షహీన్‌ బాగ్‌పై మరో నకిలీ వీడియో! | Sakshi
Sakshi News home page

షహీన్‌ బాగ్‌పై మరో నకిలీ వీడియో!

Published Wed, Feb 5 2020 3:44 PM

Another Fake Video On Shayeen Bagh - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘సీఏఏ, ఎన్‌ఆర్‌సీలకు వ్యతిరేకంగా షహీన్‌ బాగ్‌లో ధర్నా చేస్తున్న ఆడవాళ్లంతా డబ్బులు తీసుకుంటున్నారు. 500, 700 రూపాయలు తీసుకొని షిప్టుల పద్ధతిలో ధర్నాకు కూర్చుంటారు...అవును బాయ్‌’  అని ఇద్దరు హిందీలో మాట్లాడుకుంటుండగా, ‘సబ్‌ కాంగ్రెస్‌ కా ఖేల్‌ హై (అదంతా కాంగ్రెస్‌ పార్టీ డ్రామా) ’ అని మూడో వ్యక్తి వ్యాఖ్యానించిన ఓ వీడియోను బీజేపీ సోషల్‌ మీడియా హెడ్‌ అమిత్‌ మాలవియా జనవరి 15వ తేదీన ట్వీట్‌ చేశారు. అంతా కాంగ్రెస్‌ డ్రామా అంటూ ఆయన కూడా నొక్కి చెప్పారు. (షహీన్‌ బాగ్ శిశువు మృతి)

ఆ వీడియోలో ఉన్న వాస్తవాస్తవాలను తెలుసుకోకుండానే ‘టైమ్స్‌ నౌ’ టీవీ ఆ వీడియోను ప్రసారం చేసింది. ‘ఇది స్టింగ్‌ ఆపరేషన్‌ లా ఉంది. షహీన్‌ బాగ్‌లో డబ్బులు తీసుకొని ధర్నా చేస్తున్న ఆడవాళ్ల గురించి అక్కడ మాట్లాడుకుంటున్న గుర్తుతెలియని వ్యక్తులను రహస్యంగా చిత్రీకరించినట్లుంది. వాస్తవం ఏదో మనకు స్పష్టంగా తెలియదు. బీజేపీ చేతికి ఈ వీడియో ఎలా వచ్చిందో తెలియదు. బీజేపీయే స్వయంగా ఈ స్టింగ్‌ ఆపరేషన్‌ చేసిందా? ఎవరైనా చేసి బీజేపీ చేతికి ఇచ్చారా? తెలియదు’ అంటూ జర్నలిస్ట్‌ మెఘా ప్రసాద్‌ వ్యాఖ్యానంతో ఆ వీడియోను ‘టైమ్స్‌ నౌ’ పూర్తిగా ప్రసారం చేసింది.

‘ప్రొటెస్ట్‌ఆన్‌హైర్‌’ అనే హ్యాష్‌ ట్యాగ్‌తో ‘రిపబ్లిక్‌ టీవీ’ చర్చా కార్యక్రమాన్ని చేపట్టగా, ‘డబ్బులకు ఆందోళన చేస్తున్నారా?’ అంటూ ‘ఇండియా టుడే’ టీవీ కూడా చర్చా కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. బీజేపీ గుజరాత్‌ ఎమ్మెల్యే హర్ష్‌ సాంఘ్వీ, బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు ప్రీతీ గాంధీ, మాజీ శివసేన సభ్యులు రమేశ్‌ సోలంకి, బీజేపీ ఢిల్లీ ఐటీ సెల్‌ హెడ్‌ పునీత్‌ అగర్వాల్, సినీ నిర్మాత అశోక్‌ పండిట్‌లు తమ తమ వ్యాఖ్యానలతో ఆ వీడియోను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు.
shaheen
నకిలీ వీడియోలను, వార్తలను ఎప్పటికప్పుడు కనిపెట్టే ‘ఆల్ట్‌ న్యూస్, లాండ్రీన్యూస్‌’లు వీడియోను ఫ్రేమ్, ఫ్రేమ్‌ తనిఖీ చేయగా, ముగ్గురు వ్యక్తులు మాట్లాడుకుంటున్న వెనకాల ఓ షాపు అద్దం మీద స్పష్టంగా ‘9312484044’ అనే నెంబర్‌ కనిపించింది. ఆల్ట్‌ న్యూస్, లాండ్రీ న్యూస్‌కు చెందిన ఇద్దరు రిపోర్టర్లు ఆ నెంబర్‌ పట్టుకొని గూగుల్‌ సర్చ్‌ ద్వారా వెళ్లగా ‘కుస్మీ టెలికమ్‌ సెంటర్‌’ అనే మొబైల్‌ షాప్‌ కనిపించింది. ఆ ఫోన్‌ నెంబర్‌ ఆ షాపుదే. వీడియోలో కనిపించే గోడ, దాని మీద పోస్టర్లు కూడా అచ్చం అలాగే షాపు రెక్క మీద ఉన్నాయి. షహీన్‌ బాగ్‌కు 8 కిలోమీటర్ల దూరంలో పూల్‌ ప్రహ్లాద్‌పూర్‌లో ఆ షాపు ఉంది. తుగ్లకాబాద్‌ మెట్రో స్టేషన్‌కు సమీపంలో 134 నెంబర్‌ షాపది. అశ్వని కుమార్‌ అనే 38 ఏళ‍్ల వ్యక్తి ఆ షాపు యజమాని. ఆయనకు 70 ఏళ్ల తండ్రి కూడా ఉన్నారు. 8–10 చదరపు గజాల వెడల్పుతో ఉన్న ఆ షాపులో సిగరెట్లు, గుడ్లు, డేటా ప్లాన్స్, చిప్స్‌ అమ్ముతున్నారు. ఆ షాపుకు ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ అడ్వర్టయిజ్‌ బోర్డులు కూడా ఉన్నాయి. (ఇర్ఫాన్ పఠాన్పై ఫేక్ వీడియో!)

