అసత్య హరిశ్చంద్ర.. ఒక్కటి నిజముంటే ఒట్టు..!

Chandrababu Naidu False Statements On Andhra Pradesh Development - Sakshi

ఏడు దశాబ్దాల కల పోలవరంను వైఎస్‌ సాకారం చేస్తే..  అది తానే పూర్తిచేశానంటున్న చంద్రబాబు

సైబర్‌ టవర్స్‌కు నాటి సీఎం నేదురుమల్లి రూపమిస్తే.. తానే చేసానని చంద్రబాబు ప్రచారం 

నదుల అనుసంధానం కాలేదంటున్న సీడబ్ల్యూసీ.. చేసి చరిత్ర సృష్టించానంటోన్న బాబు

రూ.65,345.45 కోట్ల ఖర్చు చేసినా.. ఒక్క ప్రాజెక్టూ పూర్తి చేయని దుస్థితి 

ఎన్నికష్టాలు ఎదురైనా సత్య మార్గాన్ని వదలని రాజు సత్యహరిశ్చంద్రుడి గురించి విన్నాం.. అశోక చక్రవర్తి నుంచి గాంధీ మహాత్ముని వరకూ.. అంతా ‘సత్యమేవ జయతే’అన్నారు. అందుకే మనమంతా.. సత్యమే గెలుస్తుంది, ధర్మమే నిలుస్తుందని నమ్ముతాం..  సామాన్య ప్రజలమైన మనమే సత్యాన్ని ఇంతగా అనుసరిస్తుంటే..  

ఇక ఏకంగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి...ఇంకా ఎంతో సత్యనిష్ట కలిగి ఉంటారని భావిస్తాం కదా..!  కాని, మన సీఎం చంద్రబాబు మాత్రం అందుకు మినహాయింపు!! ఆయనకు అసత్య నిష్ట ఎక్కువ... ప్రచారమే పరమావధిగా నమ్ముతారు.. తాను చేయని పనులను చేసినట్లు తన ఖాతాలో వేసుకుంటారు. చెప్పిందే చెబుతూ అబద్ధాన్ని నిజం చేయాలని నిత్యం గోబెల్స్‌ ప్రచారం చేస్తుంటారు..

హైదరాబాద్, సైబరాబాద్‌ నేనే నిర్మించా.. ఐటీ, రింగ్‌ రోడ్డు, ఎయిర్‌పోర్టు నేనే తెచ్చా..పోలవరం నేనే పూర్తిచేశా.. ప్రపంచంలో నదుల అనుసంధానం చేసింది నేనే..  రెయిన్‌ గన్‌లతో కరువన్నదే లేకుండా చేశా..  ఇంద్రుడి అమరావతిని తలదన్నే రాజధానిని నిర్మించింది నేనే అంటూ... కళ్లార్పకుండా కమిట్‌మెంట్‌తో కలియుగ అసత్యహరిశ్చంద్రుడు చెబుతున్న మాటల్లో వాస్తవమెంతో చూద్దామా..! 

రైతుల వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేసేశా.. 
వాస్తవం: రైతుల రుణాలు రూ.87,612 కోట్లు. ఇప్పటివరకు ఇచ్చిన రూ.15,300 కోట్లు వడ్డీకి కూడా సరిపోవు. గతేడాది సెప్టెంబర్‌ నాటికి రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ నివేదిక మేరకు రైతుల అప్పులు రూ.1,37,502.19 కోట్లకు పెరిగాయి. వాస్తవం ఇలా ఉంటే మరి రైతుల రుణాలను మాఫీ చేసిందెక్కడ? 

డ్వాక్రా రుణాలను మాఫీ చేసేశా.. 
వాస్తవం: బాబు అధికారంలోకి వచ్చే నాటికి డ్వాక్రా సంఘాల అప్పులు రూ.14,204 కోట్లు..డ్వాక్రా సంఘాల రుణ మాఫీకి ఎగనామం పెట్టారు. దాంతో గతేడాది సెప్టెంబర్‌ నాటికి డ్వ్రాక్రా సంఘాల అప్పులు రూ.25,424 కోట్లకు 
పెరిగాయి.  

