‘ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే కౌరవుల సభ గుర్తొస్తుంది’

Anil Kumar Yadav Counter To Chandrababu Over Kollu Ravindra Arrest - Sakshi

సాక్షి, తాడేపల్లి :  వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నాయకుడు మోకా భాస్కర్‌రావు హత్య కేసులో అరెస్ట్‌ అయిన మాజీమంత్రి కొల్లు రవీంద్రను స్పష్టమైన ఆధారాలతోనే అరెస్టు చేశారని మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. కొల్లు రవీంద్ర తప్పు చేయకపోతే పోలీసుల్ని చూసి గోడ దూకి ఎందుకు పారిపోయాడని ప్రశ్నించారు. సోమవారం తాడేపల్లిలో మంత్రి అనిల్‌ కుమార్‌ మాట్లాడుతూ.. బీసీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ చంద్రబాబు మాట్లాడుతున్నారని, నేరం చేసిన వారిని అరెస్టు చేస్తే తప్పా అని నిలదీశారు. తప్పులు చేస్తే కులం, మతం అంటకట్టవచ్చా అని ప్రశ్నించారు. హత్య కేసులో చనిపోయిన వ్యక్తీ బీసీ కాదా అని, భాస్కర్‌ రావు చనిపోతే ఆయన కుటుంబం రోడ్డు మీద పడ్డారని అన్నారు. (మహిళా ఉద్యోగికి మంత్రి అనిల్‌ పరామర్శ)

అయ్యన్నపాత్రుడు మాట్లాడిన వ్యాఖ్యలు చూస్తుంటే కౌరవుల సభ గుర్తుకు వస్తోందని అనిల్‌ కుమార్‌ ఎద్దేవా చేశాడు. ఓ మహిళపైన అసభ్యంగా చేసిన ఆయన వ్యాఖ్యలను చంద్రబాబు సమర్ధిస్తాడా అని నిలదీశారు. 150 కోట్ల రూపాయలు దోచిన అచ్చెన్నాయుడిని అరెస్టు చేస్తే కూడా బీసీ కులం వాడతారా అని మండిపడ్డారు. తప్పు చేసి అడ్డంగా దొరికితే కులాన్ని అంటకట్టడం టీడీపీకి మామూలు అయిపోయిందన్నారు. బీసీలపై అంతా ప్రేముంటే అయిదేళ్లు వాళ్ల కోసం ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలని కోరారు. 50వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పి కనీసం 15వేల కోట్లు కూడా ఖర్చు పెట్ట లేదని దుయ్యబట్టారు. బీసీలను ఓటు బ్యాంకు కోసం వాడుకుంది చంద్రబాబేనని మంత్రి అనిల్‌ కుమార్‌ ధ్వజమెత్తారు. (రైతు భరోసా కేంద్రాలకు ‘వైఎస్సార్’‌ పేరు)

‘బీసీల అభివృద్ది కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఏడాది కాలంలోనే  20 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. నామినేట్ పదవుల్లో బీసీ, ఎస్టీ, ఎస్సీలకు ప్రాధాన్యత కల్పిస్తున్నాం. మేము, మా నాయకుడు ఎప్పుడు ఇలాంటి చౌకబారు రాజకీయాలు చెయ్యం. చంద్రబాబు ప్రభుత్వంలో నాపై అక్రమంగా  కేసులు పెట్టారు .వాటిలో ఒక్కటి కూడా నిరూపించలేకపోయారు. నేను బీసీ ఎమ్మెల్యేను కాదా. మీరా బీసీల ఆత్మాభిమానం గురించి మాట్లాడేది. చట్టం ముందు కులాలు,మతాలు ఒక్కటే. 30లక్షల మందికి ఇళ్లు ఇస్తుంటే.. కోర్టుకు వెళ్లి దాన్ని కూడా అడ్డుకుంటున్నారు. 30లక్షల లబ్దిదారుల్లో 22లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ లబ్దిదారులు ఉన్నారు. మీరు ఎన్ని ఇబ్బందులు సృష్టించినా పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి తీరుతాం’ అంటూ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. (టీడీపీ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు..)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top