష్ట్రంలో సీపీఎం ప్రభుత్వ హయాంలో ఒక్క రైతూ ఆత్మహత్యకు పాల్పడలేదన్నారు. డిసెంబర్‌ 7న జరరిగే ఎన్నికల్లో టీఆర్‌ఎస్, ప్రజాకూటమి, బీజేపీ అభ్యర్థులను ఓడించి సీపీఎం అభ్యర్థిని గెలించాలని కోరారు. ఈ ఎన్నిల ప్రచార సభలో అభ్యర్థి మిడియం బాబూరావు,  సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు బ్రహ్మాచారి, తాజా మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య, మచ్చా వెంకటేశ్వర్లు, వెంకట్, జిల్లా కమిటీ సభ్యులు యలమంచి రవికుమార్, మండల కార్యదర్శి కారం నరేష్, మురళీకృష్ణ, రాంపండు, ముత్యాలరావు, వినోద్‌ పాల్గొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top