తాడిపత్రిలో ఆటవిక రాజ్యం | Bjp Leader Fires On TDP Party | Sakshi
Sakshi News home page

తాడిపత్రిలో ఆటవిక రాజ్యం

Mar 22 2018 9:40 AM | Updated on Aug 10 2018 8:42 PM

Bjp Leader Fires On TDP Party - Sakshi

ర్యాలీగా వెళుతున్న బీజేపీ, వీహెచ్‌పీ నేతలు

తాడిపత్రి: తాడిపత్రిలో ఆటవిక రాజ్యం కొనసాగుతోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు అంకాల్‌రెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం సాయంత్రం టీడీపీ కార్యకర్తలు బీజేపీ వారిపై చేసిన దాడికి నిరసనగా బీజేపీ, వీహెచ్‌పీ నేతలు బుధవారం స్థానిక వైఎస్సార్‌ సర్కిల్‌ నుంచి పోలీస్‌స్టేషన్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. అయితే ఈ ర్యాలీ పోలీసు స్టేషన్‌ చేరుకోగానే పోలీసులు స్టేషన్‌ గేట్లు మూసివేశారు. దీంతో బీజేపీ, వీహెచ్‌పీ నేతలు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే ఎస్‌ఐ రాఘవరెడ్డి జోక్యం చేసుకుని బీజేపీ జిల్లా అధ్యక్షుడు అంకాల్‌రెడ్డి, శింగరి లక్ష్మీనారాయణ, వీహెచ్‌పీ నాయకులు రాధాకృష్ణ మరి కొంతమందిని పోలీస్‌స్టేషన్‌లోకి అనుమతించారు. ఈ సందర్భంగా అంకాల్‌రెడ్డి పట్టణ సీఐ సురేందర్‌రెడ్డితో మాట్లాడారు.

తమపై దాడి జరిగిందని ఫిర్యాదు చేయడానికి వచ్చిన బీజేపీ కార్యకర్తలపైనే కేసులు బనాయించడం అన్యాయమన్నారు. తాడిపత్రిలో ప్రజాస్వామ్యం ఉందా..?లేదా అని ప్రశ్నించారు. అయితే అందుకు సమాధానం చెప్పని సీఐ సురేందర్‌రెడ్డి... 30 యాక్ట్‌ అమల్లో ఉన్నందున పోలీసుస్టేషన్‌ ఎదుట ధర్నా చేయడానికి వీల్లేదన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా కేసులు నమోదు చేస్తామన్నారు. అయితే గతంలో పోలీస్‌ స్టేషన్‌లోకి చొచ్చుకుని వచ్చి పోలీసులపైనే దుర్భాషలాడిన అధికార పార్టీ నేతలపై ఎందుకు కేసులు నమోదు చేయలేదని అంకాల్‌రెడ్డి ప్రశ్నించారు. అధికార పార్టీకి నిబంధనలు వర్తించవా..? అని ప్రశ్నించారు. అనంతరం విలేకరులతో మాట్లాడిన అంకాల్‌రెడ్డి పోలీసుల తీరును నిరసించారు. స్థానిక పోలీసులందరూ ఎమ్మెల్యే కనుసన్నల్లోనే నడుస్తున్నారనీ, అందువల్లే బాధితులైన బీజేపీ నేతలపై కేసులు నమోదు చేశారని ఆరోపించారు. తాడిపత్రి పోలీసులపై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. తాడిపత్రి పోలీసుల తీరుపై డీజీపీకి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement