మెత్తబడిన గంటా.. అయిష్టంగానే అంగీకారం!

 Chinna Rajappa Meets Ganta Srinivasa Rao to pacify him - Sakshi

సీఎం కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అంగీకరించిన మంత్రి

గంటాను స్వయంగా వెంట తీసుకెళ్లిన చినరాజప్ప

సాక్షి, విశాఖపట్నం : టీడీపీ అధినాయకత్వం తీరుతో గత కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్న మంత్రి గంటా శ్రీనివాసరావును ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప రాయబారంతో కాస్తా మెత్తబడినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విశాఖపట్నం పర్యటనకు వస్తుండటం.. తన నియోజకవర్గం భీమిలి పరిధిలో పలు కార్యక్రమాలు పాల్గొంటుండటంతో.. సీఎం కార్యక్రమాలకు వెళ్లాలని గంటా శ్రీనివాసరావు నిర్ణయం తీసుకున్నారు. మంత్రి గంటాను చినరాజప్ప స్వయంగా దగ్గరుండి ప్రస్తుతం ఎయిర్‌పోర్టుకు తీసుకెళ్లారు.

సీఎం చంద్రబాబుతో విభేదాలు, విశాఖ భూకుంభకోణానికి సంబంధించి తనకు వ్యతిరేకంగా హైకోర్టులో దాఖలు చేసిన పిల్‌లో టీడీపీ పాత్ర ఉండటంతో మంత్రి గంటా అలకపాన్పు ఎక్కిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా టీడీపీ అనుకూల మీడియాలో తనకు వ్యతిరేకంగా సర్వే పేరిట కథనాలు ప్రచురించడం.. ఆయనలో అసంతృప్తికి మరింత ఆజ్యం పోసింది. ఈ నేపథ్యంలో టీడీపీకి దూరంగా ఉంటున్న గంటా.. మంగళవారం సాయంత్రం జరిగిన ఏపీ కేబినెట్‌ సమావేశానికి సైతం దూరంగా ఉండి.. తన అసమ్మతిని వెళ్లగక్కిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో గంటాను బుజ్జగించేందుకు టీడీపీ అధిష్టానం.. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పను రంగంలోకి దింపింది. గురువారం ఉదయం గంటా నివాసానికి చేరుకున్న చిన రాజప్ప.. ఆయనతో సమావేశమై మంతనాలు జరిపారు. ముఖ్యంగా భీమిలిలో చంద్రబాబు పర్యటనకు హాజరుకావాలని, ఆయన నిర్వహించే సభలో పాల్గొనాలని చిన రాజప్ప గంటాను బుజ్జగించినట్టు తెలుస్తోంది. మొత్తానికి తాత్కాలికంగా చినరాజప్ప రాయబారం పనిచేసినట్టు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతానికి సీఎం కార్యక్రమాలకు హాజరుకావాలని గంటా నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబుతో విభేదాలు, భూకుంభకోణం వ్యవహారంలో టీడీపీ నేతల పిల్‌, భీమిలిలో తనకు వ్యతిరేకంగా సర్వే వంటి అంశాలు పరిష్కారం కాకున్నా.. వాటిని తాత్కాలికంగా పక్కనబెట్టి అయిష్టంగానే గంటా సీఎం కార్యక్రమాలకు హాజరవుతున్నారని అంటున్నారు.

అవసరమొచ్చినప్పుడు నోరు విప్పుతా!
భీమిలిలో తన పనితీరుపై వచ్చిన సర్వేతో గంటా మనస్తాపానికి గురయ్యారని, దీనిపై చర్చించామని ఈ సందర్భంగా చినరాజప్ప అన్నారు. సీఎం కార్యక్రమాలలో పాల్గొంటానని గంటా తెలిపారు. అవసరం వచ్చినప్పుడు నోరు విప్పుతానని ఆయన స్పష్టం చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top