టీడీపీ నేతలు దొంగల్లా తప్పించుకుంటున్నారు

BJP MP gvl narasimha rao commented over tdp - Sakshi

పీడీ ఖాతాల కుంభకోణంలో ప్రభుత్వ పెద్దల తీరుపై బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్‌ ఆగ్రహం

అక్రమాలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి

2జీ స్కామ్, లాలూ స్కామ్‌ నిందితులూ ఇలాగే బుకాయించారు

వెధవ కౌంటర్లు ప్రజలకు అవసరం లేదు.. వివరాలు బయటపెట్టండి

పీడీ ఖాతాల కుంభకోణంపై చంద్రబాబు, లోకేశ్‌ సమాధానం ఇవ్వాలి

రూ.53,000 కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో చెప్పాలి

సాక్షి, అమరావతి: ‘‘తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అతిపెద్ద కుంభకోణం జరిగిందని చెబితే.. ఆ అవినీతిని బయటపెట్టిన వారిపై విమర్శలు చేసి తప్పించుకోవాలని చూస్తున్నారు. అవినీతిలో అడ్డంగా దొరికినప్పుడు లాలూ ప్రసాద్‌యాదవ్‌ మొదట్లో బుకాయించిన తరహాలోనే ఇప్పుడు టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. ఇంత పెద్ద అవినీతిని మీడియాలో రాకుండా చేసి విజయం సాధించవచ్చని అనుకుంటున్నారు. 2జీ స్కామ్, లాలూ స్కామ్‌ జరిగినప్పుడు నిందితులు ఇలాగే బుకాయించారు. అవినీతిలో కూరుకుపోయినా తమను ఎవరేం చేయగలరులే అనుకున్నారు.

అలా అనుకున్న వారు చాలామంది చరిత్రలో అక్రమార్కులుగా మిగిలిపోయారు’’ అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు చెప్పారు. ఆయన ఆదివారం విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రూ.53,000 కోట్లకు పైగా ప్రభుత్వ సొమ్మును పర్సనల్‌ డిపాజిట్‌(పీడీ) ఖాతాల్లో జమ చేసి, ఖర్చు పెట్టిన వ్యవహారంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. ఇది కచ్చితంగా అతిపెద్ద అవినీతి కుంభకోణమని పునరుద్ఘాటించారు. పీడీ ఖాతాల కుంభకోణంపై సమాధానం చెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వం మొదట్నుంచీ ఇష్టపడడం లేదని, భయపడుతోందని జీవీఎల్‌ దుయ్యబట్టారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే...

‘‘రాష్ట్ర ప్రభుత్వంపై ‘కాగ్‌’ తీవ్ర ఆరోపణలు చేసింది. మీకు(ప్రభుత్వ పెద్దలకు) ఏమాత్రం సిగ్గు, శరం లేదా? లాలూ ప్రసాద్‌యాదవ్‌ కంటే దిగజారిన పరిస్థితిలో మీరు కనిపిస్తున్నారు. రూ.53,000 కోట్లు అవినీతి గురించి చెబితే తెలంగాణలో కూడా ఉన్నాయంటున్నారు. తెలంగాణలో రూ.8,545 కోట్ల నిధులను ఇలాంటి ఖాతాల్లో వేశారు. వాటికి ఆ ప్రభుత్వం జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. వారు ‘కాగ్‌’కు వివరణ ఇచ్చుకున్నారు. ఏపీలో రూ.53,000 కోట్ల గురించి సమాధానం అడిగితే ప్రభుత్వ పెద్దలు గుమ్మడికాయ దొంగల్లా తప్పించుకుంటున్నారు. మీ వెధవ కౌంటర్లు ప్రజలకు అక్కర్లేదు. ప్రజలకు కావాల్సింది నిధుల ఖర్చుకు వివరాలు మాత్రమే.