కాపులను బీసీల్లో చేర్చి రిజర్వేషన్లు అమలు చేసేశా.. 
వాస్తవం: కాపులను బీసీల్లో చేర్చి ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపి చేతులు దులుపుకున్నారు చంద్రబాబు. దానినే ఘనంగా చెప్పుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల అగ్రవర్ణాల పేదలకు కల్పించిన పది శాతం రిజర్వేషన్లలో ఐదు శాతం కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తుత్తి జీవో జారీ చేసింది. దీన్నే ప్రచారం చేసుకుంటూ కాపులను మోసగిస్తోంది. 
 
రాష్ట్రంలో  క్యాలెండర్‌ ప్రకారం నోటిఫికేషన్లు విడుదల చేస్తూ.. ఖాళీలన్నీ భర్తీచేస్తున్నాం..
వాస్తవం: రాష్ట్రంలో మొత్తం పోస్టులు 6,97,621 ఉండగా.. అందులో ఖాళీలు 1,42,825. ఈ నాలుగున్నరేళ్లలో పదవీ విరమణ చేసిన వారిని కలిపితే ఖాళీల సంఖ్య 2.40 లక్షల వరకు ఉంది. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం మంజూరు అయిన ఉద్యోగాల సంఖ్య 4.83 లక్షలని... అందులో ఖాళీలు కేవలం 77,737 మాత్రమేనని పోస్టుల సంఖ్యను కుదించింది. ఆ పోస్టుల్లోనూ  20వేలు మాత్రమే రెగ్యులర్‌ ప్రాతిపదికన భర్తీ చేస్తామని.. తక్కిన వాటిని అవుట్‌సోర్సింగ్‌ విధానంలో నింపుతామని ప్రకటించి నిరుద్యోగుల ఆశలపై బాబు నీళ్లు చల్లారు. 2014 నుంచి ఇప్పటివరకూ 5వేల పోలీసు ఉద్యోగాలు పోగా.. ఏపీపీఎస్సీ ద్వారా నికరంగా భర్తీ చేసిన ఉద్యోగాలు కేవలం 2300 మాత్రమే. మరి ఇది ఉద్యోగాలను భర్తీ చేసినట్లు అవుతుందాం?! 

దేశంలో తొలిసారిగా నదులను అనుసంధానం చేసి చరిత్ర సృష్టించా. గోదావరి–కృష్ణా నదులను అనుసంధానం చేశా. 
వాస్తవం: పోలవరం కుడి కాలువను 145 కిలోమీటర్ల పొడువున లైనింగ్‌తో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పూర్తి చేశారు. పట్టిసీమ ఎత్తిపోతల పేరిట పది పంపులతో గోదావరి నీటిని పోలవరం కుడి కాలువలోకి ఎత్తిపోసి.. వాటిని ప్రకాశం బ్యారేజీకి తరలించి గోదావరి–కృష్ణా నదులను అనుసంధానం చేశానని.. దేశంలో ఇదే ప్రథమమని చంద్రబాబు ప్రకటించుకున్నారు. కానీ..కృ ష్ణా–గోదావరి నదులను అనుసంధానం చేయలేదని కేంద్ర జలసంఘం అనేక సందర్భాల్లో స్పష్టం చేసింది.

పోలవరం కుడి కాలువకు శంకుస్థాపన సభలో మాట్లాడుతున్న అప్పటి సీఎం వైఎస్సార్‌

ఒక నదిపై ఆనకట్ట నిర్మించి.. నీటిని నిల్వ చేసి వాటిని కాలువ ద్వారా తరలించి.. మరో నదిపై నిర్మించిన ఆనకట్టలోకి తరలించినప్పుడే వాటిని నదుల అనుసంధానం చేసినట్లుగా భావిస్తామని కేంద్ర జలసంఘం ఛైర్మన్‌ మసూద్‌ హుస్సేన్‌ ప్రకటించారు. గోదావరిపై నీటి నిల్వ చేసే ఆనకట్ట పోలవరం ప్రాజెక్టు.. ఆ ప్రాజెక్టును పూర్తి చేసి.. కుడి కాలువ మీదుగా ప్రకాశం బ్యారేజీకి గ్రావిటీపై నీటిని తరలించి.. కష్ణా, గోదావరి నదులను అనుసంధానం చేయడానికి దివంగత సీఎం వైఎస్‌ ప్రణాళిక రచించారు. 1863లో స్వాతంత్య్రం రాకముందు డచ్‌ దేశానికి చెందిన ఓ సంస్థ తుంగభద్ర, పెన్నా నదులను అనుసంధానం చేస్తూ.. కేసీ కెనాల్‌ను తవ్వింది. స్వాతంత్య్రం వచ్చాక తుంగభద్ర జలాశయం నుంచి తుంగభద్ర, పెన్నా, చిత్రావతి నదులను అనుసంధానం చేస్తూ.. హెచ్‌ఎల్‌సీ (ఎగువ కాలువ) తవ్వారు. ఇప్పుడు చెప్పండి.. చంద్రబాబు నదులను అనుసంధానం చేసి నిజంగా చరిత్ర సృష్టించారా?

