
సాక్షి, హైదరాబాద్ : రానున్న ఎన్నికల్లో పోటీ చేయబోయే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్ధులకు సంబంధించిన మరో జాబితాను జనసేన పార్టీ మంగళవారం అధికారికంగా ప్రకటించింది. విశాఖపట్నం లోక్ సభ స్థానం నుంచి ఇటీవలే పార్టీలో చేరిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పోటీ చేయనున్నట్టు జనసేన ఓ ప్రకటనలో తెలిపింది. తొలుత భీమిలి నుంచి పోటీ చేస్తారని ఊహాగానాలు వచ్చినా.. అనేక రాజకీయ సమీకరణాల నేపథ్యంలో విశాఖ లోక్ సభ స్థానం నుంచి లక్ష్మీనారాయణను పోటీ చేయించాలని నిర్ణయించింది.
(భీమవరం, గాజువాకలో పవన్ పోటీ)
లక్ష్మీనారాయణకు అవకాశం కల్పించిన జనసేన.. ఆయన తోడల్లుడు మాజీ వైస్ చాన్స్‌లర్ రాజగోపాల్‌కు మాత్రం షాక్ ఇచ్చింది. అనంతపురం శాసన సభ నుంచి రాజగోపాల్‌ను పోటి చేస్తారని మొదటి నుంచి వార్తలు వచ్చాయి. అయితే చివరి నిమిషంలో ఇంటా బయట ఒత్తిళ్లతో వెనక్కి తగ్గిన పవన్ కళ్యాణ్ ఆయనకు అవకాశం కల్పించలేదు. దీంతో రాజగోపాల్ స్థానంలో వరుణ్‌కు అవకాశం కల్పించారు. దీనిపై అలక చెందిన రాజగోపాల్‌కు పార్టీలో ఓ ఉన్నత పదవి ఇస్తామని హామీ ఇచ్చి బుజ్జగించారు. ఇక విశాఖ ఎంపీ స్థానంతో పాటు పలు అసెంబ్లీ స్థానాలకు కూడా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అభ్యర్థులను ప్రకటించారు.
శాసనసభ అభ్యర్థులు
విశాఖ పట్నం నార్త్: పసుపులేటి ఉషా కిరణ్
విశాఖ సౌత్: గంపల గిరిధర్
విశాఖ ఈస్ట్: కోన తాతా రావు
భీమిలి: పంచకర్ల సందీప్
అమలాపురం: శెట్టిబత్తుల రాజబాబు
పెద్దాపురం: తుమ్మల రామ స్వామి
పోలవరం: చిర్రి బాల రాజు
అనంతపురం: టి.సి. వరుణ్