‘సోషల్‌ ఇంజనీరింగ్‌’ జరగాల్సిందే!

BC Leader R Krishnaiah Interview With Sakshi

చట్టసభల్లో అగ్రకులాలదే ఆధిపత్యం

రాజ్యాధికారం దక్కితేనే బీసీల్లో ఆత్మవిశ్వాసం, అభివృద్ధి.. 

ఇక్కడ పొత్తులే.. ఏపీలో పార్టీ పెట్టడం ఖాయం

‘సాక్షి’ ఇంటర్వ్యూలో ఆర్‌. కృష్ణయ్య  

సాక్షి, హైదరాబాద్‌ : దేశవ్యాప్తంగా రాజకీయాల్లో సోషల్‌ ఇంజనీరింగ్‌ జరగాల్సిన సమయం ఆసన్నమైందని బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు ఆర్‌. కృష్ణయ్య అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో గెలిచేందుకు డబ్బు ఒక్కటే ప్రాతిపదిక కాకుండా.. కుల బలం, జన బలం కూడా ముఖ్యమనే కీలకాంశాన్ని రాజకీయ పార్టీలు గుర్తించాలని ఆయన పేర్కొన్నారు. సోషల్‌ ఇంజనీరింగ్‌తోనే బీసీలు ఎదుర్కొంటున్న వివక్షను రూపుమాపవచ్చన్నారు. రాజ్యాధికారంలో భాగస్వామ్యం దక్కినపుడే.. బీసీలు అభివృద్ధిలో భాగస్వాములవుతారన్నారు. అప్పుడే వీరిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. ఈ విషయాన్ని బీసీలు కూడా అర్థం చేసుకోవాలని కృష్ణయ్య కోరారు. టీఆర్‌ఎస్‌ టికెట్ల కేటాయింపులో బీసీలకు అన్యాయం జరిగిందని, కాంగ్రెస్, బీజేపీలు కూడా తమ విధానాల్లో మార్పు చేసుకోవాలని ఆయన సూచించారు. తాను ఎల్బీనగర్‌ నుంచే పోటీచేయాలా.. అసెంబ్లీ బరిలో నిలవాలా? వద్దా? అని నిర్ణయించుకునేందుకు కొంత సమయం పడుతుందన్నారు. ఈసారి ఎన్నికలలో బీసీలు కీలకపాత్ర పోషించనున్నారన్న కృష్ణయ్య.. అన్ని పార్టీల మేనిఫెస్టోల ప్రకటన, టికెట్ల కేటాయింపు పూర్తయిన తర్వాతే ఏ పార్టీకి, కూటమికి మద్దతివ్వాలన్నది నిర్ణయించుకుంటామని ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.  
 
సాక్షి: బీసీలకు రాజ్యాధికారం కల్పించాలన్న లక్ష్యం దిశగా.. మీ వ్యూహమేంటి? 
కృష్ణయ్య : స్వాతంత్య్రం వచ్చిన 71ఏళ్లలో బీసీలకు రాజ్యాధికారంలో జనాభా నిష్పత్తి ప్రాతిపదికన సరైన వాటా దక్కలేదు. ఇటీవలే.. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన లెక్కల ప్రకారం.. దేశంలో బీసీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధుల సంఖ్య 14% మాత్రమే. ప్రజాస్వామ్యంలో అన్ని కులాలు, సామాజిక వర్గాలకు వారి జనాభా నిష్పత్తి ప్రకారం వాటా ఇవ్వాలి. కానీ అది జరగడం లేదు. చట్టసభలన్నీ అగ్రకులాలతో నిండిపోతున్నాయి. మా పోరాటం వెనుక రెండు పవిత్రమైన ఆశయాలు, లక్ష్యాలున్నాయి. రాజ్యాధికారంలో బీసీలకు వాటా వస్తేనే అభివృద్ధి, ఆత్మవిశ్వాసం సాధ్యమవుతుంది. చట్టాలు, శాసనాలు చేయడంలో ప్రమేయం ఉంటేనే బీసీ వర్గాలకు ప్రయోజనం దక్కుతుంది. సామాజికంగా మా గౌరవం, హోదా పెరుగుతాయి. బీసీలది ఆకలిపోరాటం కాదు.. ఆత్మగౌరవ పోరాటం. ఇప్పటివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలో 29 మంది సీఎంలుంటే.. అందులో ఒక్క బీసీ కూడా లేడు. ఇదెలా ప్రజాస్వామ్యం అవుతుంది? సీట్ల పంపకం, పదవులు అనుభవించడంలో ఈ సమానత్వం ఎందుకుండదు? ఈ మౌలికసూత్రాన్ని పాలకులు, రాజకీయపార్టీలు విస్మరిస్తున్నాయి. దీన్ని బద్దలు కొట్టే వ్యూహంతోనే ముందుకెళతాం.  
 
