బీజేపీ ఆటలు సాగనివ్వను | Sakshi
Sakshi News home page

బీజేపీ ఆటలు సాగనివ్వను

Published Wed, Oct 31 2018 4:25 AM

Chandrababu fires on BJP at Dharma Porata Sabha - Sakshi

సాక్షి ప్రతినిధి కడప/ప్రొద్దుటూరు: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇష్టానుసారం వ్యవహరిస్తోంది. వెనుకబడిన ప్రాంతాలపట్ల సమదృష్టిని ప్రదర్శించడంలేదు. విభజన చట్టంలోని అంశాలను అమలుచేయలేదు. రాజకీయంగా విభేదించి ఇదేం అన్యాయమని ప్రశ్నిస్తే ఐటీ, ఈడీ, సీబీఐలను ఉసిగొల్పుతున్నారు. బీజేపీ ఆటలు సాగనివ్వను’.. అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరులో మంగళవారం జరిగిన ధర్మపోరాటం సభలో ఆయన మాట్లాడారు. 40 ఏళ్లు నిష్టగా రాజకీయాలు చేశానని, ఆ రోజు ఇందిరా గాంధీకి ఎన్టీఆర్‌ భయపడలేదని.. ఇప్పుడు తాను నరేంద్ర మోదీకి భయపడే ప్రసక్తేలేదన్నారు. మోదీ కంటే పదేళ్లు ముందుగా సీఎంగా బాధ్యతలు చేపట్టానన్నారు. కేంద్ర ప్రభుత్వం చర్యలకు నిరసనగా ధర్మపోరాటం చేస్తున్నామని వివరించారు. 

అసెంబ్లీ సీట్లు పెంచలేదు..
‘కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. విభజన అంశాలు అమలుచేస్తామని చేయలేదు. చివరికి అసెంబ్లీ సీట్లు పెంచమని కోరినా పెంచలేదు. మొత్తం 175 సీట్లలో టీడీపీ సత్తా చాటుతాం. ‘ఆపరేషన్‌ గరుడ’పై సినీ నటుడు శివాజీ చెప్పినట్లే జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఎయిర్‌పోర్టులో ప్రతిపక్ష నేతపై ఆయన అభిమానే కోడికత్తితో దాడిచేశాడు. వీళ్లు చెప్పి చేయించారా.. ఆయనే చేశాడా.. అన్న విషయం తెలియాల్సి ఉంది. అలాగే, కోడి కత్తి కేసులో నేరుగా గవర్నర్‌ డీజీపీకి ఫోన్‌చేసి విచారించడం రాజ్యాంగ విరుద్ధం. సాక్షి పేపర్, సాక్షి టీవీ ఉందని ఇష్టానుసారం వార్తలు రాస్తున్నారు. వారి ఆటలు సాగవు. తెలంగాణలో ప్రజాస్వామ్యం కోసమే పొత్తులు పెట్టుకున్నాం’.. అని బాబు స్పష్టం చేశారు. కాగా, కడప కేంద్రంగా రాయలసీమ ఉక్కు కర్మాగారానికి నెలలోగా శంకుస్థాపన చేయనున్నట్లు సీఎం చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు లోకేష్, సోమిరెడ్డి, దేవినేని ఉమా, ఆది నారాయణరెడ్డి, సుజయ్‌ కృష్ణ రంగారావు, ఎంపీలు అశోక్‌గజపతిరాజు, మాగంటి బాబు, కొనకళ్ల నారాయణ, మాల్యాద్రి, బుట్టా రేణుక, జేసీ దివాకర్‌రెడ్డి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, టీటీడీ చైర్మన్‌ పుట్టా సుధాకర్, ఆర్టీసీ చైర్మన్‌ వర్ల రామయ్య పాల్గొన్నారు.

తిరుమల బస్సుల అపవిత్రత 
ఇదిలా ఉంటే.. తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరస్వామిని అందరూ ఎంతో పవిత్రంగా కొలుస్తారు. అలాంటిది తిరుమలకు వెళ్లే బస్సులను సైతం టీడీపీ నేతలు అపవిత్రం చేశారు. ప్రొద్దుటూరులో జరిగిన సీఎం ధర్మపోరాట సభకు జనాన్ని తరలించేందుకు తిరుపతి, తిరుమల బస్సులనూ వినియోగించారు. జన సమీకరణ కోసం టీడీపీ నేతలు స్థాయిని బట్టి రూ.200 నుంచి రూ.300 వరకు నగదు ఇవ్వడంతోపాటు బిర్యాని ప్యాకెట్, మద్యం బాటిళ్లు అందించారు. టీడీపీ శ్రేణులు ఈ బస్సుల్లో మద్యాన్ని తీసుకెళ్లడం, మద్యం సేవించి ప్రయాణించడంపై భక్తుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement