‘తిట్టిన వాళ్లే కేసీఆర్‌ క్యాబినేట్‌లో ఉన్నారు’

Bhupathi Reddy Slams TRS In Delhi - Sakshi

సాక్షి, ఢిల్లీ: టీఆర్‌ఎస్‌ పార్టీలో ఉద్యమకారులకు అవమానాలు, అన్యాయాలు జరుగుతున్నాయని టీఆర్‌ఎస్‌ అసమ్మతి ఎమ్మెల్సీ భూపతి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ ద్రోహులకు టీఆర్‌ఎస్‌ పార్టీలో పెద్దపీట వేస్తున్నారని విమర్శించారు. అందుకే టీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీలోకి మారుతున్నానని వెల్లడించారు. పదవులు తనకు ముఖ్యం కాదన్నారు. అనర్హత వేటు వేసినా తాను సిద్ధంగానే ఉన్నానని తెలిపారు. 14 సంవత్సరాల నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీని నిర్మించామని, కానీ పార్టీని వీడిపోవాల్సి వస్తోందని అన్నారు.

నాలుగున్నర సంవత్సరాల నుంచి అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడంలో పూర్తిగా కేసీఆర్‌ విఫలమయ్యారని వ్యాఖ్యానించారు. నీళ్లు, నియామకాలు, నిధులు అంశాల్లో ఇంకా న్యాయం జరగలేదని అన్నారు. రైతు బంధు పథకం వల్ల అసలైన రైతులకు న్యాయం జరగలేదని, కౌలు రైతులకు ఎటువంటి ప్రయోజనం దక్కలేదని చెప్పారు. సరైన గిట్టుబాటు ధర ఇచ్చి ఉంటే బాగుండేదని, కానీ కేసీఆర్‌ అలా చేయలేదని చెప్పారు. ధనిక తెలంగాణను అప్పుల తెలంగాణాగా మార్చివేశారని విమర్శించారు. ప్రస్తుతం కేసీఆర్‌ చుట్టూ తెలంగాణ ద్రోహులే ఉన్నారని ధ్వజమెత్తారు.

ఎస్టీలకు 9 శాతం రిజర్వేషన్‌, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్‌ ఇస్తానని చెప్పి మాట తప్పారని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో 1200 మంది ప్రాణత్యాగం చేస్తే 400 మందిని కూడా ఆదుకోలేదని విమర్శించారు. కేసీఆర్‌ను తిట్టిన వాళ్లే కేసీఆర్‌ క్యాబినేట్‌లో ఉన్నారని, నిజాయతీగా ఉండి పార్టీకి సేవ చేసిన వాళ్లను బయటికి పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా టీఆర్‌ఎస్‌ పార్టీ పనిచేయడం లేదని విమర్శించారు. కాంగ్రెస్‌ బడుగు బలహీనవర్గాలకు చెందిన పార్టీ, ఇవ్వన్నీ కాంగ్రెస్‌ పార్టీతో సాధ్యమౌతుందన్న నమ్మకం ఉందన్నారు. నిజామాబాద్‌ రూరల్‌ అసెంబ్లీ నుంచి పోటీ చేయాలన్న కోరికని ఆయన వెల్లడించారు.

బంగారు కుటుంబమే బంగారు తెలంగాణ కాలే: విద్యాసాగర్‌
ప్రత్యేక రాష్ట్రం సాధించడంలో తాము భాగస్వాములు అయ్యామని, కానీ ఆశించిన రీతిలో టీఆర్‌ఎస్‌ పనిచేయడం లేదని ప్రొఫెసర్‌ విద్యాసాగర్‌ విమర్శించారు. కేసీఆర్‌ కుటుంబం బంగారు కుటుంబం అయింది కానీ బంగారు తెలంగాణ కాలేదని ఎద్దేవా చేశారు. ఉద్యమకారులను టీఆర్‌ఎస్‌ పట్టించుకోవడంలేదని, అసమర్థులకు టిక్కెట్లు కేటాయించడం వల్లే పార్టీని వీడాల్సి వచ్చిందని తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top