నేనే ప్రాజెక్టులు పూర్తిచేశా.. నేనే ఆయకట్టుకు నీళ్లిచ్చా..
వాస్తవం: 1995 నుంచి 2004 వరకూ సీఎంగా అధికారం వెలగబెట్టిన చంద్రబాబు..1996 లోక్‌సభ ఎన్నికల సమయంలో, 1998 లోక్‌సభ మధ్యంతర ఎన్నికల సమయంలోనూ, 1999 సాధారణ ఎన్నికల సమయంలోనూ సాగునీటి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం.. ఎన్నికలయ్యాక వాటిని వదిలేయడం రివాజుగా మార్చుకున్నారు. 2004లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఒకేసారి లక్షా మూడు వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కోటి ఎకరాలకు నీళ్లందించడమే లక్ష్యంగా 83 ప్రాజెక్టులను ఒకేసారి చేపట్టారు. ఐదేళ్లలో 41 ప్రాజెక్టులను దాదాపుగా పూర్తిచేశారు. అప్పట్లో మిగిలిపోయిన ప్రాజెక్టులపై టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. జూలై 28, 2014న సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. రూ.17,368 కోట్లతో పెండింగ్‌ ప్రాజెక్టుల పనులన్నీ పూర్తిచేసి.. 35.04 లక్షల ఎకరాలకు నీళ్లందిస్తానని ప్రకటించారు. జూన్‌ 8, 2014 నుంచి ఇప్పటివరకూ రూ.65,345.45 కోట్లు ఖర్చు చేసినా.. ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయారు. అదనంగా కొత్తగా ఒక్క ఎకరా ఆయకట్టుకూ నీళ్లందించలేకపోయారు. దివంగత సీఎం వైఎస్‌  హయాంలో దాదాపుగా పూర్తయిన తోటపల్లి, గాలేరు–నగరి, హంద్రీ–నీవా తదితర ప్రాజెక్టుల గేట్లు ఎత్తి.. వాటిని తానే పూర్తి చేసినట్లు చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారు. 

హైదరాబాద్‌ను, సైబరాబాద్‌ను నేనే నిర్మించా.. హైదరాబాద్‌లో ఐటీని నేనే తెచ్చా. రింగ్‌రోడ్డును, ఎయిర్‌పోర్ట్‌ను నేనే నిర్మించా. ప్రపంచపటంలోహైదరాబాద్‌కు గుర్తింపు తెచ్చా.
వాస్తవం: అంతర్జాతీయ ఐటీ దిగ్గజ సంస్థలు 1991లో తమ డేటాను నిల్వ చేసుకోవడానికి, భూకంపాలు, తుఫాన్‌ల తాకిడి లేని.. సురక్షిత ప్రాంతాల కోసం అన్వేషించాయి.  భూకంపాల తాకిడే లేని హైదరాబాద్‌ అత్యంత సురక్షిత ప్రాంతమన్న ప్రధాని పీవీ సూచనల మేరకు ఐటీ సంస్థలు నాటి సీఎం నేదురుమల్లి జనార్దనరెడ్డిని సంప్రదించాయి. దాంతో సైబర్‌ టవర్స్‌కు నేదురుమల్లి శంకుస్థాపన చేసి.. ఐటీ దిగ్గజ సంస్థలు హైదరాబాద్‌కు వచ్చేలా చేశారు. ఆ తర్వాత ఐటీ సంస్థలు హైదరాబాద్‌కు తరలిరావడంతో హెటెక్‌ సిటీ రూపుదిద్దుకుంది. దీన్ని కూడా చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారు. అదేవిధంగా 2005లో దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి హైదరాబాద్‌ విమానాశ్రయం పనులను ప్రారంభించి కేవలం మూడేళ్లలో పూర్తిచేసి.. మార్చి 23, 2008న జాతికి అంకితం చేశారు. హైదరాబాద్‌ చుట్టూ 158 కిలోమీటర్ల రింగ్‌ రోడ్డును 2005లో ప్రారంభించి.. 2008 నాటికి దాదాపుగా పూర్తిచేశారు. ఇప్పుడు చెప్పండి హైదరాబాద్‌ నిర్మించిందెవరు? 
సోనియా గాంధీతో ఎయిర్‌పోర్ట్‌ ప్రారంభోత్సవంలో వైఎస్‌

