
కోల్‌కతా: దేశ లౌకిక విలువల్ని ధ్వంసం చేసి, ప్రజల్లో భయాందోళనలను సృష్టించేందుకే కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం ఎన్నార్సీ, పౌరసత్వ చట్టాన్ని అమలు చేస్తోందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. భారత జాతీయతా భావం స్థానంలో హిందూ జాతీయతా భావాన్ని చొప్పించేందుకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. సీపీఐ 100వ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘విద్వేషాలను రెచ్చగొట్టేందుకు మత శక్తులు పనిచేస్తున్నాయి.
ఇందులో భాగంగానే బీజేపీ ప్రభుత్వం జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్నార్సీ), పౌరసత్వ (సవరణ)బిల్లును తీసుకువచ్చింది. కొన్ని వర్గాల ప్రజలను లక్ష్యంగా చేసుకుని విభజనలు సృష్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది’అని ఆరోపించారు. భారత్‌ను హిందూ దేశంగా మార్చేందుకు చేస్తున్న ఈ కుట్ర రాజ్యాంగ విలువలకు పూర్తిగా విరుద్ధమని పేర్కొన్నారు. కాగా, ఒకప్పటి యూఎస్‌ఎస్‌ఆర్‌లో భాగంగా ఉన్న ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్‌లో 1920 అక్టోబర్ 17వ తేదీన భారతీయ నాయకుల నేతృత్వంలో ఇండియన్ కమ్యూనిస్టు పార్టీ(ఐసీపీ)అవతరించింది.