370పై అంత ప్రేమ ఎందుకు?

Article 370 not economy dominates Maharashtra, Haryana elections - Sakshi

దేశ ప్రజలకు కాంగ్రెస్‌ వివరించాలి

ఆ ప్రేమ కారణంగానే వేలాది జవాన్లు కశ్మీర్లో ప్రాణాలు కోల్పోయారు

హరియాణా ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ

బల్లబ్‌గఢ్‌(హరియాణా): ఆర్టికల్‌ 370 అంటే ఎందుకు తమకంత ప్రేమో కాంగ్రెస్‌ పార్టీ జమ్మూకశ్మీర్లో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాలకు వివరించాలని ప్రధాని  మోదీ డిమాండ్‌ చేశారు. ఆర్టికల్‌ 370పై వారికున్న ప్రేమ కారణంగానే వేలాది మంది జవాన్లు సరిహద్దుల్లో ప్రా ణాలు కోల్పోయారన్నారు.  హరియాణాలో సోమ వారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ.. అధికారంలోకి వస్తే తాము రద్దు చేసిన ఆర్టికల్‌ 370ని మళ్లీ అమల్లోకి తీసుకువస్తామని హామీ ఇచ్చే ధైర్యం ఉందా? అని కాంగ్రెస్‌ను ప్రశ్నించారు.

జమ్మూకశ్మీర్‌ను హింస నుంచి తప్పించి అభివృద్ధి పథంలోకి తీసుకురావాలని హరియాణా ప్రజలతో పాటు దేశమంతా కోరుకుంటోందని ఎన్నికల ప్రచారంలో మోదీ పేర్కొన్నారు. ఫ్రాన్స్‌ నుంచి రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందాన్ని అడ్డుకునేందుకు విపక్షాలు విఫలయత్నం చేశాయన్నారు.  ఆర్టికల్‌ 370 రద్దు వంటి కఠిన నిర్ణయాల గురించి గత ప్రభుత్వాలు కనీసం ఆలోచించలేదని, హరియాణా ఓటర్లు సహా దేశ ప్రజలంతా తమకు సంపూర్ణ మెజారిటీ ఇవ్వడం వల్లనే ఆ నిర్ణయం తీసుకోగలిగామని మోదీ వివరించారు. ఈ నిర్ణయం వల్ల తమ ప్రయోజనాలు దెబ్బతిన్న కొందరు మాత్రం వీధుల్లోకి ఎక్కి నినాదాలు చేస్తున్నారని విమర్శించారు.

చచ్చిన ఎలుకను పట్టారు
సోనిపట్‌/న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియా గాంధీని చచ్చిన ఎలుక అంటూ పోలుస్తూ హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఖర్ఖోడాలో సోమవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. ‘రాహుల్‌ గాంధీ స్థానంలో బయటి వ్యక్తిని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నుకోలేకపోయింది. గాంధీ కుటుంబంలోని సోనియానే మళ్లీ ఎన్నుకుంది. ఇదంతా కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉంది. అది కూడా చచ్చిన ఎలుక’అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టోలో రూ.1.25 లక్షల కోట్ల మేర ఓటర్లకు తాయిలాలు ప్రకటించడంపై ఆయన..  ప్రభుత్వ ఖజానా ఏమైనా వాళ్ల బాబు సొమ్మనుకుంటున్నారా? అని  మండిపడ్డారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top