
లక్నో : జయప్రదపై ఎస్పీ నేత ఆజం ఖాన్ చేసిన అమర్యాదకర వ్యాఖ్యలు దుమారం రేపగా తాజాగా ఆయన కుమారుడు అబ్దుల్లా ఆజం ఖాన్ నోరు పారేసుకున్నాడు. జయప్రదను అనార్కలిగా అబ్దుల్లా వ్యాఖ్యానించాడు. తాము అలిని, భజరంగ్ భళిని కోరుకుంటామని అనార్కలిని కాదని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే అది దేశ చరిత్రకు మాయని మచ్చగా మిగిలిపోతుందన్నారు. కాగా అబ్దుల్లా వ్యాఖ్యలపై జయప్రద భగ్గుమన్నారు.
తండ్రి ఆజంఖాన్‌లాగే ఆయన కుమారుడు మాట్లాడుతున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే కుటుంబం నుంచి వచ్చినందుకే అబ్దుల్లా బాగా చదువుకున్నా తండ్రిలాగే మాట్లాడుతున్నాడని, వారికి మహిళలను గౌరవించడం తెలియదని దుయ్యబట్టారు. కాగా జయప్రదపై ఆజం ఖాన్ చేసిన ఖాకీ నిక్కర్ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆజం ఖాన్ వ్యాఖ్యలపై మహిళా కమిషన్, ఈసీ తీవ్రంగా స్పందించాయి. ఆజం ఖాన్ 72 గంటల పాటు ప్రచారం చేయకుండా ఈసీ నిషేధించింది. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయనను అనుమతించరాదని జయప్రద డిమాండ్ చేశారు.