మాట నిలబెట్టుకోలేకపోవడం నమ్మకద్రోహమే...  | Chandrababu comments on Pawan Kalyan at dharma porata deeksha | Sakshi
Sakshi News home page

మాట నిలబెట్టుకోలేకపోవడం నమ్మకద్రోహమే... 

Sep 30 2018 4:04 AM | Updated on Mar 22 2019 5:33 PM

Chandrababu comments on Pawan Kalyan at dharma porata deeksha - Sakshi

ధర్మపోరాట దీక్షలోమాట్లాడుతున్న సీఎం

సాక్షి ప్రతినిధి, ఏలూరు/ఏలూరు మెట్రో:  నాలుగున్నరేళ్లు పూర్తయినా ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోవడం నమ్మక ద్రోహమేనని కేంద్ర ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ నమ్మక ద్రోహం చేస్తారని కలలో కూడా అనుకోలేదన్నారు. ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని గద్దె దింపి ప్రత్యేక హోదా సాధిస్తామన్నారు. శనివారం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరిగిన ధర్మపోరాట దీక్షలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. రాష్ట్ర విభజన సమయంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ హేతుబద్ధత లేకుండా అన్యాయం చేసిందన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఎవ్వరికీ ఇవ్వం అని చెప్పి, దేశంలో 11 రాష్ట్రాలకు ఇచ్చి ఏపీకి మొండిచేయి చూపించిదన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం రూ.3 వేల కోట్లు ఇవ్వాల్సి ఉందన్నారు. ఇంతవరకూ రివైజ్డ్‌ డీపీఆర్‌ ఇవ్వలేదని మండిపడ్డారు. భూసేకరణ, పునరావాసం కల్పించాల్సి ఉన్నా కేంద్రం మీనమేషాలు లెక్కబెడుతోందని విమర్శించారు. 2019 మే నాటికి గ్రావిటీపై నీరు ఇస్తామన్నారు. 

ఏపీని పట్టించుకోవడంలేదు
‘‘బుల్లెట్‌ ట్రైన్‌కు లక్ష పదిహేను వేలు కోట్లు ఖర్చుపెడతారు. ద్వారకలో కన్వెన్షన్‌ సెంటర్‌కు ఇరవై ఏడువేల కోట్లు ఖర్చుపెడతారు. ప్రపంచ స్థాయి నగరం నిర్మిస్తామంటే రూ.1,500 కోట్లు ఇచ్చారు. దాంతో ఎలక్ట్రిసిటీ కేబుళ్లు కూడా రావు’’ అంటూ ప్రధానిపై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. 11 జాతీయ విద్యాసంస్థలు ఇస్తామన్నారని, తొమ్మిది మాత్రం ఇచ్చి వాటికి నిధులు ఇవ్వలేదన్నారు. అవిపూర్తవడానికి 30 ఏళ్లు పడుతుందన్నారు. దుగరాజపట్నం పోర్టు ఇవ్వలేదని, రామాయపట్నంలో పోర్టు కట్టుకుంటామంటే.. వయొబిలిటీ లేదని అడ్డం పడుతున్నారు అని చంద్రబాబు చెప్పారు. ఒక ప్రాంతీయ పార్టీ కేంద్రంపై అవిశ్వాసం పెట్టడం నూతన అధ్యాయమని, అయితే వైఎస్సార్‌సీపీ నేతలు రాజీనామాలు చేసి పారిపోయారని చంద్రబాబు విమర్శించారు.  

పార్లమెంట్‌లో ప్రధాని మోదీ మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను సైతం బెదిరించే ధోరణిలో మాట్లాడారని సీఎం చెప్పారు. రాష్ట్రానికి అన్యాయం జరిగినా వైఎస్సార్‌సీపీ మాట్లాడదని, వారి సాక్షి పేపర్లో కేంద్రం చేసే అన్యాయం గురించి రాయరంటూ సీఎం ఆరోపించారు. నిరుద్యోగ భృతి ఇస్తామంటే వైఎస్సార్‌ పార్టీ నేతలు ఆందోళన చేస్తారని, రాజధానిపై కోర్టుకు వెళ్తారని, విశాఖలో భాగస్వామ్య సదస్సు పెడితే తునిలో విధ్వంసం చేశారనిప్రతిపక్షంపై సీఎం తీవ్ర ఆరోపణలు చేశారు. నిన్నమొన్నటి వరకూ తనను పొగిడిన పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు తనను తిట్టడమే ధ్యేయంగా పెట్టుకున్నారని చంద్రబాబు అన్నారు. పవన్‌ తన ప్రాణానికి ముప్పు ఉందని చెబుతున్నారని, ఆయనకు రక్షణ ఇచ్చే బాధ్యత తమదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement