మోదీపై విశ్వాసం: టాప్‌-5లో సీఎం జగన్

C Voter Survey On PM Modi And All Chief Ministers - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : చాయ్‌వాలాగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనతికాలంలో దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా ఎదిగారు. మూడుసార్లు గుజరాత్‌ ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవంతో జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టిన మోదీ.. బీజేపీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సంపూర్ణ మెజార్టీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చారు. తొలి ఐదేళ్ల పాలనాకాలంలో తనదైన ముద్రవేసుకున్న ప్రధాని.. వందేళ్ల చరిత్రగల పార్టీని కోలుకోలేని దెబ్బతీసి రెండోసారి అధికారంలోకి వచ్చారు. ఈ క్రమంలోనే రెండోసారి దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి మే 29 నాటికి తొలి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సర్వే సంస్థ ‘సీ ఓటర్‌’ ఓ సర్వేను నిర్వహించింది. (మోదీ ఏడాది పాలనకు 62 శాతం మంది జై!)

ప్రధానమంత్రితో పాటు ముఖ్యమం‍త్రుల ప్రజాదరణపై ఓ నివేదికను విడుదల చేసింది. ఆరేళ్ల కాలంలో అనేక చారిత్రాత్మక నిర్ణయాలతో దూసుకుపోతున్న ప్రధాని మోదీకి దేశ వ్యాప్తంగా 65శాతం ప్రజలు మద్దతు లభించిందని సర్వే పేర్కొంది. ముఖ్యంగా రెండోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం దూసుడైన నిర్ణయాలతో ప్రజల దృష్టిని మోదీ ఆకర్శించారని తెలిపింది. మోదీ పనితీరుపై ప్రజలకు మరింత విశ్వాసం పెరిగిందని సర్వేలో వెల్లడించింది. (గ్లోబల్‌ లీడర్‌గా భారత్‌!)

టాప్‌-5 లో సీఎం జగన్‌
ఇక ముఖ్యమంత్రులపై ‘సీ ఓటర్’‌ నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ చరిత్రను తిరగరాస్తూ అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి దేశ వ్యాప్తంగా టాప్‌-5 సీఎంల జాబితాలో చోటు దక్కింది. ప్రభుత్వ నిర్ణయాలు, పనితీరు ఆధారంగా ఈ సర్వే రూపొందించగా.. సీఎం జగన్‌కు 78.1శాతం మంది ప్రజల మద్దతు లభించింది. నాలుగో స్థానంలో సీఎం జగన్‌ చోటు దక్కించుకున్నారని సీ ఓటర్‌ సర్వే నివేదికలో తెలిపింది. ముఖ్యమంత్రిగా పాలనాబాధ్యతలు స్వీకరించిన తొలి ఏడాది కాలంలోనే అనేక నిర్ణయాలు తీసుకున్నారని తెలిపింది. ఇక అత్యధిక ప్రజాదరణ లభించిన ముఖ్యమంత్రి జాబితాలో ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్ తొలి స్థానంలో ‌ఉండగా, తరువాత స్థానాల్లో ఛత్తీస్‌గఢ్‌‌, కేరళ ముఖ్యమంత్రులు భూపేశ్‌ వాఘేలా, పినరయి విజయన్‌ ఉన్నారు. ఐదో స్థానంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే నిలిచారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top