ఆ షాపులో సిగరెట్లు కొనుక్కున్న ఇద్దరు రిపోర్టర్లు అశ్వని కుమార్‌తో పిచ్చాపాటిగా రాజకీయాలు మాట్లాడుతు వచ్చారు. ఆ షాపు గోడలకు మోదీ, ఇతర బీజేపీ నేతల ఫొటోలు ఉన్నాయి. బీజేపీలో పనిచేస్తారా? అని ప్రశ్నించగా, తనను తాను సిన్సియర్‌ కార్యకర్తనని చెప్పుకున్నారు. సోషల్‌ మీడియాలో సర్కులేట్‌ అవుతున్న వీడియో తన షాపు ముందు తీసిందే అని మాటల సందర్భంలో అంగీకరించారు. అయితే తాను తీయలేదని, ఎవరో తీశారని చెప్పారు. ‘మీ వృద్ధులకు ప్రభుత్వం ఏం చేస్తోంది’ అని అశ్వని కుమార్‌ తండ్రిని ప్రశ్నించగా బీజేపీ ఏమీ చేయడం లేదు, ఆప్‌ ఏమీ చేయడం లేదని చెప్పారు. ‘సబ్‌ కాంగ్రెస్‌ కా ఖేల్‌ హై’ అని వీడియోలో ఉన్న గొంతను పోలినట్టే ఆయన స్వరం ఉంది. (సీఏఏకు వ్యతిరేకం.. ఇది మరో షాహీన్ బాగ్‌)

మరోసారి వీడియో ఫ్రేమ్‌లను ఆ ఇరువురు రిపోర్టర్లు పరిశీలించగా, షాపు బయటి నుంచి కాకుండా షాపు లోపలి నుంచే తీసినట్లు తెలుస్తోంది. రిపోర్టర్లు సిగరెట్‌ తాగుతున్నప్పుడే అశ్వని కుమార్‌ తన సెల్‌ ఫోన్‌తో వారిని వీడియోతీసి ‘నా అనుమతి లేకుండా సిగరెట్లు తాగుతున్నారు’ అని కాప్షన్‌ పెడితే ఎలా ఉంటుందని కూడా వారిని ప్రశ్నించారు. ఆ తర్వాత స్థానిక బీజేపీ నాయకులు బన్వర్‌ సింగ్‌ రాణాను రిపోర్టర్లు పరిచయం చేసుకొని షహీన్‌ బాగ్‌ గురించి ‘స్టింగ్‌ ఆపరేషన్‌’ ఎవరు చేశారని ప్రశ్నించగా, తమ పోరగాడేనని, సమీపంలో మొబైల్‌ షాపు నడుపుతున్నారని చెప్పారు. పరిచయం చేయమని అడగ్గా ఫిబ్రవరి 8వ తేదీన ఢిల్లీ ఎన్నికలయ్యాక వస్తే పరిచయం చేస్తానని చెప్పారు. (వీడియోచైనా మార్కెట్ది కాదు!)

Advertisement
Advertisement