
వైఎస్ జగన్‌నే ఫాలో అవుతా అంటున్నారు.. సీఎం చంద్రబాబు నాయుడు..
సాక్షి, హైదరాబాద్ : ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డినే ఫాలో అవుతా అంటున్నారు.. సీఎం చంద్రబాబు నాయుడు. ఇప్పటికే నవరత్నాలను కాపీ కొట్టి సరిగ్గా ఎన్నికల ముందు అమలు పేరిట హడావిడి చేస్తున్న సీఎం సారు.. ప్రత్యేక హోదా పోరాట విషయంలోనూ ప్రతిపక్ష నేతనే అనుసరిస్తున్నారు. నాలుగేళ్లు కేంద్రం ప్రభుత్వంతో అంటకాగి హోదా వద్దు.. ప్యాకేజీ ముద్దు.. హోదాతో ఏం వస్తుందని దబాయించిన చంద్రబాబు.. హోదా కోసం వైఎస్సార్‌సీపీ ఉవ్వెత్తున ఉద్యమించడంతో యూటర్న్ తీసుకున్నారు. హోదా విషయంలో యూటర్న్‌ల మీద యూటర్న్‌లు తీసుకున్న ఆయన సరిగ్గా ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎలాంటి సాయం చేయలేదని గగ్గోలు పెడుతున్నారు. అసెంబ్లీ సాక్షిగా ప్రత్యేక హోదా ఏమైనా సంజీవినా? అంటూ ప్రశ్నించి.. ప్యాకేజీతోనే రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందని బుకాయించిన చంద్రబాబే.. తాజాగా సభలో నల్లచొక్కాలతో నిరసన కాన్సెప్ట్‌ను కూడా కాపీ కొట్టారు. హోదా కోసం గతంలోనే వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు అనేకసార్లు నల్లచొక్కాలతో సభలో నిరసన తెలుపుతూ.. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఇక సరిగ్గా ఎన్నికల ముందు బీజేపీతో తెగతెంపులు చేసుకున్న చంద్రబాబు.. ప్రతివిషయంలో ‘ఐ వాన్నా ఫాలో ఫాలో యూ జగన్’ అన్నట్టుగా సాగుతున్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు వేస్తున్న ఈ వేషాలను నమ్మబోమని ప్రజలు అంటున్నారు.