మోదీ సర్కార్‌ ప్రజల గొంతు నొక్కేస్తుంది : సోనియా

Citizenship Amendment Act: Sonia Gandhi Say Modi Government Has No Compassion - Sakshi

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసిన సోనియా

పౌరసత్వ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి

సాక్షి, న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) వ్యతిరేకిస్తూ ప్రజలు శాంతి యుతంగా చేస్తున్న నిరసనను పోలీసులు హింసాత్మకంగా మారుస్తున్నారని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోపించారు. మంగళవారం ఆమె అఖిలపక్ష నాయకులతో కలిసి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై దేశవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో..చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని రాష్ట్రపతిని కోరారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజల గొంతును నొక్కేస్తుందని విమర్శించారు. ఢిల్లీలో జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ విద్యార్థులపై కనికరం లేకుండా పోలీసులు దాడి చేశారని మండిపడ్డారు.

(చదవండి : ‘హింసాత్మక నిరసనలు వద్దు’)

పౌరసత్వ సవరణ చట్టంపై ఈశాన్యరాష్ట్రాల్లో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులు దేశం మొత్తం వ్యాపిస్తున్నాయని, ముందుముందు భయానక పరిస్థితులు ఏర్పడుతాయేమోనని సోనియాగాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. శాంతియుత పద్దతిలో చేస్తున్న నిరసనలను పోలీసులు హింసాత్మకంగా చేస్తున్నారని, ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా ఉన్న పౌరసత్వ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని రాష్ట్రపతిని కోరారు. ప్రస్తుత పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చేందుకు తగిన చర్యలు తీసుకుంటామని సోనియాగాంధీకి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తెలిపారు.

(చదవండి : ‘అది మరో జలియన్‌ వాలాబాగ్‌’)

కాగా, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలోని జఫ్రాబాద్‌ ప్రాంతంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో పోలీసులు లాఠీచార్జ్‌ చేయడంతో పాటు భాష్పవాయుగోళాలను ప్రయోగించారు. విద్యార్ధుల నిరసన ప్రదర్శన నేపథ్యంలో సీలంపూర్‌ నుంచి జఫ్రాబాద్‌ రహదారిపై వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. మరోవైపు వెల్‌కం, జఫ్రాబాద్‌, మౌజ్‌పూర్‌-బబర్పూర్‌ మెట్రో స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్‌ గేట్లను మూసివేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top