‘ప్రధాని, సీఎం ఏం మాట్లాడుకున్నారో మీకెలా తెలిసింది?’

AP Minister Kurasala Kannababu Slams TDP Over Negative Talk CM Jagan Meet PM - Sakshi

సాక్షి, కాకినాడ: ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు రోజురోజుకు దిగజారి మాట్లాడుతున్నారని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలను చూసి టీడీపీ అధినేత సహించలేకపోతున్నారని విమర్శించారు. గురువారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు, టీడీపీ నేతల తీరుపట్ల మంత్రి కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ‘ప్రధాని, సీఎం ఏం మాట్లాడుకున్నారో మీకెలా(టీడీపీ నేతలకు) తెలిసింది? ఆ రూమ్‌లో మీరేమైనా కార్పెట్లు క్లీన్‌ చేస్తున్నారా? లేక కాఫీ కప్పులు తీస్తున్నారా?’అని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో ప్రజలు గట్టిగా బుద్ది చెప్పినా చంద్రబాబులో ఎలాంటి మార్పురాలేదని దుయ్యబట్టారు. వ్యక్తిగత అవసరాల కోసం కాళ్లు పట్టుకునే సంస్కృతి బాబుదని పేర్కొన్నారు. 

‘శాసనమండలి రద్దు చేస్తున్నామంటే యనమల రామకృష్ణుడు, లోకేష్‌లకు మైండ్‌ బ్లాంకైంది. యనమల ప్రపంచంలో తానొక్కడే మేథావిని అనుకుంటున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసిన చరిత్ర యనమలది. దొరికిన చోటల్లా అప్పులు తెచ్చి పప్పు బెల్లాల్లా ఖర్చుపెట్టారు. అమరావతిలో కృత్రిమ ఉద్యమం సృష్టించి రాష్ట్రంలో ఎదో జరుగుతున్నట్లు చంద్రబాబు భ్రమ కల్పిస్తున్నారు. జోలె పట్టుకుని అన్ని ప్రాంతాలు తిరుగుతున్నారు. ఆ జోలెలో పడ్డ బంగారం, డబ్బు ఏమయ్యాయో ఆయన చెప్పాలి. రాజధాని నిర్మాణం వల్ల ఎవరికీ అన్యాయం జరగకూడదనే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉద్దేశం. అమరావతిలో దొరికిపోయన దొంగల్లాగ టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాల్సిన అవసరం లేదా? కేవలం ఒక ప్రాంతంలో మహానగరం నిర్మిస్తామనడం సరికాదు.  ప్రత్యేక హోదాను నీరుగార్చింది చంద్రబాబే. రాష్ట్రానికి ఆర్థిక సంక్షోభంలో నెట్టేసింది టీడీపీనే. పోలవరంలో కమీషన్ల కోసం కక్కుర్తి పడ్డారు. ఢిల్లీ నుంచి దావోస్‌ వరకు రాష్ట్ర ప్రతిష్టను చంద్రబాబు దిగజార్చారు’అని మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. 

చదవండి:
ఏపీ అభివృద్ధికి ఊతమివ్వండి
పవర్‌ఫుల్‌ సర్పంచ్‌ 
బాబు తిప్పిన చక్రాలు ఏమయ్యాయో?

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top