ఐటీ రంగానికి ఆద్యుడిని నేనే. ఐటీ రంగంలో లక్షల మందికి ఉద్యోగాలు కల్పించా. 
వాస్తవం: ఉమ్మడి రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2003–04 నాటికి ఐటీ రంగంలో ఉద్యోగాలు చేస్తున్న వారి సంఖ్య 85 వేలు మాత్రమే. నాటి ఐటీ ఎగుమతుల విలువ రూ.5,025 కోట్లే. మే 14, 2004న సీఎంగా వైఎస్‌ రాజశేఖరరెడ్డి బాధ్యతలు స్వీకరించాక హైదరాబాద్‌కే పరిమితమైన ఐటీ రంగాన్ని విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి, కడప, వరంగల్‌ వంటి చిన్న పట్టణాలకు విస్తరించారు. కాగ్నిజెంట్, టీసీఎస్, ఇన్ఫోసిస్‌లతోపాటు మైక్రోసాఫ్ట్‌ మూడో దశ, విప్రో రెండో దశ పనులు అప్పట్లోనే మొదలయ్యాయి. యూఎస్‌ కాన్సులేట్‌ను ఏర్పాటయ్యేలా చేశారు. అప్పట్లోనే రాష్ట్రంలో 50వేల ఎకరాల్లో ఐటీఆర్‌(ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్‌ రీజియన్‌) ఏర్పాటుకు ఆమోదం లభించింది. వైఎస్‌ కషి వల్ల 2009 నాటికి ఐటీ రంగం ఉద్యోగాలు చేస్తున్న వారి సంఖ్య 2.85 లక్షలకు చేరుకుంది. ఐటీ ఎగుమతులు 2004–05లో రూ.8,145 కోట్లకు, 2005–06లో రూ.12,521 కోట్లు, 2006–07లో రూ.18,582 కోట్లు, 2007–08లో రూ.26,122 కోట్లు, 2008–09లో రూ.32,509 కోట్లు, 2009–10లో రూ.33,482 కోట్లకు చేరుకోవడం గమనార్హం. గణాంకాలు ఇలా ఉంటే... మరి  ఇందులో ఎవరి ఘనత ఎంతో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. 

హైటెక్‌ సిటీకి శంకుస్థాపన చేస్తున్న అప్పటి సీఎం నేదురుమల్లి (ఫైల్‌)

పోలవరం ప్రాజెక్టు నా కల. ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తా. 
వాస్తవం: తెలుగు ప్రజల ఏడు దశాబ్దాల స్వప్నం పోలవరం. 2004 వరకూ ఆ స్వప్నాన్ని సాకారం చేయడానికి ఏ ముఖ్యమంత్రి సాహసించలేదు. మే 14, 2004న సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడమే తన లక్ష్యమని దివంగత ముఖ్యమంత్రి మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రకటించారు. ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు అవసరమైన ‘సైట్‌ క్లియరెన్స్‌’ను సెప్టెంబరు 19, 2005న.. అటవీ పర్యావరణ అనుమతిని అక్టోబర్‌ 25, 2005న.. అభయారణ్యం అనుమతిని జూలై 6, 2007న.. సహాయ పునరావాస ప్యాకేజీకి ఏప్రిల్‌ 17, 2007న కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులను సాధించారు. రూ.10,151.04 కోట్ల అంచనా వ్యయంతో పోలవరం ప్రాజెక్టు పనులను చేపట్టారు. కుడి కాలువ పనులను 145 కిలోమీటర్ల  పొడవున లైనింగ్‌తో సహా పూర్తి చేశారు. ఎడమ కాలువను 134 కిలోమీటర్ల పొడవున లైనింగ్‌తో సహా పూర్తి చేశారు. హెడ్‌ వర్క్స్‌(జలాశయం) పనులను కొలిక్కి తెచ్చేందుకు ప్రయత్నిస్తూనే..పోలవరానికి జాతీయ ప్రాజెక్టు హోదా సాధించడానికి గట్టి ప్రయత్నాలు చేశారు. ఇందుకు అవసరమైన కేంద్ర ప్రణాళిక సంఘం అనుమతిని ఫిబ్రవరి 25, 2009న సాధించారు. 2009 నాటికే రూ.5135.87 కోట్లు ఖర్చు చేసి 44.84 శాతం పనులు పూర్తి చేశారు. ఇది వాస్తవం. నిజంగా పోలవరం తన కలైతే 1995 నుంచి 2004 దాకా అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రాజెక్టు పనులు చేపట్టడానికి వీలుగా కనీసం పరిపాలన అనుమతి ఇవ్వడానికి చంద్రబాబుకు ఎందుకు చేతులు రాలేదు. పోలవరం ఎవరి కలో చెప్పడానికి పై సాక్ష్యాలే నిదర్శనం.  
అన్ని అనుమతులు సాధించి ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తున్న అప్పటి సీఎం వైఎస్సార్‌

