టెస్టింగ్‌ టైమ్‌: బీజేపీ ఎంపీల పనితీరు మదింపు

BJP begins independent audit of MPs performance - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: 2019 సార్వత్రిక ఎన్నికలపై దృష్టిసారించిన బీజేపీ ఆ దిశగా కసరత్తు చేపట్టింది. పార్టీ ఎంపీల పనితీరును 16 అంశాల ప్రామాణికంగా మదింపు చేసేందుకు సంసిద్ధమైంది. ఈ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటేనే ఎంపీలకు పార్టీ టికెట్‌ దక్కుతుంది. రానున్న ఎన్నికల్లో ఎంపీ టికెట్‌ పొందాలంటే సీనియారిటీ, ప్రతిష్టలను పక్కన పెట్టి ఎంపీలంతా హైకమాండ్‌ మదింపులో నెగ్గుకురావాల్సిందే. పార్టీకి చెందిన 282 మంది ఎంపీల పనితీరుపై స్వతంత్ర ఆడిట్‌కు తొలిసారిగా బీజేపీ సన్నద్ధమైంది.

పార్టీ ఎంపీల పనితీరును మదింపు చేసే బాధ్యతను ఓ ఏజెన్సీకి కట్టబెట్టారు. దేశరాజధానిలోని ఏడు బీజేపీ ఎంపీల పనితీరును విశ్లేషిస్తూ ఈ ఏజెన్సీ తన కార్యకలాపాలకు శ్రీకారం చుట్టింది. ఎంపీల పనితీరుపై నివేదికలను బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా, ప్రధాని నరేంద్ర మోదీ సమీక్షిస్తారు. ఢిల్లీ ఎంపీలపై విశ్లేషణ నివేదిక త్వరలో అందనుండటంతో తదుపరి ఇతర రాష్ట్రాల ఎంపీల పైనా ఈ కసరత్తు చేపడతారు. మొత్తం ప్రక్రియ 2018, డిసెంబర్‌ నాటికి పూర్తవుతుంది. పార్లమెంట్‌కు ఎంపీల హాజరు, తమ నియోజకవర్గాల పర్యటనలు వంటి పలు అంశాల ఆధారంగా ఎంపీల పనితీరును మదింపు చేస్తారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

తమ ప్రాంతంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ఎంపీ పనితీరు, వ్యక్తిగత ప్రతిష్ట ఆధారంగా సిట్టింగ్‌ ఎంపీల విజయావకాశాలనూ ఈ ఆడిట్‌ బేరీజు వేస్తుందని వెల్లడించాయి. ప్రజల్లో సిట్టింగ్‌ ఎంపీకి ఇప్పటికీ ఆదరణ ఉన్నదా అనేది నిగ్గుతేల్చాలన్నది ఏజెన్సీకి ముఖ్యమైన బాధ్యతగా అప్పగించినట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top