మమ్మల్ని వేలెత్తి చూపితే ఊరుకోం: భూమా మౌనిక రెడ్డి

BHuma Mounika Reddy Responds On AV Subbareddy Comments - Sakshi

ఏవీ సుబ్బారెడ్డి కుటుంబంతో మా బంధం అప్పుడే తెగిపోయింది..

నాన్న చనిపోయిన రెండోరోజు నుంచే ఏవీ సుబ్బారెడ్డి పద్ధతిలో మార్పు

సాక్షి, అమరావతి : టీడీపీ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డిపై పర్యాటక శాఖమంత్రి భూమా అఖిలప్రియ సోదరి మౌనికరెడ్డి నిప్పులు చెరిగారు.  ఆళ్లగడ్డ రాళ్ల పంచాయితీ  వ్యవహారానికి సంబంధించి మంత్రి అఖిలప్రియ గురువారం తన కుటుంబసభ్యులతో కలిసి అమరావతి చేరుకున్నారు. ఈ సందర్భంగా మౌనికా రెడ్డి మాట్లాడుతూ...‘ ఈ పంచాయితీ తేల్చాలని అధిష్టానాన్నే అడుగుతాం. మా అక్క మంత్రిగా ఉన్న నియోజకవర్గంలో ఏవీ సుబ్బారెడ్డి సైకిల్‌ యాత్ర చేయడం ఎంతవరకూ సబబు.

గుంటనక్క అని ఏవీ సుబ్బారెడ్డిని మా అక‍్క ఏనాడు అనలేదు. అఖిలప్రియ ధర్నా చేసినప్పుడు ఏవీ వర్గీయులు వచ్చి ఈలలు వేస్తూ వెటకారంగా కామెంట్లు చేశారు. అందుకే రాళ్ల దాడి జరిగి ఉండవచ్చు. అక్క వెంట భూమా, ఎస్వీ కుటుంబాలు అండగా ఉన్నాయి. మమ్మల్ని వ్యక్తిగతంగా టార్గెట్‌ చేసి విమర్శిస్తే, ఆళ్లగడ్డ ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఆళ్లగడ్డ, నంద్యాల ప్రజలు తప్పకుండా బుద్ధి చెబుతారు. నాన్న చనిపోయిన రెండోరోజు నుంచే ఏవీ సుబ్బారెడ్డి పద్ధతిలో మార్పు వచ్చింది. రాజకీయంగా ఎదగడం కోసం సుబ్బారెడ్డి మా అక్కపై విమర్శలు చేస్తున్నారు. భూమా కుటుంబంతో సంబంధాలు తెగిపోయాయని ఏవీ సుబ్బారెడ్డి చెప్పారు.

సుబ్బారెడ్డి కూతుళ్లు నాన్న సమాధి వద్దకు రానప్పుడే మా మధ్య బంధం తెగిపోయింది. నాన్న వాళ్ల పిల్లలను ఎలా చూసుకున్నారో అందరికీ తెలుసు. నాన్న చనిపోయాక మా కుటుంబం ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఎంతోమంది విమర్శలు చేసినా సహనంతో ఉన్నాం. ఏవీ సుబ్బారెడ్డి వైఖరిని అంతా చూశారు. ఆయనను మామా అనే హక్కు ఉందో లేదో. అఖిలప్రియ ముందు భూమా అఖిలప్రియ అనే విషయం మరిచారు. రాజకీయంగా ఎదగాలనుకుంటే మా సహకారం ఉంటుంది.

కానీ తన రాజకీయ ఎదుగుదలకు మాపై వేలెత్తి చూపితే చూస్తూ ఊరుకోం. పబ్లిక్‌లో మా కుటుంబంపై వేలెత్తి చూపిస్తే సహించేది లేదు. సుబ్బారెడ్డి కూతురు మాపై విమర్శలు చేసినా మాతో కలిసి పెరిగారని ఓపికతో ఉన్నాం. ఇంకా విమర్శలు చేస్తూ ఆళ్లగడ్డ ప్రజలు సహించరు. అఖిలను తాకాలంటే భూమా కేడర్‌ ఉందనే విషయాన్ని ఏవీ సుబ్బారెడ్డి గుర్తుంచుకోవాలి. ముఖ్యమంత్రిపై మాకు నమ్మకం ఉంది. భూమా కుటుంబానికి అండగా ఉంటామని సీఎం భరోసా ఇచ్చారు. ఇక రాళ్లదాడి మా అనుచరులే చేశారా? లేదా అనేది విచారణలో తేలుతుంది.’ అని అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top