సంక్షోభాన్ని అవకాశంగా మల్చుకుంటా.. అంతర్జాతీయ ప్రమాణాలతో  తలదన్నే రాజధాని అమరావతిని నిర్మిస్తా.
వాస్తవం: రాజధాని కోసం బహుళ పంటలు పండే 33వేల ఎకరాల భూమిని సమీకరించారు. ఇందులో 40 ఎకరాల్లో చదరపు అడుగుకు రూ.11వేల వంతున ఖర్చు చేసి.. తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక శాసనసభ, శాసన మండలి భవనాలను నిర్మించారు. చిన్నపాటి వర్షం కురిస్తే చాలు.. తాత్కాలిక సచివాలయం, శాసనసభ భవనాలు లీకేజీ కావడం వల్ల మడుగులను తలపించడం రివాజుగా మారింది. ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో రూ.39,875 కోట్లతో శాశ్వత సచివాలయం, శాసనసభ, మండలి భవనాలతోపాటు రహదారుల పనులకు టెండర్లు పిలిచారు.  ఎల్‌ అండ్‌ టీ, షాపూర్‌జీ పల్లోంజీ, బీఎస్సార్‌ ఇన్‌ఫ్రా, ఎన్‌సీసీ కాంట్రాక్టు సంస్థలకు వాటిని సగటున 4.89 శాతం అధిక ధరలకు అప్పగించారు. ఆ నాలుగు సంస్థలకే ఈ పనులను హడావుడిగా అప్పగించేసి.. రూ.3,987.50కోట్లను మొబిలైజేషన్‌ అడ్వాన్సులుగా ఇచ్చేయడంలో ఆంతర్యమేమిటన్నది బహిరంగ రహస్యమే. ఐదేళ్లు అధికారంలో కొనసాగి కూడా రాజధానిలో ఒక్క శాశ్వత నిర్మాణం చేపట్టలేదన్నది వాస్తవం.  

రాష్ట్రంలోకి రూ.19.61లక్షల కోట్లు పెట్టుబడితో పరిశ్రమలు స్థాపించేలా 1761 ఒప్పందాలు చేసుకున్నా. వీటిద్వారా 32,55,263 మందికి ఉద్యోగాలు కల్పిస్తాం. 
వాస్తవం: రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నంలో భాగస్వామ్య సదస్సులు నిర్వహించింది. పెట్టుబడులు తెస్తానంటూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే విదేశీ పర్యటనలకు వెళ్లారు. దేశంలోనూ విదేశాల్లోనూ చేసుకున్న ఒప్పందాల(ఎంవోయూ) ద్వారా భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలోకి రూ.19.61లక్షల కోట్లు పెట్టుబడితో పరిశ్రమలు స్థాపించేలా 1761 ఒప్పందాలు చేసుకున్నాం అన్నారు. కానీ.. 2014 నుంచి ఇప్పటివరకూ కేవలం రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు కేవలం రూ.9,553 కోట్లు మాత్రమేనని డీఐపీపీ(డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ పాలసీ అండ్‌ ప్రమోషన్‌) ప్రకటించడం వాస్తవం కాదా!!     

ఇదీ రాజధాని ప్రాంత పరిస్థితి 
–సాక్షి, అమరావతి

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top