ఇది ఆలిండియా రికార్డు : కేసీఆర్‌

KCR Speech Over Telangana Municipal Election Results - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు భారీ విజయాన్ని అందించిన ప్రజలకు టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. గత ఆరేళ్లుగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు ఈ విజయాన్ని అందించారన్నారు. ఈ గెలుపు మరింత బాధ్యతను పెంచిందని తెలిపారు. అన్ని చోట్లా ప్రజలు ఒకే రకమైన తీర్పునిచ్చారని పేర్కొన్నారు. తాము అనుసరిస్తున్న పద్దతి ప్రజలకు నచ్చింది కాబట్టే ఇంతటి ఘన విజయాన్ని అందించారన్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్ పార్టీ భారీ విజయం సాధించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. 

మున్సిపల్‌ ఫలితాల్లో ప్రజలు ఏకపక్ష తీర్పు ఇచ్చారు. టీఆర్‌ఎస్‌ సంక్షేమ పథకాలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మా సెక్యులర్‌ విధానాన్ని 100శాతం తెలంగాణ ప్రజలు బలపరిచారు. అభ్యర్థుల గెలుపుకోసం పనిచేసిన నేతలకు ధన్యవాదాలు. ప్రతి ఎన్నికలోనూ టీఆర్‌ఎస్‌ ఏకపక్ష గెలుపు ఆనవాయితీగా మారింది. శాసన సభ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లినప్పుడు అందరూ భయపెట్టారు. కానీ ధీమాతో ముందుకు వెళ్లాను. 88 స్థానాల్లో గెలుపొందాం. హుజూర్‌నగర్‌ ఉపఎన్నికతో కలిసి 89 స్థానాలు గెలుచుకున్నాం. ఆ తర్వాత వచ్చిన పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌కు మెజార్టీ స్థానాలు వచ్చాయి. స్థానికసంస్థల ఎన్నికల్లో 32 జిల్లా పరిషత్‌లను స్వాధీనం చేసుకున్నాం. ఇది ఆలిండియా రికార్డు. మున్సిపాలిటీ ఎన్నికలు ఆపేందుకు ప్రతిపక్షాలు విశ్వప్రయత్నాలు చేశాయి. కోర్టుల చుట్టూ తిప్పారు. అయినప్పటీకి ప్రజలు అర్థం చేసుకొని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి పట్టం కట్టారు.

ఇతర పార్టీలకు గేమ్‌ అయితే.. మాకు టాస్క్‌
ఎన్నికల కోసం పార్టీ నాయకులు రాత్రింబవళ్లు కష్టపడ్డారు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రామారావుకు నా ఆశీస్సులు. ప్రతి ఎన్నికలోనూ టీఆర్‌ఎస్‌ ఏకపక్ష గెలుపు ఆనవాయితీగా మారింది. నేను అధికార దుర్వినియోగం చేశానని అంటున్నారు. జిల్లా ఎస్పీ, కలెక్టర్‌కు నేను జన్మలో ఫోన్‌ చేయలేదు. మంత్రులపై అవాకులు చవాకులు పేలుతున్నారు. రూ.వేల కోట్లకు ప్రజలు అమ్ముడుపోయారని చెప్పదలుచుకున్నారా? మీరు గెలిస్తే న్యాయంగా గెలిచినట్లా? స్థాయిని మించి అధిక ప్రసంగాలు చేస్తే ఎలా ఉంటుందో ప్రజలు చూపిస్తున్నారు. ఇప్పటికైనా హుందాగా ప్రవర్తించాలి. నిర్మాణాత్మకమైన ప్రతిపక్షం పాత్ర పోషించాలి. ఒక పని చేపట్టామంటే మేం రాక్షసుల్లా పనిచేస్తాం. ఈ ఎన్నికల్లో మేం పెట్టిన ఖర్చు రూ.80 లక్షలు మాత్రమే. రూ.80లక్షలు పార్టీ మెటీరియల్‌ కోసం ఖర్చు చేశాం. ఒక్క రూపాయి కూడా మేము ఇవ్వలేదు. చాలా విజయాలు చూశాం కాని ఇంతటి ఘన విజయం నేను అయితే చూడలేదు. తెలంగాణ రాజకీయ వ్యవస్థను ముందుకు తీసుకుపోవడం ఇతర పార్టీలకు గేమ్‌ అయితే.. మాకు టాస్క్. కష్టపడి పనిచేస్తేనే ఈ ఫలితాలు వచ్చాయి. 

పట్టణ ప్రగతి చేపడతాం
పల్లె ప్రగతి తరహాలో త్వరలోనే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని అమలు చేస్తాం. ఈ ఎన్నికల్లో ఎన్నికైనవారికి పట్టణాభివృద్ధిపై ప్రత్యేక శిక్షణ ఇస్తాం. పట్టణాలు అభివృద్ధి, నగరీకరణలో సవాళ్లపై అవగాహన కల్పిస్తాం. బీజింగ్‌ తర్వాత ఢిల్లీ అత్యధిక కాలుష్యం ఎదుర్కొంటుంది. హైదరాబాద్‌కు వస్తున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. 

