
షిమ్లా: హిమాచల్‌ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. కాంగ్రెస్ పార్టీని ఓడించి అధికారాన్ని దక్కించుకుంది. కమలం పార్టీ విజయం సాధించినప్పటికీ ఊహించని విధంగా ఆ పార్టీ ప్రముఖులు ఓడిపోయారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రేమ్‌కుమార్ ధుమాల్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సత్పాల్ సింగ్ సత్తి పరాజయం పాలయ్యారు. సుజాన్‌పూర్ నుంచి పోటీ చేసిన ధుమాల్ కాంగ్రెస్ అభ్యర్థి రాజేందర్ రాణా చేతిలో 3,500 ఓట్ల పైచిలుకు తేడాతో ఓటమి చవిచూశారు.
ఎన్నికలకు రెండు వారాలు ముందు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయన పేరును బీజేపీ ప్రకటించింది. గతంలో రెండు పర్యాయాలు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే తన ఓటమికి ప్రాధాన్య లేదని, పార్టీ గెలుపే ముఖ్యమని ధుమాల్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బీజేపీని గెలిపించేందుకు ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తన ఓటమిని ఊహించలేదని, పరాజయానికి గల కారణాలను విశ్లేషించుకుంటానని చెప్పారు.
ఉనా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సత్పాల్ సింగ్ సత్తి కూడా ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ అభ్యర్థి సత్పాల్ సింగ్ రైజడా చేతిలో 3,196 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2012 ఎన్నికల్లో ఇదే నియోజకర్గం నుంచి సత్పాల్ సింగ్ సత్తి 4,746 ఓట్ల మెజారిటీతో గెలిచారు.