‘చౌదరి’ కాపాడుతారని అనుకుంటున్నారేమో!
పీడీ ఖాతాల్లో ప్రభుత్వ డబ్బులే జమ చేస్తారు. ఈ ఖాతాల ద్వారా ఖర్చుల్లో అక్రమాలు జరిగినా పట్టుబడే అవకాశం తక్కువ. అలా పట్టుబడకూడదనే ఆంధ్రప్రదేశ్‌లో పీడీ ఖాతాలను పెద్ద సంఖ్యలో తెరిచారు. ఇతర రాష్ట్రాల్లో కేవలం వందల సంఖ్యలో పీడీ ఖాతాలు ఉంటే, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం 58,539 పీడీ ఖాతాలు తెరిచారు. షేర్‌ మార్కెట్‌ కుంభకోణం లాగా ప్రభుత్వ డబ్బులను ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు, దాంట్లో నుంచి ఇంకొక ఖాతాలో వేసి వివరాలు చెప్పకుండా తప్పించుకుందాం అనుకుంటున్నారు.

ప్రజల డబ్బుల ఖర్చుకు వివరాలు చెప్పమంటే నాపై విమర్శలు చేసి, కావాల్సిన పత్రికల్లో తాటికాయంత ఆక్షరాలతో రాయించుకుంటే సరిపోదు. మీ నిజ స్వరూపాన్ని ‘కాగ్‌’ రిపోర్టు బయటపెట్టింది. కావాలంటే ఎవరికైనా ఫిర్యాదు చేసుకోండి అంటున్నారు. ఎవరో చౌదరి కాపాడుతారని అనుకుంటున్నారేమో! ఈ విషయాలు ఇంతటితో ఆగవు. ఈ నిధులపై జవాబు ప్రభుత్వం చెప్పేవరకూ దీని గురించి ప్రజాకోర్టులో ప్రస్తావిస్తూనే ఉంటాం. ప్రజలకు సంబంధించిన ప్రతి రూపాయి ఖర్చుకు ప్రభుత్వం జవాబు చెప్పాల్సిందే. వెధవ కామెంట్లు చేసి తప్పించుకోలేరు. టీడీపీ ప్రభుత్వం సాగించిన అవినీతి వ్యవహారాలు బయటకు రాకుండా ఎక్కువ కాలం దాచలేరు.

సద్వినియోగమైతే వివరాలు ఇవ్వరేం?
మన రాష్ట్రంలో రూ.వేల కోట్ల నిధులను దారి మళ్లించడానికి, దొంగలించడానికి, అవినీతి చేయడానికి భారీ సంఖ్యలో పీడీ ఖాతాలను తెరిచారు. మిగతా రాష్ట్రాల్లో కేవలం రూ.వంద కోట్లు మాత్రమే ఇలాంటి ఖాతాల్లో ఉంటే, మన రాష్ట్రంలో రూ.వేల కోట్లు ఉన్నాయి. 2జీ స్కామ్, బొగ్గు స్కామ్, కామన్‌వెల్త్‌ స్కామ్‌ను బయటపెట్టినట్లుగానే ‘కాగ్‌’ టీడీపీ ప్రభుత్వ పీడీ ఖాతాల కుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చింది. ‘కాగ్‌’ నివేదికలోని అంశాలనే మేము ప్రస్తావిస్తున్నాం. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మాట్లాడినవారు అవినీతి దొంగల్లా మాట్లాడుతున్నారు తప్ప మేము అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పడం లేదు.

అవినీతి బయటపడిందని నిరాశ చెంది నాపై వ్యక్తిగత ఆరోపణలు చేశారు. పీడీ ఖాతాల కుంభకోణంపై సీఎం చంద్రబాబు జవాబు చెప్పాలి. లేదంటే ప్రతి దానికీ మా నాన్న గ్రేట్, నేను గ్రేట్‌ అని కితాబులిచ్చుకునే నారా లోకేశ్‌ అయినా జవాబు చెప్పాలి. రూ.53,000 కోట్లు ఎవరు తిన్నారు? ఎవరెవరు పంచుకున్నారు? సమాధానం ఇవ్వాలి. వాటిలో కొంతవరకైనా సద్వినియోగమై ఉంటే వాటి వివరాలెందుకు ఇవ్వట్లేదు? దీనిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. టీడీపీ ప్రభుత్వం లాలూప్రసాద్‌ యాదవ్‌ ముద్రనే కొనసాగించాలనుకుంటే అది వారి ఇష్టం’’ అని జీవీఎల్‌ తేల్చిచెప్పారు.