57 ఏళ్ల దాటిన వారికి పెన్షన్‌
ఎన్నికలలో ఇచ్చిన హామీలను కొన్ని పెండింగ్‌లో ఉన్నాయి. 57 ఏళ్ల వాళ్లకి పెన్షన్‌ఇస్తామని చెప్పాం. ఈ బడ్జెట్‌లోనే వాటిని పెట్టి మార్చి 1నుంచి ఫించన్లు అందిస్తాం. ప్రభుత్వ ఉద్యోగులు వయోపరిమితిని కూడా పెంచుతాం. పీఆర్సీ పెంపుపై కూడా త్వరలో చర్చలు జరుతుతాం. పరిమితులను బట్టి పీఆర్సీ అమలు చేస్తాం. కేంద్ర ప్రభుత్వం సరిగ్గా పనిచేస్తలేదు. మన రాష్ట్రానికే 5వేల కోట్లు బకాయిలు ఉన్నాయి. మేము పార్లమెంట్‌లో జరిగిన సమావేశాల్లో ధర్నా చేస్తే.. రూ.1000 కోట్లు ఇచ్చారు. ఇంకా రూ.1131 కోట్లు రావాలి. ఐజీఎస్టీ కింద 2812 కోట్లు రావాలి. ఆర్థిక పరిస్థితి సరిగా లేదు. ఉద్యోగులను పిలిచి నేనే మాట్లాడుతా. కేంద్ర ప్రభుత్వ విధానాలు చూస్తే ఘోరంగా ఉన్నాయి. కాగ్‌ వాళ్ల బండారం బయటపెడుతుంది. జీడీపీ పడిపోయింది. పోయిన 5 ఏళ్లు తెలంగాణ ఎంత ఎంజాయ్‌ చేసిందంటే... ఇండియాలో మనం నెంబర్‌ వన్‌. ప్రతి ఏడాది 21 శాతం పెరుగుదల ఉండేది. కానీ ఇప్పడు ఏ విభాగం అయినా డబ్బులు అడిగితేనే భయం అవుతుంది. ఇప్పుడు మన పెరుగుదల 9.5 ఉంది. అయినప్పటికీ కానీ పీఆర్సీ కూడా పెంచుతాం. కంటి వెలుగు తరహాలో తెలంగాణ రాష్ట్రం ఆరోగ్య సూచికను తెలిపే కార్యక్రమాన్ని త్వరలోనే చేపడతాం.

కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తాం
తెలంగాణ నుంచి చాలామంది గల్ఫ్‌ వెళ్తున్నారు. అప్పులు చేసి మరీ దుబాయ్‌ ఎందుకు వెళ్తున్నారో అర్థం కావడంలేదు. ఇక్కడేమో చాలామంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి బతుకుతున్నారు. రాష్ట్రంలోనే ఉపాధి లభిస్తుంటే గల్ఫ్‌ ఎందుకు వెళ్తున్నారు? అసెంబ్లీ సమావేశాలకు ముందు గల్ఫ్‌లో పర్యటిస్తా. త్వరలోనే గల్ప్‌ పాలసీ తీసుకొస్తాం. తెలంగాణ నిరక్ష్యరాస్యత ఎక్కువ ఉంది. ఇది కాంగ్రెస్‌, టీడీపీ ప్రభుత్వాలు ఇచ్చిన బహుమతి. త్వరలోనే నిరక్ష్యరాస్యత నిర్మూలన కోసం కార్యక్రమాన్ని చేపడతాం. కొత్త రెవెన్యూ చట్టాన్ని కూడా తీసుకొస్తాం. రెవెన్యూ కార్యాలయానికి ప్రజలు పెట్రోలు పట్టుకొని వచ్చే పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆ శాఖ అధికారులు ఆలోచించుకోవాలి.  రెవెన్యూ శాఖలోనే అవినీతి ఎక్కువగా ఉంది. ఎవరేం అనుకున్న మేము భయపడం. పటిష్టమైన రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తాం. మాకు ఇంత విజయాన్ని అందించిన ప్రజల కోసం మేము ఏ పనిఅయినా చేస్తాం. కొద్ది రోజుల్లోనే రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చి అమలు చేస్తాం. కొత్త మున్సిపల్‌ చట్టాని, పంచాయతి రాజ్‌ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తాం. 

పన్నులు కొద్దిగా పెంచుతాం 
పల్లెలతో పాటు పట్టణాల అభివృద్ధికి నిధులు అందిస్తాం. కొద్దిగా పన్నులు పెంచాలి. నిరుపేదలపై భారం పడకుండా పన్నులు పెంచుతాం. ప్రతి నెల మున్సిపాలిటీలకు నిధులు అందిస్తాం. మున్సిపల్‌, గ్రామ పంచాయతీల పన్నులు కొద్దిగా పెంచుతాం. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ పన్నులు వర్తించేలా నిర్ణయం తీసుకుంటాం. రైతు సమన్వయ సమితులను క్రియాశీలం చేస్తాం. రైతులే నిర్ణయాధికారులుగా మారే ప్రక్రియను అమల్లోకి తీసుకొస్తాం. ప్రతి క్లస్టర్‌కు ఒక రైతు వేదిక ఏర్పాటు చేస్తాం. మహిళలను హామీ ఇచ్చినట్లుగా పుడ్‌ ప్రాసెసింగ్‌ క్లస్టర్లు ఏర్పాటు చేస్తాం. అన్ని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. నిరుద్యోగ భృతిని అందించేందుకు కృషి చేస్తాం. దీనికి సంబంధించిన విధివిధానాలు త్వరలోనే వెల్లడిస్తాం. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కచ్చితంగా అమలు చేస్తాం’ కేసీఆర్‌ అన్నారు. 

ఇది చదవండి : సీఏఏపై కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top