రజనీ వస్తే అద్భుతమే : చిదంబరం

Chidambaram Reaction On Rajinikanth Political Entry - Sakshi

గళాన్ని నొక్కడమే బీజేపీ లక్ష్యం 

ప్రజలకు కేంద్రం తీవ్ర ద్రోహం చేసింది: చిదంబరం

సాక్షి, చెన్నై : కథానాయకుడు రజనీకాంత్‌ రాజకీయాల్లోకి వస్తే అద్భుతమే అని కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం, ప్రజాస్వామ్య వాదుల గళాన్ని నొక్కడమే లక్ష్యంగా బీజేపీ పాలకులు ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. ఓట్లేసి గెలిపించిన ప్రజలకు మోదీ తీవ్ర ద్రోహం తలపెట్టి ఉన్నారని మండిపడ్డారు.  జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం శనివారం రాష్ట్రానికి ప్రపథమంగా వచ్చారు. ఆయనకు కాంగ్రెస్‌ వర్గాలు బ్రహ్మరథం పట్టాయి. తొలి రోజు చెన్నైలో ఉన్న చిదంబరం ఆదివారం తిరుచ్చి వెళ్లారు. అక్కడి విమానాశ్రయంలో ఆయనకు కాంగ్రెస్‌ వర్గాలు ఘన స్వాగతం పలికాయి. పూల మాలల ధర కన్నా, ఉల్లి ధరే అధికంగా ఉందని చాటే దిశగా పలువురు అభిమానులు ఉల్లితో సిద్ధం చేసిన మాలను ఆయనకు అందజేయడానికి ప్రయత్నించారు.

ఈ సందర్భంగా చిదంబరం మీడియాతో మాట్లాడారు. దేశంలో 30 కోట్ల మంది ప్రజలు పూట గడవలేని పరిస్థితుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోజు వారీ కూలీలు, పనులు చేసుకుంటున్న వీరి జీవితాల్ని దెబ్బ తీయడమే కాకుండా, పూట గడవనీయకుండా కేంద్ర పాలకులు ఉన్నారని ఆరోపించారు. కేంద్రం నిర్ణయాల కారణంగా ఆర్థిక ప్రభావం అన్నది పెరిగిందని ధ్వజమెత్తారు. రిజర్వు బ్యాంక్‌ను సైతం బెదిరించి కోట్లు రాబట్టుకుని, దానిని కార్పొరేట్‌ సంస్థలకు రాయితీలుగా ఇచ్చే పనిలో పడ్డారని మండి పడ్డారు. జీఎస్‌టీ అన్నది క్రమంగా పెరగడం ఖాయమన్నారు. ప్రస్తుతం 5 శాతంగా ఉన్న జీఎస్టీ 8 శాతానికి, 8 శాతం 12 శాతానికి, 12 శాతం నుంచి 18 శాతానికి పెరగడం ఖాయమని వివరించారు.

ప్రజల వద్ద జీఎస్టీ  పేరుతో దోసుకుని కార్పొరేట్‌ సంస్థలకు ఆపన్నంగా రాయితీలు కట్టబెట్టనున్నారని ధ్వజమెత్తారు. ఓట్లు వేసిన ప్రజలకు ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర ద్రోహం తలబెట్టి ఉన్నారని ఆరోపించారు. తనను జైల్లో పెట్టారని, తాను ఏ మాత్రం డీలా పడలేదని, కామరాజర్, వివోసి వంటి వారు జైలు జీవితం గడిపి ఉన్నారని గుర్తుచేశారు. ప్రజా స్వామ్యాన్ని కూనీ చేయడం, ప్రజాస్వామ్య వాదుల గళాన్ని నొక్కేయడం లక్ష్యంగా కేంద్రం ముందుకుసాగుతున్నదని, ఎన్ని కుట్రలు చేసినా తన గళం మరింతగా ప్రతిధ్వనిస్తుందన్నారు. ఈసందర్భంగా రజనీకాంత్‌ రాజకీయాల్లోకి వస్తే మార్పు తధ్యమా..? అని ప్రశ్నించగా, ఆయన్నే అడగాలని పేర్కొన్నారు. ఆయన వస్తే అద్భుతం జరుగుతుందా..? అని ప్రశ్నించగా, ఆయన వస్తే అద్భుతమే అని వ్యాఖ్యానించారు.

 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top