‘పేదల రక్తానికి మరిగిన పులి చంద్రబాబు’

BJP MLC Somu Veerraju Fires On CM Chandrababu Naidu - Sakshi

చంద్రబాబుపై సోమువీర్రాజు ధ్వజం

నాయీ బ్రాహ్మణులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌

సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సచివాలయంలో నాయీ బ్రాహ్మణుల పట్ల సీఎం వీధిరౌడీలా ప్రవర్తించారని విమర్శించారు. చంద్రబాబు వ్యాఖ్యలను బీజేపీ త్రీవంగా ఖండిస్తుందని తెలిపారు. నాయీ బ్రాహ్మణులకు చంద్రబాబు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. అధికారం తమ చేతిలో ఉందన్న గర్వంతో నడిరోడ్డుపై నిమ్నవర్గాలపై అడ్డగోలుగా నోరు పారేసుకున్నారని, పేదవాడి రక్తానికి మరిగిన పులి చంద్రబాబు నాయుడు అని ధ్వజమెత్తారు.

విశాఖలో మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. నాయీబ్రాహ్మణుల పట్ల సీఎం ప్రవర్తించిన తీరుకు రాజకీయ నాయకులు సిగ్గుతో తలదించుకుంటున్నారని అన్నారు. క్షురకుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అధర్మంగా లక్షల కోట్ల అవినీతి చేస్తూ.. ధర్మ పోరాటాలు చేస్తున్నారని విమర్శించారు. బరితెగించి ఇసుక అమ్ముతున్నారని, దొంగల ప్రభుత్వం ఇదని ఆరోపించారు.

మోదీ లేకపోతే చంద్రబాబు జీరో
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లేకపోతే ఏపీలో చంద్రబాబు నాయుడు జీరో అని సోము వీర్రాజు ఎద్దేవా చేశారు. ఏపీకి కేంద్రం చాలా సాయం చేసిందని పేర్కొన్నారు. ఈ విషయంలో చంద్రబాబుతో బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్‌ చేశారు. విధానపరమైన నిర్ణయాల వల్లే కశ్మీర్‌లో పీడీపీ ప్రభుత్వం నుంచి బీజేపీ బయటకు వచ్చిందన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నుంచి టీడీపీయే బయటకు వచ్చిందని గుర్తుచేశారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన 600 హామీలపై మండల స్థాయిలో ఉద్యమిస్తామని పేర్కొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top