119 నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలేవీ బీసీలకు సరైన సంఖ్యలో టికెట్లిచ్చే పరిస్థితి లేదు. మీ డిమాండ్‌ ఏంటి? 
టీఆర్‌ఎస్‌ ప్రకటించిన 105 మంది అభ్యర్థుల్లో బీసీలు కేవలం 20 మందే. ఇది బీసీలకు అన్యాయం చేయడమే. పార్టీ అభ్యర్థులను చూడొద్దు, నన్ను చూసి ఓట్లేయండి, నేనే గెలిపిస్తానని సీఎం కేసీఆర్‌ అంటున్నారు. మరి ఆయన్ను చూసి ఓట్లేసి గెలిపించాలనుకుంటే అభ్యర్థిగా ఎవరున్నా ఒక్కటే. అలాంటప్పుడు టికెట్ల కేటాయింపులో సామాజిక న్యాయాన్ని అమలుచేయడంలో కేసీఆర్‌కు వచ్చిన ఇబ్బందేంటి? కాంగ్రెస్‌ పార్టీ గెలుపు ప్రాతిపదికగా టికెట్లు ఇస్తామంటోంది. అంటే అగ్రకులాలకిస్తేనే గెలుస్తారా? గెలుపు ప్రాతిపదిక డబ్బే కాదు.. జనబలం, కులబలం కూడా. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ గమనించాలి. బీజేపీ కూడా టికెట్ల కేటాయింపులో సామాజిక న్యాయం పాటించడం లేదు. వాళ్ల వైఖరి కూడా మారాలి. 
 
సాక్షి: బీసీలు ఇప్పటికీ పల్లకీ మోసే బోయీలుగానే ఉంటున్నారనే అభిప్రాయం ఉంది.. ఈ పరిస్థితుల్లో మార్పు ఎలా వస్తుందంటారు? 
కృష్ణయ్య: ఈ పార్టీలన్నీ అగ్రకుల పార్టీలే. బీసీల ప్రయోజనాలు కాపాడేవి కావు. అందుకే రాజకీయ పార్టీల్లోని బీసీ నాయకులకు నేను ఒక్కటే పిలుపునిస్తున్నా. ఎప్పుడూ జెండాలు మోసి, జిందాబాద్‌లు కొట్టి కట్టుబానిసలుగా ఉండడం కాదు. టికెట్ల కోసం నాయకత్వంపై తిరుగుబాటు చేయాలి. పోరాడాలి. మేం కూడా బీసీ సంఘాలుగా ఒత్తిడి తీసుకువస్తాం. రాజకీయాల్లో సోషల్‌ ఇంజనీరింగ్‌ జరగాలి. అప్పుడు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు కూడా సులభంగా గెలుస్తారు. అనామకులైనా ప్రజానాయకులై.. పాలనలో భాగస్వామ్యం పొందుతారు. 
 
మేనిఫెస్టోల్లో బీసీలకు మేలు చేకూర్చే ఎలాంటి అంశాలు ఉండాలనేది మీ డిమాండ్‌? 
బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలన్నది మా ప్రధాన డిమాండ్‌. దీంతో పాటు రూ.20వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్‌ పెట్టేలా బడ్జెట్‌ కేటాయింపులుండాలి. పంచాయతీరాజ్‌ రిజర్వేషన్లను జనాభా దామాషాలో పెంచి చట్టబద్ధత కల్పించాలి. బీసీ కార్పొరేషన్, ఫెడరేషన్లకు రూ.10వేల కోట్ల బడ్జెట్‌ కేటాయించి ఒక్కో కుటుంబానికి రూ.5లక్షల నుంచి కోటి వరకు 90% సబ్సిడీతో రుణాలివ్వాలి. పారిశ్రామిక విధానంలో 50% వాటా ఇవ్వాలి. రాష్ట్రంలో బీసీల కోసం 500 రెసిడెన్షియల్‌ పాఠశాలలు ఏర్పాటు చేయాలి. ఇతర వర్గాలతో సమానంగా బీసీ విద్యార్థులందరికీ పూర్తిఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేయాలి. అన్ని ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల్లో జనాభా ప్రాతిపదికన 50% వాటా ఇవ్వాలి. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు వర్తింపజేయాలి. ఈ అంశాలన్నింటినీ ప్రధాన రాజకీయ పార్టీలు మేనిఫెస్టోల్లో పెడితేనే బీసీల మద్దతు లభిస్తుంది.  
 
