గెలవాలంటే ‘చీల్చాల్సిందేనా!’

BJP Trying to Split Opposition Parties - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బ్రిటీష్‌ పాలకులు భారతీయులను అన్నేళ్లు పీడించడానికి కారణం వారు అనుసరించిన ‘విభజించు పాలించు’ సూత్రమే కారణం అంటారు. అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ రానున్న సార్వత్రికల్లో మరోసారి విజయం సాధించి మరిన్నేళ్లు పాలించేందుకు ప్రతిపక్షా పార్టీలను చీలుస్తోంది. మొన్న ఉత్తర ప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ బాబాయ్‌ శివపాల్‌ యాదవ్‌ను ప్రోత్సహించి ‘సమాజ్‌వాది సెక్యులర్‌ మోర్చా’ పార్టీని పెట్టించగా, ఇప్పుడు తమిళనాడులో ద్రావిడ మున్నేట్ర కళగం బహిష్కత నాయకుడు అళగరిని పార్టీని చీల్చాల్సిందిగా ప్రోత్సహిస్తోంది.

యూపీలో అఖిలేష్‌ యాదవ్‌తో విభేదించిన శివపాల్‌ యాదవ్‌ బీజేపీలో చేరేందుకు ప్రయత్నించారు. ఆయన తరఫున ఒకప్పుడు పార్టీకి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అమర్‌ సింగ్‌ బీజేపీ అధినాయకత్వంతో సంప్రతింపులు జరపడం, కొత్త పార్టీ పెట్టినట్లయితే తాము అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని బీజేపీ హామీ ఇవ్వడం తెల్సిన పరిణామాలే. ఈ కారణంగానే శివపాల్‌ యాదవ్‌కు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అండదండలు లభిస్తున్నాయి. ఇప్పుడు బీజేపీ అధిష్టానం కన్ను తమిళనాడులోని ప్రతిపక్ష పార్టీ ద్రావిడ మున్నేట్ర కళగం నాయకత్వంపై పడింది. కరుణానిధి వారసుడిగా డీఎంకే పార్టీ అ«ధ్యక్షుడిగా స్టాలిన్‌నే ఎన్నుకుంది. స్టాలిన్‌ నాయకత్వాన్ని అంగీకరించేది లేదన్న అళగిరిని పార్టీ బహిష్కరించింది. దాంతో అళగిరి తన మద్దతుదారులతో తిరుగుబాటు జెండా ఎగరవేశారు. అళగిరి తన బలప్రదర్శన కోసం నిర్వహించిన ర్యాలీకి కూడా బీజేపీ, ఆరెస్సెస్‌ కార్యకర్తలే ఎక్కువగా జన సమీకరణ చేశారని తెల్సింది. నిజమైన పార్టీ క్యాడర్‌ తన వెంట ఉందని చెబుతున్న అళగిరి మరోసారి తండ్రి కరుణానిధికి నివాళి పేరిట జన సమీకరణకు సిద్ధ మవుతున్నారు. అళగిరి ద్వారా వీలయితే డీఎంకేను చీల్చాలని, లేదంటే ఆయనతోని కూడా కొత్త పార్టీ పెట్టివ్వాలన్నది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది.

ఇప్పటికే కర్ణాటకలో గట్టిగానే పునాదులు వేసుకున్న బీజేపీకి తమిళనాడులో నామ మాత్రపు బలం కూడా లేదు. 2016లో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణించినప్పటి నుంచి పాలకపక్ష అన్నాడీఎంకేలో తీవ్ర సంక్షోభ పరిస్థితులు కొనసాగుతున్న విషయం తెల్సిందే. రానున్న ఎన్నికల్లో డీఎంకేదే విజయమని సర్వేలు ఇప్పటికే తేల్చాయి. ఈ నేపథ్యంలో డీఎంకేలో చీలిక తీసుకరావడం ద్వారా తాము బలపడాలన్నది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. తమిళనాడులోని 39 పార్లమెంట్‌ సీట్లలో కొన్నింటినైనా గెలుచుకోవాలని కోరుకుంటోంది. ఉత్తరప్రదేశ్‌లో 80 పార్లమెంట్‌ సీట్లకుగాను 71 సీట్లను బీజేపీ గెలుచుకున్న విషయం తెల్సిందే. వచ్చే ఎన్నికల్లో వీటిలో మెజారిటీ సీట్లను నిలబెట్టుకుంటేనే కేంద్రంలో బీజేపీ తిరిగి అధికారంలోకి రాగలదు. యూపీలో సమాజ్‌వాది పార్టీ, బహుజన సమాజ్‌ పార్టీలు ఏకమయితే బీజీపీకి పరాభవం తప్పదని గోరఖ్‌పూర్, ఫూల్పూర్‌ అసెంబ్లీ, కైరానా లోక్‌సభకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు తేల్చి చెప్పాయి. అందుకనే బీజీపీ ఇలా విభజన రాజకీయాలను ఆశ్రయించింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top