ప్రభుత్వానికి ఏడు ప్రశ్నలు
పీడీ ఖాతాల అవినీతి కుంభకోణానికి సంబంధించి ‘కాగ్‌’ తన నివేదికలో పేర్కొన్న అంశాలనే ఏడు ప్రశ్నలుగా టీడీపీ ప్రభుత్వం ముందుంచుతున్నానని, వాటికి జవాబు చెప్పాలని జీవీఎల్‌ డిమాండ్‌ చేశారు.
దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో 58,000కుపైగా పీడీ ఖాతాలను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తెరవాల్సి వచ్చింది?
ఇవి కేవలం తాత్కాలిక అవసరాలకు వాడుకునే ఖాతాలయితే, అన్ని ఖాతాలు తెరవాల్సిన అవసరం ఏమిటి? వీటిద్వారా రూ.వేల కోట్లు నిధులు మళ్లించారని స్పష్టంగా అర్థమవడం లేదా?
పీడీ ఖాతాల ద్వారా ఖర్చు పెట్టిన డబ్బుల వివరాలను ప్రభుత్వం ప్రజాక్షేత్రంలో పెట్టాలి. ఆ వివరాలను ‘కాగ్‌’ అడిగినా ప్రభుత్వం ఇవ్వలేదు. ఆ వివరాలన్నీ బయటకు వస్తేనే దీంట్లో ఎవరు ఎంత నొక్కారో స్పష్టంగా ప్రజలకు తెలిసిపోతుంది.
నిబంధనల ప్రకారం ఆర్థిక సంవత్సరం ఆఖరి నాటికి పీడీ ఖాతాల్లో ఎంత డబ్బు ఉన్నా ఆ మొత్తాలను ప్రభుత్వ కన్సాలిడేటెడ్‌ ఫండ్‌కు జమ చేయాలి. కొత్త ఆర్థిక సంవత్సరం ఆరంభానికి ఆ ఖాతాల్లో జీరో బ్యాలెన్స్‌ ఉండాలి. అయినా దాదాపు రూ.25,000 కోట్లు పీడీ ఖాతాల్లో  ఉంచారు.  
పీడీ ఖాతాల్లో భారీఎత్తున నిధులను వృథాగా ఉంచుకొని, 6.5 వడ్డీకి ప్రభుత్వం కొత్త అప్పులు చేసిందని ‘కాగ్‌’ ప్రస్తావించింది. అంటే ప్రభుత్వం వద్ద సొంత డబ్బులు ఉండి కూడా రూ.1,500 కోట్ల వడ్డీలు చెల్లిస్తోంది. డబ్బులు ఉంచుకొని, అప్పులు తెచ్చుకొని దాదాపు రూ.1,500 కోట్లు ప్రజాధనాన్ని వడ్డీగా చెల్లిస్తున్నారు. పీడీ ఖాతాల కుంభకోణంలో ‘రుణాలపై వడ్డీ’ స్కామ్‌ కూడా కలిసి ఉంది. ఇది రెండు కుంభకోణాలు కలిసిన ఉన్న అంశం.
పీడీ ఖాతాల ద్వారా ఏడాదిలో ఖర్చు పెట్టిన రూ.51,000 కోట్లు ఎవరికి చేరాయి? ఎవరి ఖాతాలకు మళ్లించారు? వివరాలను ‘కాగ్‌’కు కూడా ఎందుకు ఇవ్వలేదు?  
పీడీ ఖాతాల ద్వారా అధికారులు సెల్ఫ్‌ చెక్‌ ద్వారా డబ్బులు వాడకూడదు. సెల్ఫ్‌ చెక్‌ల ద్వారా రూ.వందల కోట్లు డ్రా చేశారని ‘కాగ్‌’ తన నివేదికలో పేర్కొంది. దొంగలు ఎవరెవరు? ఎవరెంత పంచుకున్నారు? అన్నింటికీ ప్రభుత్వం వివరణ ఇవ్వాలి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top