224 స్థానాలు.. 225 మేనిఫెస్టోలు

BJP to Release 225 Manifestoes for Karnataka - Sakshi

సాక్షి, బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ, బీజేపీ, జేడీఎస్‌ పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఇప్పటికే ప్రచారాలతో హోరెత్తిస్తున్న పార్టీలు.. నామినేషన్ల ప్రక్రియ పూర్తైన నేపథ్యంలో మేనిఫెస్టోలు ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి. ఓటర్ల నాడి తెలుసుకునేందుకు అనుభవఙ్ఞులైన నాయకులను రంగంలోకి దింపడం ద్వారా విజయానికి బాటలు వేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి.

బీజేపీ.. 224 నియోజక వర్గాలు.. 225 మేనిఫెస్టోలు
ఈ ఎన్నికల్లో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని భావిస్తున్న బీజేపీ.. అదే స్థాయిలో ప్రయత్నాలు కొనసాగిస్తోంది. రాష్ట్రమంతటికీ ఒకటి, ఒక్కో నియోజక వర్గానికి ఒకటి చొప్పున మేనిఫెస్టోలు రూపొందించనున్నట్లు పార్టీ అధికార ప్రతినిధి వామన్‌ ఆచార్య తెలిపారు. ఇందుకోసం 500 మంది నిపుణుల అభిప్రాయం స్వీకరించినట్లు సమాచారం. సుమారు 3 లక్షల మందిపై ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌లో సర్వే నిర్వహించామని పార్టీ నేత డాక్టర్‌ అశ్వథ్‌నారాయణ్‌ తెలిపారు. జిల్లా స్థాయి నాయకులు తమ తమ నియోజక వర్గానికి సంబంధించిన మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత రాష్ట్రస్థాయి మేనిఫెస్టోను విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు.

మంగళూరులో రాహుల్‌ గాంధీ..
మంగళూరులో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మేనిఫెస్టోను ప్రకటించనున్నారు. బీజేపీ ప్రధాన ఓటు బ్యాంకుగా భావిస్తున్నమంగళూరులో ఎటువంటి హామీలతో రాహుల్‌ ఓటర్లను ఆకర్షిస్తారో చూడాల్సిందే. శ్యామ్‌ పిట్రోడా, పృథ్వీరాజ్‌ చౌహాన్‌, మల్లికార్జున ఖర్గేల నేతృత్వంలో కాంగ్రెస్‌ మేనిఫెస్టోను రూపొందిస్తున్నారు. ఈ నెల 28 తర్వాత రాష్ట్రమంతటికీ కలిపి ఒకటి, బెంగళూరు, బెలగామ్‌, గుల్బర్గా, మైసూర్‌ ప్రాంతాలకు ఒకటి చొప్పున మేనిఫెస్టోలు విడుదల చేయనున్నారు.

2013 ఎన్నికల్లో చేసిన 165 వాగ్దానాలే తమ విజయానికి కారణమని భావిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ.. ఈసారి కూడా అదే పంథాను అనుసరించేందుకు సిద్ధమైంది. బెంగళూరు సిటీ కోసం ప్రత్యేకంగా సీనియర్‌ నేత వీరప్ప మొయిలీ నాయకత్వంలో మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు చేసింది. అభివృద్ధి, సామాజిక న్యాయం, వ్యవసాయ రంగంలో మార్పులు ప్రధాన అంశాలుగా మేనిఫెస్టో రూపొందిస్తున్నామని మొయిలీ తెలిపారు.

రిటైర్డ్‌ ఐఏఎస్‌ ఆధ్వర్యంలో జేడీఎస్‌..
జేడీఎస్‌ కూడా వారం రోజుల్లోగా తమ ప్రణాళికను ప్రకటించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ సుబ్రహ్మణ్య నేతృత్వంలో రూపొందనున్న మేనిఫెస్టోలో.. వ్యవసాయం, పరిశ్రమలు, నీటి వనరులు, మౌలిక సదుపాయాలకు సంబంధించిన అంశాలపై దృష్టి సారించనున్నట్లు సమాచారం.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top