కుర్చీల కొట్లాటలో భాగమే బస్సు యాత్ర

Bus yatra aimed at obstructing projects - Sakshi

కాంగ్రెస్‌కు ప్రజలే బుద్ధి చెప్తారు: చీఫ్‌ విప్‌ పాతూరి

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న కుర్చీల కొట్లాటలో భాగంగానే బస్సు యాత్ర జరుగుతున్నదని శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్‌విప్‌ పాతూరి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ విప్‌ బి.వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, భూపాల్‌రెడ్డితో కలిసి బుధవారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీలో పెత్తనంకోసం ఈ కుర్చీల కొట్లాట జరుగుతున్నదన్నారు. రైతు సమన్వయ సమితులను రౌడీ సమితులు అంటూ కాంగ్రెస్‌ నేతలు మాట్లాడటం దారుణమని, దీనిపై తగిన సమయంలో ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు.

ఆ మాటలను కాంగ్రెస్‌ నేతలు ఉపసంహరించుకోవాలన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ స్వయంగా చెప్పినా గత ఎన్నికల్లో ప్రజలు నమ్మలేదని, భవిష్యత్తులోనూ ఆ పార్టీని నమ్మరని పాతూరి అన్నారు. ప్రభుత్వ విప్‌ బి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రైతులను రౌడీలు అంటూ మాట్లాడిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ నేతల బస్సుయాత్ర ఎందుకో వారికే తెలియదన్నారు. ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ అబద్ధాలు మాట్లాడుతున్న కాంగ్రెస్‌ నేతలపై 420 కింద కేసులు పెట్టాలని డిమాండ్‌ చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top