ముస్లింలకు మంత్రి పదవి ఇస్తా | CM Chandrababu assures to the Muslims | Sakshi
Sakshi News home page

ముస్లింలకు మంత్రి పదవి ఇస్తా

Aug 11 2018 3:44 AM | Updated on Oct 16 2018 6:01 PM

CM Chandrababu assures to the Muslims - Sakshi

సాక్షి, అమరావతి: ముస్లింలకు మంత్రి పదవి ఇస్తామని, ఈ అంశంపై కసరత్తు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో హజ్‌ యాత్ర ప్రారంభించింది తానేనని, హైదరాబాద్‌లో హజ్‌ భవన్‌ నిర్మించింది కూడా తానేనని తెలిపారు. ఉండవల్లిలోని గ్రీవెన్స్‌ హాలులో శుక్రవారం ఆయన హజ్‌ యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం యాత్రికులతో సమావేశమయ్యారు. విజయవాడలో రూ. 80 కోట్లతో హజ్‌ భవన్‌ నిర్మిస్తున్నామని, కడపలో మరో హజ్‌ భవన్‌ నిర్మిస్తున్నామని తెలిపారు. ముస్లింల అభ్యున్నతికి మహనీయులు భూములు విరాళంగా ఇచ్చారని, ఆ వక్ఫ్‌ భూములను కొందరు స్వార్థపరులు కబ్జా చేశారన్నారు. ముస్లింల భూములు కబ్జా చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, వక్ఫ్‌ భూములను కాపాడతామని హామీ ఇచ్చారు. ముస్లింల అభ్యున్నతికి ఈ బడ్జెట్లో రూ. 1,100 కోట్లు కేటాయించామని తెలిపారు. 1,35,000 మంది ముస్లిం విద్యార్థులకు పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌ షిప్‌లకు రూ. 285 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. విదేశీ విద్యకు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు ఇస్తామన్నారు. గతంలో గోద్రా అల్లర్లు జరిగినప్పుడు అప్పటి గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ రాజీనామాకు తాను పట్టుబట్టానని తెలిపారు. అనంతరం యాత్రికులకు దుస్తులు, బ్యాగ్‌లను అందించారు. 

కృష్ణయ్య సూక్తులు పుస్తకం ఆవిష్కరణ
టీటీడీ మాజీ ఈవో పి.కృష్ణయ్య రచించిన శ్రీ సూక్తుల పుస్తకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. శుక్రవారం ఉండవల్లిలోని గ్రీవెన్స్‌ హాలులో పుస్తకాన్ని ఆవిష్కరించి చంద్రబాబు కృష్ణయ్యను అభినందించారు. తమిళ ఆధ్యాత్మిక రచన తిరుక్కురళ్‌కు అనువాదం శ్రీ సూక్తులు పుస్తకమని, నైతికత, ధర్మ బోధనలకు ఈ పుస్తకం ద్వారా అక్షర రూపమిచ్చినట్లు కృష్ణయ్య తెలిపారు. 

బీఎస్‌ఈలో సీఆర్‌డీఏ బాండ్ల లిస్టింగ్‌..
బొంబాయి స్టాక్‌ ఎక్సే్చంజి (బీఎస్‌ఈ)లో సీఆర్‌డీఏ బాండ్లను లిస్టింగ్‌ చేయిస్తున్నట్లు సీఎం చంద్రబాబుకు అధికారులు తెలిపారు. బాండ్ల జారీకి సంబంధించిన బిడ్డింగ్‌ వచ్చే మంగళవారం జరుగుతుందని, 10.3 శాతం వడ్డీ రేటుతో బాండ్లు విడుదల చేస్తున్నామని చెప్పారు. సచివాలయంలో శుక్రవారం రాజధాని వ్యవహారాలపై సీఆర్‌డీఏ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణ పనులు మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు.

ఆగస్టు 15కి వంద అన్న క్యాంటీన్లు
డిసెంబర్‌ నాటికి విజయవాడ, గుంటూరులో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి మున్సిపల్‌ అధికారులకు ఆదేశించారు. తిరుపతిలో 27 కిలోమీటర్లు ప్రాంతం మేర స్మార్ట్‌ స్ట్రీట్‌ ప్రాజెక్ట్‌ అభివృద్ధిపై ముఖ్యమంత్రి సమీక్షించారు. రాష్ట్రంలో ప్రారంభించిన అన్న కాంటీన్ల గురించి మాట్లాడుతూ ప్రజల సంతృప్తి స్థాయి పెరిగేలా నిర్వహణ ఉండాలని పురపాలక డైరెక్టర్‌ కన్నబాబుకు సీఎం సూచించారు. ఇప్పటికే 66 అన్న కాంటీన్లు ప్రారంభమయ్యాయని, మరో వంద కాంటీన్లను ఆగష్టు 15వ తేదీకల్లా ప్రారంభిస్తామని అధికారులు వివరించారు. సమీక్షలో  మున్సిపల్, పరిపాలన శాఖ శాఖ మంత్రి నారాయణ, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌ చంద్ర తదితరులు పాల్గొన్నారు  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement