సీఏఏపై కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

CM KCR Shocking Comments On Citizenship Amendment Bill - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ‘విధానం, స్వభావం ప్రకారం టీఆర్‌ఎస్‌ పూర్తి సెక్యులర్‌ పార్టీ. పౌరసత్వ సవరణ చట్టం విషయంలో కేంద్ర ప్రభుత్వానిది 100 శాతం తప్పుడు నిర్ణయం. కులం, మతం, ప్రాంతం తేడా లేకుండా అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించాలనేది రాజ్యాంగ పీఠికలోనే ఉంది. పౌరసత్వ సవరణ చట్టంతో ముస్లింలపై అనుసరిస్తున్న వైఖరి బాధ కలిగించింది. అమిత్‌షాకు కూడా ఇదే విషయం చెప్పా. దేశ సమగ్రతను దృష్టిలో పెట్టుకుని ఆర్టికల్‌ 370కి మద్దతు పలికాం. సీఏఏపై పార్లమెంటులోనే మా పార్టీ వైఖరి కుండబద్దలు కొట్టినట్లు చెప్పాం. రాబోయే నెల రోజుల్లో భావసారూప్యత ఉన్న ప్రాంతీయ పార్టీలు, సుమారు 15, 16 మంది సీఎంలతో హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటు చేస్తాం. అవసరమైతే పది లక్షల మందితో బహిరంగ సభ నిర్వహిస్తాం. భారత్‌కు మతపరమైన దేశమనే ముద్ర మంచిదికాదు. సీఏఏని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మాణం చేసి కేంద్రానికి పంపిస్తాం’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు.

శనివారం తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ‘భారత్‌ను హిందూ రాష్ట్రంగా మారుస్తున్నారు.. అంతర్జాతీయ విపణిలో నష్టం జరుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. రాబోయే అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో సీఏబీపై చర్చించడంతో పాటు, వంద శాతం వ్యతిరేకిస్తూ తీర్మానం  చేస్తాం. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తెచ్చే చట్టాలపై ప్రజా వ్యతిరేకతపై వచ్చినపుడు పునఃసమీక్షించాల్సిన అవసరం ఉంటుంది. ఎన్నార్సీ, ఎన్పీఆర్‌ విషయంలో కేంద్రం, మంత్రులు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఈ అంశాన్ని సుమోటోగా తీసుకుని సీఏ ఏను కొట్టేయాలి. ప్రాణాలు పోయినా సరే టీఆర్‌ఎస్‌ సెక్యులర్‌పార్టీగానే కొనసాగుతుంది. ఎన్ని కల్లో గెలుపోటములకు భయపడకుండా, సెక్యులర్‌ విధానానికి కట్టుబడి పోరాటం చేస్తాం.  

ఆ విషయం అసెంబ్లీలోనే చెప్పా 
‘నేను సీఎంగా కొనసాగుతానని అసెంబ్లీ వేదికగా చెప్పా. మోదీ సీఎంగా పనిచేస్తూనే ప్రధాని కాలేదా. నన్ను సీఎం కుర్చీ నుంచి పంపాలని మీరు అనుకుంటున్నారా? ప్రజలు ఉండమంటున్నారు. సీఎం మార్పిడికి సంబంధించి ఓ సమయం, సందర్భం ఉంటుంది. కేటీఆర్‌ ముఖ్యమంత్రి కావాలని ఆయన శ్రేయోభిలాషులు ఎవరైనా కోరుకుంటే దాన్ని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు’అని కేసీఆర్‌ వెల్లడించారు. 
‘కాంగ్రెస్, బీజేపీ గతంలో సిద్ధాం తాలను పక్కన పెట్టి పనిచేశాయి. అవసరమైన చోట మేం మజ్లిస్‌తో కలసి మున్సిపల్‌ పీఠాలను కైవసం చేసుకుంటాం. ఏపీలో రాజధానుల ఏర్పాటు ఆ రాష్ట్ర అంతర్గత సమస్య’ అని పేర్కొన్నారు.  

చదవండి: ఇది ఆలిండియా రికార్డు అంటున్న కేసీఆర్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top