మాది ఫ్రెండ్లీ ప్రభుత్వం: మంత్రి బొత్స

AP Minister Botcha Satyanarayana Slams Chandrababu Naidu In Amaravati Meeting  - Sakshi

సాక్షి, అమరావతి : దేశంలో ఆంధ్రప్రదేశ్‌ను రోల్‌మోడల్‌గా నిలపాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అమరావతిలో శుక్రవారం ఏర్పాటు చేసిన స్టేక్‌ హోల్డర్స్‌ సమావేశంలో మంత్రితో పాటు 13 జిల్లాల స్టేక్‌ హోల్డర్స్‌, క్రెడాయ్‌ బిల్డర్స్‌ అసోషియేషన్‌ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఏ రాష్ట్రంలో అయితే సిమెంట్‌, స్టీలు వినియోగం ఎక్కువగా జరుగుతుందో.. ఆ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు సాగుతోందని అర్థం అన్నారు. అందరికి ఇల్లు నిర్మించి ఇవ్వాలన్నదే ప్రభుత్వ నిర్ణయమని, మధ్య తరగతి, పేద ప్రజలకు ఇళ్ల నిర్మాణం చేసి ఇస్తామని హామీ ఇచ్చారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీది ఫ్రెండ్లీ ప్రభుత్వమని.. అందరి సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుని ముందుకు వెళతామని పేర్కొన్నారు. లేఅవుట్ల విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు. అలాగే నిర్మాణ అనుమతులు ఇవ్వడంలో కొంత జాప్యం జరుగుతోందని, బిల్డింగ్‌ ఫీజులు ఎక్కువగా ఉన్నాయన్న బిల్డర్స్‌ భావన సహజమే.. అయితే ప్రభుత్వ ఆదాయం కోసం ఫీజులు పెంచడం లేదని మంత్రి వివరించారు.

బీపీయస్‌ను అలవాటుగా చేయబోమని, వాటిపై ఇక ఎలాంటి ప్లాన్స్‌ ఉండవని మంత్రి అన్నారు. రాష్ట్రంలో అనుమతులు లేని లే అవుట్స్‌ ఉన్నాయని, ఆన్‌లైన్‌ సిస్టంను మరింత మెరుగుపరిచి లోటు పాట్లు సరిచేస్తామన్నారు. ఖాళీ స్థలాలకు సెల్ఫ్‌ డిక్లరేషన్‌ కల్పిస్తామని, రేరాలో సభ్యత్వం పరిశీలన చేస్తామని వచ్చే ఏప్రిల్‌ కల్లా మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేస్తామన్నారు. ఇందుకోసం స్టేక్‌ హోల్డర్స్‌ తమ సలహాలను, సూచనలను ఇచ్చి.. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని మంత్రి కోరారు. అలాగే పొరుగు రాష్ట్రాల్లో నిబంధనలను పరిగణనలోకి తీసుకుని.. ఒక వర్కింగ్‌ గ్రూప్‌ని ఏర్పాటు చేసి ఆ నిబంధనలు అమలు చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్టేక్‌ హోల్డర్స్‌ 25 విషయాలను తమ దృష్టికి తీసుకువచ్చారని, వాటిని ప్రభుత్వం కచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటుందని తెలిపారు. కాగా ఇసుక సమస్య కొంత ఇబ్బందిని కలిగిస్తోందని, వర్షాల వలన కూడా కొంత ఇబ్బంది కలుగుతోందని.. ఇసుక విధాన ఫలాలు భవిష్యత్తుకు దోహదపడతాయని మంత్రి వివరించారు. 

చంద్రబాబు ఆలోచన ధోరణి మారాలి
సచివాలయ ఉద్యోగాలపై చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి స్పందిస్తూ.. చంద్రబాబు ప్రతి అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం నీచమని విమర్శించారు. లక్ష మందికి ఉద్యోగ అవకాశలు కల్పిస్తే ఓర్వలేక విమర్శలు చేయడం సరికాదని, చంద్రబాబు వ్యాఖ్యలు వింటుంటే అసహ్యం వేస్తోందని మండిపడ్డారు. 4 నెలల కాలంలో రాష్ట్రాన్ని గాడిలో పెట్టి రాష్ట్ర అభివృద్దికి కృషి చేస్తుంటే చంద్రబాబు విమర్శలు చేయటం దారుణమన్నారు. అలాగే చంద్రబాబుపై సోషల్‌ మీడియాలో వస్తున్న పోస్టింగ్స్‌ని ఖండిస్తున్నామని.. వాటిపై పోలీసులు వారి పని వారు చేస్తున్నారని తెలిపారు. పెయిడ్‌ ఆర్టిస్టులను పెట్టించి తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ఇలాంటి పరిస్థితులే వస్తాయని తెలిపారు. గత ఐదేళ్లలో చంద్రబాబు చేసిన పనులు అందరు చూశారు.. సోషల్‌ మీడియాలో వచ్చిన పోస్ట్‌లను తాము ప్రోత్సహించడం లేదని, నీవు నేర్పిన విద్య వలనే నీకే తిప్పలు వచ్చాయని.. ఇకనైనా చంద్రబాబు ఆలోచన ధోరణి మార్చుకోవాలని బొత్స హితవు పలికారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top