ఆ ఎన్నికలను వాయిదా వేయండి

BJP wants Central Election Commission to Postpone MPTC and ZPTC - Sakshi

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ లేఖ 

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే నెలలో జరుపతలపెట్టిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను వాయిదా వేయాలని బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈమేరకు కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్‌ కమిషనర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ లేఖ రాశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో, రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ సరికాదని ఆయన లేఖలో అభిప్రాయపడ్డారు. పార్లమెంటు ఎన్నికల ఫలితాల అనంతరమే ఈ ఎన్నికలు నిర్వహించేలా చూడాలని కోరారు. అయితే, కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు అనుమతించిందంటూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చెప్పుకుంటోందని, ఇందులో స్పష్టత కావాలని లేఖలో కోరారు.

పార్టీ గుర్తులపైనే ఈ ఎన్నికలు జరగనున్నందున తామంతా ప్రచారానికి వెళ్లాల్సి ఉంటుందని, కానీ ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికల కోసం తాము దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్తున్నామని, దీన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇక గ్రామ స్థాయిలో జరిగే ఈ ఎన్నికల్లో భావోద్వేగాలు తీవ్రంగా ఉంటాయని, ఇవి ఒక్కోసారి గొడవలకు కూడా కారణమయ్యే ప్రమాదం ఉంటుందని, అలాంటప్పుడు పారామిలటరీ దళాలు రావాల్సి ఉంటుందని, ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల బిజీలో ఉన్న ఆ దళాలు ఎలా రాగలుగుతాయని ప్రశ్నించారు.

ఎంపీపీ, జెడ్పీ అధ్యక్షుల ఎన్నికను పరోక్ష పద్ధతిలో నిర్వహించబోతున్నారని, కానీ రాజ్యాంగ స్ఫూర్తికి ఇది విరుద్ధమైనందున, ఆ ఎన్నికలు ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆయన కోరారు. అలాగే, ప్రస్తుతం ఎలాంటి కీలక అధికారాలు లేక ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులు అలంకారప్రాయంగానే ఉన్నాయని, వారికి అధికారాలు ఇచ్చేలా నిపుణులు కసరత్తు చేస్తున్న విషయాన్ని గుర్తించాలని కోరారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని పార్లమెంటు ఎన్నికల ఫలితాలు వెలువడ్డ తర్వాత ఈ ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని లక్ష్మణ్‌ లేఖలో కోరారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top