రాజకీయ పార్టీ పెట్టాలంటూ మీపై ఒత్తిడి ఉంది. దీనిపై మీరేమంటారు? 
పార్టీ పెట్టాలని అందరూ ఒత్తిడి చేస్తున్నారు. మన ఓటు మనమే వేసుకుందాం అంటున్నారు. అధికారం ఉన్న చోటే అభివృద్ధి అనే విషయాన్ని బీసీలు గుర్తించారు. అభివృద్ధి పీఎంలు, సీఎంల చేతుల్లోనే ఉందని.. ఆ అభివృద్ధి తాము వేసే ఓట్లలో ఉందని గ్రహించారు. అయితే, తెలంగాణలో ఇప్పుడు పొత్తులకు మాత్రమే సిద్ధపడుతున్నాం. ఏపీలో పార్టీ పెట్టే కసరత్తు తీవ్రంగా జరుగుతోంది. గ్రౌండ్‌ వర్క్‌ చేస్తున్నాం. అక్కడ పార్టీ పెట్టడం.. 175 స్థానాల్లో పోటీచేయడం ఖాయం. 
 
నాలుగేళ్లలో బీసీలకు మేలు చేసే పథకాలు తెచ్చామని కేసీఆర్‌ అంటున్నారు కదా.. 
బీసీలకు కాస్తయినా మంచి చేసుంటే మేం అభినందించే వాళ్లం. అయితే.. బీసీలకు కేసీఆర్‌ మంచి చేయకపోగా చెడు చేశాడు. విద్య, ఉద్యోగాల్లో క్రీమిలేయర్‌ను బలవంతంగా బీసీలపై రుద్దాడు. దీని వెనుక కసి కనిపిస్తోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందరికీ పెట్టి బీసీలకు ఎందుకు ఇవ్వరు? అదనంగా రూ.150 కోట్లు లేవా? వేల మంది బీసీ విద్యార్థులు చదువు మానుకుని ఇండ్ల దగ్గర ఉంటున్నారు. బర్రెలు, గొర్రెలకు డబ్బులుంటాయి కానీ, ఫీజులకుండవా? వాళ్ల పిల్లలకు ఎంపీ, ఎమ్మెల్యే పదవులు కావాలి.. మా పిల్లలు గొర్రెలు, బర్రెలు కాయాల్నా? ఏటా రూ.5వేల కోట్లు బీసీల కోసం ఖర్చు చేస్తామని చెప్పి మొదటి రెండేళ్లు రూ.2వేల కోట్లిచ్చారు. అవి కూడా ఖర్చు చేయలేదు. కేసీఆర్‌ బీసీ వ్యతిరేక చర్యల లెక్క తీస్తే ఒక పుస్తకం అవుతుంది. 
 
పొత్తుల్లో భాగంగా టీడీపీ పోటీచేసే స్థానాల జాబితాలో మీ పేరుందా? 
అది టీడీపీ పార్టీని, చంద్రబాబును అడగాల్సిన ప్రశ్న. కూటమి తరఫున టీడీపీ అభ్యర్థిగా పోటీచేసే జాబితాలో నా పేరు, నా నియోజకవర్గం పెట్టకుండానే ఇచ్చారని తెలిసింది. అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నా. 
 
ఈసారి ఎన్నికల బరిలో ఉండాలనే ఆలోచన ఉందా? 
పోటీ చేయాలా.. వద్దా అనేది ఆలోచిస్తున్నా. ఎల్బీనగర్‌లోనే చేయాలని ప్రజలు అడుగుతున్నారు. నేను గెలిచిన తర్వాతే అభివృద్ధి జరిగిందని, నియోజకవర్గం ప్రశాంతంగా ఉందని అక్కడి ప్రజల అభిప్రాయం. ఎల్బీనగర్‌లోనే పోటీచేయాలని అనుకుంటున్నా. తుది నిర్ణయానికి కొద్ది సమయం పడుతుంది. 
 
ఈసారి ఎన్నికలలో ఏ పార్టీకి మద్దతివ్వబోతున్నారు? 
ఇప్పటివరకు బీసీలను రాజకీయ పార్టీలు ఓటుబ్యాంకుగానే వాడుకుంటున్నాయి తప్ప.. మా సామాజిక, ఆర్థిక అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయడం లేదు. ఈ సారి ఎన్నికలలో బీసీలు చూస్తూ ఊరుకోరు. వారి విజన్‌ వారికుంది. ఆయా పార్టీల పట్ల వారి అభిప్రాయం వారికుంది. బీసీ సంఘాలుగా మా వాదన మేం వినిపిస్తున్నాం. నాలుగు దశాబ్దాల నా ఉద్యమ జీవితం ఇందుకు పునాది అవుతుంది. ఆయా పార్టీల మేనిఫెస్టోలు, టికెట్ల కేటాయింపులు పూర్తయిన తర్వాతే దీనిపై మా నిర్ణయాన్ని ప్రకటిస్తాం.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top