అజిత్‌కు షాకిచ్చిన అమిత్‌ షా!

BJP Chief Amit Shah Comments on Ajit Pawar - Sakshi

న్యూఢిల్లీ: ఎన్సీపీలో తిరుగుబాటు తెచ్చి బీజేపీతో జట్టుకట్టి.. ఆదరాబాదరాగా ఉప ముఖ్యమంత్రిగా అజిత్‌ పవార్‌ పదవీ స్వీకార ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. అజిత్‌ పవార్‌పై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఈడీ కేసులు కూడా నమోదయ్యాయి. నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 70 వేల కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం చేసినట్టు ఆయన ఆరోపణలెదుర్కొంటున్నారు. ఈ కేసులను సాకుగా చూపి బీజేపీ అజిత్‌ను తమవైపు తిప్పుకున్నట్టు కథనాలు వచ్చాయి. అజిత్‌తో కలిసి దేవేంద్ర ఫడ్నవిస్‌ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాక.. ఈ కేసుల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రూ. 70వేల కోట్ల ఇరిగేషన్ స్కామ్‌ కేసులో అజిత్‌ పవార్‌కు ఏసీబీ క్లీన్ చిట్ ఇచ్చినట్టు కథనాలు వచ్చాయి. బీజేపీకి మద్దతునిచ్చినందుకు ప్రతిఫలంగా ఆయనను కేసుల నుంచి విముక్తి కల్పించినట్టు ఆరోపణలు కూడా గుప్పుమన్నాయి. అజిత్‌పై ఏసీబీ కేసుల ఎత్తివేత మీద శివసేన సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది.
చదవండి: శరద్‌ పవార్‌ క్షమించేశారు!!

అయితే, శరద్‌ పవార్‌ చాణక్యం ముందు ఫడ్నవిస్‌ ప్రభుత్వం నిలదొక్కుకోలేకపోయిన విషయం తెలిసిందే. ఎన్సీపీ ఎమ్మెల్యేల మద్దతు లేకపోవడం, పవార్‌ కుటుంబసభ్యులు సయోధ్య కుదర్చడానికి ప్రయత్నాలు చేయడంతో అజిత్‌ ఎట్టకేలకు దిగివచ్చి.. డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేశారు. బీజేపీ ప్రభుత్వం పడిపోయింది. తిరిగి ఆయన ఎన్సీపీ గూటికి చేరుకున్నారు. పార్టీలోనే కొనసాగుతున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కీలక ప్రకటన చేశారు. అవినీతి కేసుల విషయంలో అజిత్‌కు క్లీన్‌చిట్‌ ఇవ్వలేదంటూ షాక్ ఇచ్చారు. అజిత్‌పై కేసులు ఎత్తివేయలేదని ఆయన స్పష్టం చేశారు. అజిత్‌ పవార్‌ వెంట బీజేపీ నడవదని, బీజేపీ వెంటే అజిత్‌ వస్తారని అమిత్‌ షా జోస్యం చెప్పారు.
చదవండి: అజిత్‌కు ఆత్మీయ స్వాగతం పలికిన సుప్రియా

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top