చంద్రబాబు భయంతో వణికిపోతున్నారు: మోదీ

PM Modi target chandrababu naidu during his politics  - Sakshi

సాక్షి, గుంటూరు : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజకీయ ప్రత్యర్థులపై దూకుడు పెంచారు. ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ఆయన.. రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును డైరెక్ట్‌గా టార్గెట్‌ చేశారు. ఆదివారం గుంటూరులో బీజేపీ ఏర్పాటు చేసిన ప్రజా చైతన్య సభలో నరేంద్ర మోదీ తన ప్రసంగంలో చంద్రబాబే లక్ష్యంగా విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. అధికారం కోసం ఎవరితోనైనా జతకట్టే చంద్రబాబుకు ప్రస్తుతం ఓటమి భయం పట్టుకుందని ప్రధాని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఒకసారి గెలిస్తే ...మరోసారి గెలిచిన చరిత్ర చంద్రబాబుకు లేదని అన్నారు. మహాకూటమి అపవిత్ర కలయిక అన్న ఆయన.. తన రాజకీయ స్వార్థం కోసమే చంద్రబాబు మహా కూటమితో పొత్తు పెట్టుకున్నారన్నారు. మహా కల్తీ కూటమిలో చంద్రబాబు చేరారని, ఎన్టీఆర్‌ను అవమానించిన కాంగ్రెస్‌తో పొత్తు ఎలా పెట్టుకుంటారని మోదీ నిలదీశారు. తనకన్నా సీనియర్ అని చెప్పుకుంటున్న చంద్రబాబు...తన సీనియార్టీతో ఏం సాధించారో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. ఏపీలో తండ్రీ, కొడుకుల రాజకీయం త్వరలోనే అంతం కాబోతుందని జోస్యం చెప్పారు.

లెక్కలు చెప్పడం చంద్రబాబుకు అలవాటు లేదు..
ప్రధాని మోదీ తన ప్రసంగంలో...’రాష్ట్ర అభివృద్ధి మానేసి, తన కుమారుడిని రాజకీయాల్లో పైకి తీసుకు రావాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తున‍్నారు. ఏ విధంగా ఆయన తన ఆస్తులను పెంచుకున్నారో అందరికీ తెలుసు. మీతో మాట్లాడుతున్న ఈ చౌకీదార్ చంద్రబాబుకు నిద్ర లేకుండా చేశారు. ఈ నాలుగు వాస్తవాలతో ఆయన పూర్తిగా భయపడుతున్నారు. రోజు చంద్రబాబు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం ఇచ్చిన ప్రతి పైసా లెక్క అడుగుతున్నాం. దీంతో చంద్రబాబు వణికిపోతున్నారు. కేంద్రం ఇచ్చిన నిధుల గురించి తాము లెక్కలు అడిగే సరికి చెప్పలేక ఆయన భయపడుతున్నారు.  గతంలో చంద్రబాబు ఎవరికీ లెక్కలు చెప్పేవారు కాదు. ఏపీకి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువే ఇచ్చాం. ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఎక్కువ నిధులనే ఏపీకి ఇవ్వడం జరిగింది. అయితే వాటిని సద్వినియోగం చేసుకోవడంలో చంద్రబాబు విఫలం అయ్యారు. కేంద్రం నుంచి వివిధ మంత్రిత్వ శాఖల ద్వారా ఏపీకి సుమారు రూ.3లక్షల కోట్ల ప్రాజెక్టులు ఇచ్చాం. 

చంద్రబాబు చెప్పింది నిజమే...
నాకు ఆస్తులు పెంచుకోవడం తెలియదని చంద్రబాబు అన్నారు. అది నిజమే. నాకు సొంత ఆస్తులు పెంచుకోవడం రాదు. కానీ అమరావతి నుంచి పోలవరం వరకూ తన ఆస్తులు పెంచుకోవడం కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. సొంత ఆస్తులు పెంచుకునే ఆశ నాకు లేదు. కేవలం దేశ సంపదను పెంచడం కోసమే ప్రజలు నన్ను ఎన్నుకున్నారు. దేశ సంపదను పెంచేందుకు మహిళలు, యువకులు ఇష్టపడుతున్నారు. వారికి పారదర్శకమైన వ్యవస్థను ఏర్పాటు చేయడమే మా బాధ్యత. సొంత పిల్లల ఆస్తులు పెంచుకోవడం కాదు. దేశ బిడ్డల అభ్యున్నతి కోసం కృషి చేయాలి. ఎప్పుడైనా ఒక ముఖ్యమంత్రి వాస్తవాల్ని వదిలిపెట్టి అసత్యాలు మాట్లాడుతున్నారంటే అతడు ప్రజల మద్దతు కోల్పోయాడని అర్థం. తన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఆ వ్యక్తి ఏదో పెద్ద తప్పు చేశారనే అర్థం. కేంద్రం గత 55 నెలల్లో ఏపీకి నిధులు ఇవ్వడంలో లోటు చేయలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిధులు సక్రమంగా ఖర్చు చేయడం లేదు.

ఏపీని విభజించిన సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అప్పుడు కాంగ్రెస్ తన స్వలాభం కోసమే విభజన చేసింది. అలాంటి ఆ పార్టీతో చంద్రబాబు జత కట్టారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదాతో ఎంత లాభం కలుగుతుందో ...ప్రత్యేక ప్యాకేజీ కింద అన్ని నిధులు వచ్చేలా చేశాం. ప్యాకేజీకి చంద్రబాబు అంగీకరించారు. 2016 సెప్టెంబర్‌లో కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. చంద్రబాబు కేంద్రాన్ని మెచ్చకుంటూ అసెంబ్లీలో కూడా తీర్మానం చేశారని’ ఈ సందర్భంగా గుర్తు చేశారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top