‘ఆయన లేకపోతే బాబు ఎన్నికలకు వెళ్లరా?’​

BJP Leader Fires On AP Planning Board Vice Chairman Kutumba Rao - Sakshi

సాక్షి, విజయవాడ : కుటుంబరావు ఒక బ్రోకర్‌.. ఆయన నోటీసులకు భయపడమంటూ ఆర్టీఐ మాజీ కమిషనర్‌, బీజేపీ నేత విజయ్‌ బాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గురువారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ ఎంపీల మీద బెట్టింగ్‌ కాయడానికి కుటుంబ రావుకి రూ.1.30 కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ప్రజల సొమ్ము తింటూ టీడీపీ తరఫున మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు. కుటుంబరావు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవికి అపఖ్యాతి తెచ్చారని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా బెట్టింగ్‌ గురించి మాట్లాడటం కోడ్‌ ఉల్లంఘన కిందకే వస్తుందని.. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఆర్థిక నేరాలు చేసిన కుటుంబ రావుకు బీజేపీ నాయకుల గురించి మాట్లాడే అర్హత లేదని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలపై కుటుంబ రావు వెంటనే క్షమాపణలు చెప్పాలని లేదంటే పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు.

మరో బీజేపీ నాయకుడు శ్రీనివాస్‌ రాజు మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌, కేఏ పాల్‌ కుమ్మక్కయ్యి ఈ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టారని ఆరోపించారు. పాల్‌కు చంద్రబాబు డబ్బులిచ్చి మరి వైసీపీ అభ్యర్థుల పేర్లను పోలిన అభ్యర్థులను నిలబెట్టారని పేర్కొన్నారు. చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. గతంలో చంద్రబాబు కోరిక మేరకు ఎన్నికల కమిషన్‌ ఎస్‌ ఎస్‌ సీ యాదవ్‌ను మార్చారని గుర్తు చేశారు. ఏబీ వెంకటేశ్వర రావు మీద చంద్రబాబుకు ఎందుకంత ప్రేమని ప్రశ్నించారు. ఆయన లేక పోతే చంద్రబాబు ఎన్నికలకు వెళ్లలేరా ఏంటి అంటూ ఎద్దేవా చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top