ఆ ఇద్దరికీ అపూర్వ సన్మానం

anti-government government Manik Sarkar - Sakshi

తొలి కేంద్ర కమిటీ సభ్యులు అచ్యుతానందన్, శంకరన్‌కు ఘనంగా సత్కారం

సాక్షి, హైదరాబాద్‌: సీపీఎం 22వ జాతీయ మహాసభల ప్రాంగణం అరుదైన ఘటనకు వేదికైంది. అవిభక్త కమ్యూనిస్టు పార్టీ నుంచి సీపీఎం ఆవిర్భావం కోసం అప్పటి సీపీఐతో విభేదించి బయటకు వచ్చిన ఇద్దరు కమ్యూనిస్టు యోధులను ఘనంగా సన్మానించారు. ఆ ఇద్దరు.. పార్టీ తొలి కేంద్ర కమిటీ సభ్యులైన కేరళ మాజీ సీఎం వీఎస్‌ అచ్యుతానందన్‌ (95), తమిళనాడుకు చెందిన పార్టీ నేత శంకరన్‌ (96). పార్టీ మహాసభలకు వీరిని అతిథులుగా ఆహ్వానించిన సీపీఎం నేతలు మహాసభల వేదికపై సత్కరించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వారి మెడలో దండలు వేశారు. పార్టీ మూలస్తంభాలైన ఈ ఇద్దరు నేతల కృషి మరువలేనిదని కొనియాడారు. అచ్యుతానందన్, శంకరన్‌లు కనీసం నడవలేని స్థితిలో ఉన్నా.. సహాయకులను వెంటబెట్టుకుని సభలకు హాజరవడం విశేషం.

ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం మాణిక్‌ సర్కార్‌
సాక్షి, హైదరాబాద్‌: దేశాన్ని ప్రజావ్యతిరేక ప్రభుత్వం పాలిస్తోందని త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌ ఆరోపించారు. బుధవారం ప్రారంభమైన పార్టీ జాతీయ మహాసభల్లో ఆయన అధ్యక్షోపన్యాసం చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు. మతతత్వ విధానాలతో నేరుగా ప్రజాస్వామ్యంపై దాడికి బీజేపీ, సంఘ్‌ పరివార్‌లు తెగబడుతున్నాయని ఆరోపించారు. వామపక్ష, ప్రజాతంత్ర కూటమి మాత్రమే దేశ ప్రజల నిజమైన కూటమి అని అన్నారు.

మార్క్సిస్టు యోధులకు సంతాపం
మహాసభల్లో తొలిరోజు పలువురు మార్క్సిస్టు యోధులకు నివాళి అర్పించారు. త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌ ప్రవేశపెట్టిన ఈ సంతాప తీర్మానంలో ఖగేన్‌దాస్, పుకుమోల్‌సేన్, నూరుల్‌హుడా, సుబో«ధ్‌ మెహతాలతోపాటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన పులువురు నేతలకు సంతాపం ప్రకటించారు. తెలంగాణ నుంచి మాజీ ఎమ్మెల్యే నర్రా రాఘవరెడ్డి, ట్రేడ్‌ యూనియన్‌ నేతలు పర్సా సత్యనారాయణ, తిరందాసు గోపిలకు కూడా మహాసభ నివాళి అర్పించింది. బెంగాల్, త్రిపుర, బిహార్, మహారాష్ట్రల్లో హత్యలకు గురైన పార్టీ నేతలను సంస్మరించుకున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top