రచ్చ అవుతుందని అనుకోలేదు

chandrababu respond on nandi awards controversy - Sakshi - Sakshi - Sakshi - Sakshi

నంది అవార్డుల వివాదంపై స్పందించిన చంద్రబాబు

సాక్షి, అమరావతి: నంది అవార్డుల వ్యవహారం ఇలా రచ్చ అవుతుందని అనుకోలేదని సీఎం చంద్రబాబు వాపోయారు. సోమవారం జరిగిన స్ట్రాటజీ కమిటీ సమావేశంలో నంది అవార్డుల వివాదం చర్చకు వచ్చింది. ఇంత వివాదం అవుతుందని తెలిస్తే ఐవీఆర్ఎస్(ఇంటారాక్టివ్ వాయిస్‌ రెస్పాన్స్‌ సర్వే)తో అవార్డులకు ఎంపిక చేసే వాళ్లమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతి అంశానికి కులం రంగు పులమడం సరికాదన్న చంద్రబాబు.. జ్యూరీ సభ్యుల నిర్ణయం మేరకే నంది అవార్డులు ప్రకటించామని చెప్పుకొచ్చారు. పలువురు ఎమ్మెల్యేలు ఇప్పటికీ సీరియస్‌గా ఉండటం లేదని చంద్రబాబు మండిపడ్డారు. అంశాలవారీగా మాట్లాడాలని క్లాస్‌ తీసుకున్నారు.

పోలవరం ప్రాజెక్టు పనులపై సమీక్ష
పోలవరం ప్రాజెక్టు పనులపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. గడిచిన వారం రోజుల్లో 26 వేల క్యూబిక్ మీటర్ల తవ్వకం, స్పిల్‌వే, స్టిల్లింగ్ బేసిన్‌కు సంబంధించి 10,891 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తి చేసినట్టు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 4 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తికాగా, మరో 12.04 లక్షల క్యూబిక్ మీటర్ల మేర పనులు చేపట్టాల్సి వుందని వెల్లడించారు. 384 ఆర్మ్ గిర్డర్ల ఫ్యాబ్రికేషన్ పూర్తయిందని, 20 హారిజంటల్ గిర్డర్లు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు.

రాష్ట్రంలో సుమారు 7 వేల చెక్ డ్యాంలు ఇంకా నిర్మించాల్సిన అవసరం వుందని లెక్క తేల్చారు. ప్రాజెక్టులు నిర్మించడం ఎంత ముఖ్యమో, నీటి నిర్వహణ అంతే ముఖ్యమని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. పోలవరం ప్రాజెక్టు ప్రధాన నిర్మాణ సంస్థ ట్రాన్స్‌ట్రాయ్‌కు తాము వ్యతిరేకం కాదని, ప్రాజెక్టు నిర్మాణం త్వరగా పూర్తికావాలనేదే తమ ఉద్దేశమని కేంద్ర మంత్రి గడ్కరీకి వివరించినట్టు చంద్రబాబు చెప్పారు. పోలవరం ప్రాజెక్టులో భాగమైన దిగువ కాఫర్ డ్యాం నిర్మాణం పనులు ప్రారంభించడానికి సిద్ధంగా వున్నట్టు ముఖ్యమంత్రితో సీఈ రమేష్ అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top